ఒకసారి ఆసియా ఖండం అంతటా ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నది. నాటి భారతదేశపు చక్రవర్తి ధార్మికుడు. ఆయన దేశంలోని విద్వాంసులను, పండిత బ్రాహ్మణులను అందరినీ సమావేశపరిచి "ప్లేగువ్యాధి మన రాజ్యపు పొలిమేరల వరకూ వచ్చింది. మన ప్రజల్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలో చెప్పండి" అని అడిగాడు.

పండితులు అనేక శాస్త్రచర్చలు చేసిన తరువాత" మహారాజా, ఇది శివ భగవానుని ఆగ్రహ జ్వాల అని తోస్తున్నది. కాబట్టి మనం శివపరమాత్ముని కోపాన్ని శమింపజేయటం కోసం పూజలు, హోమాలు దేశమంతటా నిర్వహించాలి" అన్నారు. రాజుగారు వెంటనే ప్రజలంతా ఇండ్లలోనూ, దేవాలయాల్లోనూ విధిగా శివ పూజాదికాలు నిర్వహించాలని చాటింపు వేయించారు. దానికయ్యే ఖర్చును కోశాగారం నుండి చెల్లిస్తామనికూడా ఉదారంగా ప్రకటించారు.

పండితులంతా పూజలు మొదలుపెట్టిన తర్వాత వారానికి, మహేశ్వరుడు పెద్ద పూజారి కలలో కనిపించాడు. "మీకేం కావాలి?" అని అడిగాడు. పూజారిగారికి సంతోషంతో ఒళ్ళు పులకరించింది. ఆయన ఈశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేసి "స్వామీ, సమస్తలోకరక్షకా, శివా, మేం కోరేదేమిటో మీకు తెలుసు. మా రాజ్యం వైపుకు దూసుకువస్తున్న ప్లేగునుండి మమ్మల్ని కాపాడు" అని ప్రార్థించాడు. శివుడు "తధాస్తు! మీ ప్రార్థనలకు నేను చాలా సంతసించాను. నా భృత్యుడైన నంది మీ రాజ్యాన్ని ప్లేగు బారిన పడకుండా కాపాడతాడు" అని అంతర్థానం అయిపోయాడు.

మరునాడు ఉదయాన ఆ శుభవార్త రాజుగారికి చేరింది. ఆయన గుండెలమీది భారం తగ్గింది. సంతోషపూర్వకంగా రాజుగారు ఒక్కొక్క పండితుడికీ 25 పాడిఆవుల్నీ, 50 బస్తాల ధాన్యాన్నీ ఇచ్చి సత్కరించి పంపాడు.

ఇక, నంది రాజ్యపు పొలిమేరల్లో అంతటా పహారా కాస్తున్నాడు దీక్షగా. ప్లేగు ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి చొరకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాడు. ఒకనాటి రాత్రి, ఆయన గస్తీ తిరుగుతున్న సమయంలోనే, ప్లేగు వ్యాధి ఒక భయంకరమైన ఆకారం ధరించి ఆయన ముందు ప్రత్యక్షమైంది - "నేను రాజ్యాన్ని కబళించి తీరతాను" అంది గర్జిస్తూ. నంది త్రిశూలాన్ని పైకెత్తి "దుర్మార్గుడా, నా కళ్లముందు నిలువకు. పారిపో. ఒక్క అడుగు ముందుకు వేసినా, నీ పని అంతటితో సరి" అని ఎదుర్కొన్నాడు. ప్లేగువ్యాధి వెనక్కు తగ్గలేదు; దాంతో నందికి, ప్లేగుకు నడుమ ఘోరయుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో పర్వతాలు సైతం పిండి పిండి అయిపోయాయి. పురాతన వృక్షాలు పెకిలింపబడ్డాయి. నదులు పొంగి పొర్లాయి. యుద్ధం అనేక రోజులు సాగింది. చివరికి ఇరువురికీ సంధిబాట పట్టక తప్పలేదు. అతి కష్టం మీద ఇద్దరికీ రాజీ కుదిరింది - దాని ప్రకారం, ప్లేగువ్యాధి రాజధానిలో కేవలం ఒక్కరోజు పాటు మాత్రమే ఉంటుంది; కేవలం ఒక్క మనిషిని మాత్రమే కబళిస్తుంది.

అయితే ఆ మర్నాటి సాయంత్రం నగరమంతా గగ్గోలెత్తింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందమంది ప్లేగుబారిన పడ్డారన్న వార్తలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాజుగారు వెంటనే పండితులను పిలిచి కారణమడిగాడు. వాళ్ళంతా వెంటనే నందిని ప్రార్థించి కారణం అడిగారు. నందికి పట్టరాని కోపం వచ్చి ప్లేగు కోసం వెతుక్కుంటూ తిరిగాడు. చివరికి ఒక శిథిలగృహపు దుమ్ముగొట్టిన నేల చీలికలో నక్కిఉన్న ప్లేగును పట్టుకున్నాడు. దాని మెడ పట్టుకొని బయటికి లాగి, నంది - "నీచుడా! నువ్వు నీ మాట నిలుపుకోలేదు. ఒక్క మనిషిని బలి తీసుకుంటానని చెప్పి నువ్వు ఇప్పటికి ఒకరిని కాదు, వందమందిని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు దీనికి తగిన మూల్యం చెల్లిస్తావు" అని గర్జించాడు.

నంది మెడపట్టుతో ఉక్కిరిబిక్కిరవుతూ కూడా, ప్లేగు వికవికా నవ్వాడు. "సోదరా, నేను మాట తప్పలేదు. నాపై కోపగించుకోకు. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కరినే కబళించాను. కానీ మిగిలిన తొంభైతొమ్మిది మందీ భయంతో చనిపోయారు. నేనేం చేసేది? వీళ్లకు మామూలు జ్వరం, కొన్ని గ్రంధుల వాపు వచ్చాయంతే. దాన్నే నా రాక అనుకొని వాళ్ళు భయం కొద్దీ చచ్చిపోయారు- అంతేతప్ప వాళ్ల మృతికి నిజంగా నేను కారణం కాదు" అన్నాడు. నంది పట్టు వదిలాడు. ప్లేగు గాలి పీల్చుకున్నాడు.