ఒక ఈగ పిల్ల ఎగురుతూ పోతూంటే దానికో సైకిల్ చక్రం కనిపించింది.
అన్ని చక్రాలూ నల్లగా, మురికిగా ఉంటే, ఈ చక్రం మాత్రం తెల్లగా మెరిసిపోతోంది.  మూడు చక్రాల సైకిల్ దేమో, చిన్నగా ఉంది.  మోటార్ సైకిల్ చక్రానికి మల్లే దాని లోపల ఐదు నీలం రంగు కడ్డీలు ఉన్నాయి.  మొత్తం మీద చాలా తేలికగా ఉంది అది.  
దాన్ని చూసేసరికి ఈగ పిల్లకు చాలా సంతోషం వేసింది.  
"భలే! ఇక నేను ఎగరాల్సిన పని లేదు.  దీని మీద కూర్చుని దొర్లించుకుంటూపోతే సరి!" అనుకుంది.  
ఒక్కసారి ఎగిరి దాని టైరు మీద వాలిందోలేదో, ఆ చక్రం దొర్లటం మొదలెట్టింది.  మరుక్షణంలో చక్రం పైనున్న ఈగ తలకిందులుగా చక్రం అడుక్కి వచ్చేసింది.  ఇంకా కొంచెం ఆగి ఉంటే అది చక్రం కింద పడి నలిగిపోయేది!  ఈగ వెంటనే పైకి ఎగిరి, మళ్ళీ చక్రం టైరు మీద వాలింది.  
చక్రం దొర్లుకుంటూ పోతోంది.  ఇప్పుడు దాని వేగమూ పెరుగుతోంది.  
కళ్ళు మూసి తెరిచేంతలో ఈగ మళ్ళీ చక్రం కిందికి చేరుకున్నది తలకిందులుగా.  
మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చుంది టైరు మీద.  ఊపిరి పీల్చేంతలో మళ్ళీ చక్రం అడుక్కి చేరుకున్నది.  
చక్రం పోతూనే ఉన్నది. క్రింది ఈగ శ్రమ పడి పైకి ఎక్కి కూర్చుంటూనే ఉంది- ఊపిరి వదిలేంతలో అది మళ్ళీ చక్రం అడుక్కి చేరుకుంటోంది.
ఇక ఇది పని కాదనుకున్నది ఈగ.  
ఈసారి ఎగిరినప్పుడు అది చక్రం కడ్డీ మీద వాలింది.  
ముందుగా అది ఆ కడ్డీ పై వైపుకి పోయింది.  అంతలోనే ఆ కడ్డీ నిటారుగా అయిపోయింది! కిందికి జారిపోకుండా ఈగ దాన్ని గట్టిగా పట్టుకున్నది.  మరుక్షణంలోనే ఈగ తలకిందులైంది! అయినా దానికి కడ్డీని వదిలేంత ధైర్యం లేకపోయింది.  అంతలో అది తల కిందులుగానే నిటారుగా అయ్యింది!  ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపల మళ్ళీ మామూలుగా అయిపోయింది.  
చక్రం ఇంకా వేగంగా పోవటం మొదలుపెట్టింది. ఈగ మాటిమాటికీ నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా అవుతున్నది.
దానికి మొదట్లో సంతోషం అనిపించింది:  ‘ పిల్లలు రంగుల రాట్నంలో ఇలాగే కదా, తిరుగుతారు?’ అనుకుందది.  కానీ అంతలోనే దానికి కళ్ళు తిరగటం మొదలైంది.  కడుపంతా ఏదోలా వికారంగా అవుతున్నది.  
మెల్లగా అది కడ్డీ లోపలి అంచు వైపుకి జరిగింది-చక్రం కేంద్రం వైపుకు.  ఇప్పుడు ఇంకా తొందరగా అది చుట్టూ తిరుగుతున్నది.  
బాగాలేదని అది చక్రంలోంచి బయటకు దూకింది, గడ్డిమీదకు. చక్రం ముందుకు పోతూనే ఉంది.
ఈగ గడ్డిమీద నిలబడి, ముందుకు దొర్లుకుంటూ పోతూన్న చక్రం వైపే ఇష్టంగా చూసింది.  అప్పుడు దానికో సంగతి అర్థమైంది.  
దాని వెనక ఎగురుకుంటూ పోయింది.  ఆ చక్రం ఇరుసుమీద వాలింది.  
ఇప్పుడది గుండ్రగా తిరగటం లేదు.  
రాజా మాదిరి ముందుకే పోతున్నది - సుఖంగా, ఉల్లాసంగా ఉన్నది.  
తన తెలివిని చూసుకొని ఈగ పిల్ల చిరునవ్వు నవ్వింది.  
చక్రం గుండ్రంగా తిరిగినా ఇరుసు మాత్రం తిరగదని దానికి తెలిసిపోయింది!
