ఓ.. తంగేడుపూత నేరేడుకాత గువ్వలమోత కోయిల కూత అడవితల్లికి అందమయ్యింది ఈ అడవికంటే స్వర్గమేడుంది ।ఓ.. తంగేడుపూత। పువ్వుల పైన తుమ్మెద రాగం తియ్యని పాటలు తలపిస్తుంటే సెలయేటి దూకుడుల్లో మద్దెల మోతలు వినిపిస్తుంటే పిల్లగాలికి పచ్చని చెట్లు నాట్యం రీతి కదులుతు ఉంటే ఆ సుందర దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నా ।ఓ.. తంగేడుపూత। ప్రకృతి ఇచ్చిన ఆశలల్లే గండుశిలల బారులు చూడు బెదురు చూపులతో వాటిపై ఎగిరే లేడిపిల్లల గుంపులు చూడు తోడుకోసం రొప్పలు రొప్పే ఎలుగుబంటి అరుపులు చూడు నెచ్చెలికోసం నాట్యం చేసే నెమలి పించపు రంగులు చూడు ।ఓ తంగేడుపూత। అమ్మవోలే ఆకలి తీర్చే తియ్యని ఫలములు ఇచ్చే చెట్లు ఎన్నోజీవుల అక్కున చేర్చి ఆదరించే దేవతలట్లు ప్రాణికోట్లను రక్షించేటి ప్రాణ వాయువును అందిస్తాయి తల్లిని పోలిన గొప్పది చెట్టు తట్టి చూడు మది నీకే తట్టు ।ఓ తంగేడుపూత।