మధ్యవయస్కుడైన సోమయ్యకు సంతోషం తక్కువైంది. భార్య సుబ్బమ్మ ముసలిదాని మాదిరి అగుపించసాగింది. చివరికి ఆమె ఎంత పోరుతున్నా వినక, రెండో పెళ్లి చేసేసుకున్నాడు.

రెండో భార్య దుర్గ పడుచుది. పేరుకే కాక నిజంగా కూడా దుర్గే. దుర్గమ్మకు, సుబ్బమ్మకు ఒక్క క్షణం కూడా సరిపడేది కాదు. ఇద్దరి మధ్యా కొన్నాళ్లు నలిగిపోయిన సోమయ్య, మధ్యే మార్గంగా ఇద్దరికీ వేర్వేరు ఇళ్లు కట్టించాడు. తనేమో ఒక్కొక్కరిదగ్గరా ఒక్కో రోజు గడిపేటట్లు ఒప్పందం చేసుకొని నవ్వుకున్నాడు ఉల్లాసంగా.

అతను రోజు విడిచి రోజు చిన్న భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమె అతన్ని కూర్చోబెట్టి, పేన్లు చూసే వంకతో అతని తలలోని తెల్ల వెంట్రుకలని ఒక్కొక్కటిగా పీకేసేది. తన మాదిరే పడుచుగా, తుమ్మెద రెక్కల్లాంటి నల్లని జుట్టుతో కనబడే మొగుడిని చూసుకొని మురిసిపోయేది.

అయితే మరుసటి రోజున సోమయ్య, పెద్ద భార్య సుబ్బమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, ఆమెకు అతని నల్ల జుట్టుని చూసి అసూయ వేసేది: ‘తను ముసలిదైపోతూంటే ఈయన కుర్రవాడిలా కులుకుతున్నాడు!’ అందుకని ఆవిడ మొగుడిని కూర్చోబెట్టి, బలవంతంగా అతని తలలోని నల్ల వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా పీకేసేది.

అలా కొద్ది రోజుల్లో సోమయ్యకు తలమీద జుట్టు అనేదే లేకుండా పోయింది!