1. ఒకసారి పల్లెటూరి రంగన్న తిరుపతికి బయలుదేరాడు. అతనెప్పుడూ బయట తిరిగి ఎరుగడు. పైగా మహా మొరటుగాడుకూడా. అతనికి తాంబూలం నమలడం అలవాటుండేది. ప్రయాణానికి బయలుదేరుతూ ఒక కట్ట ఆకులూ, డబ్బా నిండా సున్నం, తిత్తినిండా వక్కపొడీ, పొగాకూ పెట్టుకున్నాడు. రైలెక్కాడు. కిటికీ సీటు దొరకలేదు. ఇక మనవాడు పని మొదలుపెట్టి, రైలులోనే ఉమ్మటం మొదలుపెట్టాడు. అందరూ అతన్ని అసహ్యించుకున్నారు; కానీ అదంతా అతనికేమీ అర్థంకాలేదు. తనపని తానుచేసిచేసి, తనపక్కనున్న స్థలాన్నంతా ఎర్రగా అలికినట్టు చేసేసాడు. ఇంతలో రైల్వే ఉద్యోగి ఒకాయనొచ్చి అక్కడి పరిస్థితిని గమనించి, రంగన్నను మందలించాడు. రంగన్న చాలా బాదపడ్డాడు. అతని బాధను గమనించిన మరో మొరటోడు ’ఇలా ఎక్కడ పడితే అక్కడ తాంబూలం నమిలి ఉమ్మరాదట. స్టేషన్లో ఒక పెద్ద ఆడబొమ్మ నోరుతెరిచి ఉంటుంది. అక్కడ, ఆ బొక్కలోకి ఉమ్మాలట. ఈ సంగతి ఇలాగే నాకొకాయన చెప్పాడు’ అని చెప్పాడు. తిరుపతి వచ్చింది. అందాకా నోటినిండా నమిలి ఉంచుకున్న నములునంతా ఎక్కడుమ్మాలా అని ఎర్రబొమ్మకోసం వెతుకుతున్న రంగన్నకి, ఎదురుగుండా ఒక ఇంగ్లీష్ మహిళ కనిపించింది. ప్రయాణంలో బాగా అలసి ఉన్నదేమో, ఆమె అక్కడే ఒక గోడకు తలను ఆన్చి, నోరు తెరిచి మరీ నిద్రపోతున్నది. చూసేందుకు ఎర్రగా, బొమ్మలాగానే ఉన్నది. ఇంకేముంది? రంగన్న ముందుకు దూకి తన పని కానిచ్చాడు! విధి బలీయం, ఆ తరువాత రంగన్నకేమైందో ఎవ్వరికీ తెలీదు, నాక్కూడా!

  2. ఆదివారం సాయత్రం ఒక కుటుంబం పిక్నిక్కి వెళ్ళారు. చెరువులో బోటు షికారుకెళ్ళారు. ఇంతలో పిల్లవాడి ఐస్ క్రీం నీళ్లలోకి పడిపోయింది. ’అమ్మా! ఐస్ క్రీం నీళ్లలో పడిపోయిందమ్మా’ అని ఏడుపు మొదలెట్టాడా పిల్ల పిడుగు. ’బయటికెళ్ళాక మరోటి కొనిస్తానులేరా’ అని బాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది తల్లి. ’నాకదే కావాలి, అంతే- అదే కావాలి’ అని పిల్లాడు పట్టుబట్టాడు. అబ్బాయి ఎంతకీ వినకపోయేసరికి, ’అదే ఐస్ క్రీం రేపు మనింటికి కుళాయిలో నీళ్ళతోపాటుగా వస్తుందిలే బాబూ!’ అని నమ్మబలికిందావిడ. వాడు ఏమనుకున్నాడో, ఏమో ఏడుపు మానాడు. అదే కుటుంబం మర్నాడూ పడవ షికారుకొచ్చారు. ఆ రోజు పొరపాటుగా ఆ పిల్లవాడి తండ్రి కాలుజారి నీళ్లలో పడిపోయాడు. తల్లి కంగారుగా ’అయ్యో! నా భర్త! నీళ్ళలో పడిపోయాడు. రక్షించండి! కాపాడండి!’ అని అరవడం మొదలుపెట్టింది. కానీ ఆ బుడుగు పిడుగులో మాత్రం చలనం లేదు- ’ఊరుకోవే అమ్మా! నీళ్ళలో పడితే ఇంతలా అరవటం ఎందుకు? రేపు కుళాయిలో వస్తాడులేమ్మా నాన్న! ఇప్పుడు ఏడుపాపు!’ అన్నాడు వాడు.