అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. నక్క అంటే "జిత్తులమారిది" అని అందరికీ తెలుసు. కానీ ఈ అడవిలోని నక్క జిత్తులమారిదే కాక, మహా బద్దకపు నక్క కూడానూ. కూర్చున్న చోటికే తిండి రావాలి, దగ్గరగా వచ్చిన జంతువులనే చంపి తింటుంది. ఒకసారి నాలుగైదు రోజులుగా దానికి తిండి దొరకలేదు. ఏ జంతువూ దొరక్క, ఆకలితో నీరసం వచ్చింది దానికి. ఇక నడవలేకపోయింది. ’ఇలాగే ఇంకో రెండు రోజులు తిండి దొరక్కపోతే నా పని అంతే’ అనుకుంది నక్క.
ఇంతలో బలిసిన గాడిద ఒకటి అటుగా వచ్చింది. హాయిగా తన మానాన తను మేయసాగింది. నక్కకు గాడిదను చూడగానే నోరూరింది. నేనిక ఆకలితో చావనవసరం లేదు. దేవుడు నాకోసమే ఈ గాడిదను పంపించాడు అనుకుంది నక్క. పాపం గాడిద మాత్రం నక్కను ముందుగా చూడలేదు. తీరా దగ్గరికి వచ్చాక చూసింది. భయంతో వణికిపోయింది. ’ఇక నాకు చావు ఖాయం’ అనుకుంది గాడిద.
కానీ గాడిద చాలా తెలివైనది. భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది. ఆ మరుక్షణం నుంచీ వెనక కాలుతో కుంటుతూ నడవసాగింది. బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా. ఇదంతా గమనించిన నక్కకు చాలా చాలా సంతోషమయింది. కుంటి గాడిద పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది. ’ఇక ఈ గాడిద నాచేతిలో చావడమూ, నాకడుపు నిండడమూ ఖాయం’ అనుకుంటూ నిదానంగా నక్కుతూ గాడిదను సమీపించింది.
’ఏమిటి సంగతి, కుంటుతున్నావు?’ అని అడిగింది. ’కాలిలో ఒక పెద్ద ఈతముల్లు గుచ్చుకుంది నక్క బావా! అబ్బా! ఒకటే బాధ’ అని చెప్పింది గాడిద. ’అయితే ఎవరితోనయినా తీయించుకోలేక పోయావా?’ అంది నక్క. ’చాలా మంది చూశారు, కానీ ఎవ్వరూ ముల్లును బయటికి తీయలేకపోతున్నారు నక్కబావా!’ అన్నది గాడిద.
రానురానూ నక్కకు మహదానందమవ్వసాగింది. ’అయ్యో! అవునా! అయితే నీ బాధను నేను పోగొడతాను’ అన్నది నక్క. ’ఎలా? ఎలా పోగొడతావు?’ అని గాడిద అడిగింది. ’నేను ఇప్పుడే నిన్ను చంపి తింటాను . ఇక నీకు ముల్లుబాధ ఉండనే ఉండదు!’ అన్నది నక్క ఉత్సాహంగా. ’అవునా! అయితే త్వరగా నన్ను చంపెయ్యి నక్కబావా! నాకీ ముల్లు బాధను త్వరగా తప్పించు’ అన్నది గాడిద.
అనుమానంగానే నక్క గాడిద మీదకు రాబోయింది. అంతలో ’ఆగాగు నక్క బావా! ఒక్క క్షణం ఆగు- నా కాలిలో ఉన్న ముల్లు చాలా పెద్దది. నువ్వు నన్ను తినటంలో ఆ ముల్లు సంగతి మరిచిపోయినట్లున్నావు. ఆ ముల్లు నీ గొంతులో ఇరుక్కుందంటే ఇక నీ పని సరి! ముందు ముల్లును తీసేసి, ఆ తరువాత నన్ను హాయిగా ఆరగించు’ అన్నది గాడిద. ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లైంది. ’అవును , ఆ ముల్లు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకా ఆలోచనే రాలేదు. చావబోయే గాడిద నాకు చాలా మేలు చేసింది’ అనుకుంది. అయినా పైకి ఏమీ అనలేదు. నక్క ఇతరులను ఎప్పుడూ మెచ్చుకోదు కదా!.
’సరే, సరే. ఏదీ, ఆ ముల్లున్న కాలినిలా ఇవ్వు! ఆ ముల్లు సంగతి నేను చూస్తాను’ అన్నదది. ’ఎందరో చూశారు, సరే నువ్వూ చూడు’ అంటూ గాడిద కాలిని నక్కకు చూపింది. నక్కకు ఏమీ కనిపించలేదు. కళ్ళు నులుముకొని మరీ చూసింది. మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది. ’చాలా లోపలికి దిగింది నక్క బావా!’ అన్నది గాడిద. నక్క ఆనందమే ఆనందం. ఎప్పుడెప్పుడు ముల్లును తీద్దామా, గాడిదను తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు. ముల్లును చూడటంలోనే లీనమైపోయింది. అదనుకోసం వేచి చూసిన గాడిద సమయం రాగానే తన కాలిని సత్తువకొద్దీ జాడించింది. అంతే! నక్క బంతిలా గాలిలోకి ఎగిరిపోయింది. అంత ఎత్తు నుండీ నేలపై దభీమని పడ్డది. చుక్కలు కనిపించాయి దానికి. ఎక్కడి ఎముకలు అక్కడే పటపటా విరిగిపోయాయి. గాడిదేకదా అని తక్కువగా అంచనా వేసిన నక్కకు మంచి గుణపాఠమే లభించింది.