మంచి ఎండకాలం.

ఎండ పెళపెళలాడుతోంది.

ఒక పిల్లకాకికి చాలా దాహమయింది.

ఎటుచూసినా ఎండిపోయిన గుంటలే.

నీటి బొట్టు కానరాలేదు.

ఎండలో ఎగిరీఎగిరీ అలసిపోతున్న తరుణంలో దానికొక కూజా కనిపించింది.

సన్నమూతి కూజా.

దొర్లించడానికి వీలులేని కూజా.

చిల్లి పొడిచేందుకు వీలుకాని కూజా.

దానిలో అడుగున ఎక్కడో నీళ్ళున్నాయి. వెంటనే అది చుట్టూ వెదికింది. గులక రాళ్ళకోసం. తన ముత్తాత మాదిరి. ఒక్కొక్కటిగా గులక రాళ్ళను తీసి, కూజాలో వేసింది. ఆశతో ముక్కుని తడుముతూ.

ఎన్ని వేసినా నీళ్ళుమాత్రం పైకిరాలేదు.

కూజా రాళ్ళతో నిండిపోయింది.

పిల్లకాకికి ఆశ్చర్యంవేసింది - "ఇదేంటి,ఇది తప్పెలా అవుతున్నది? తరతరాలుగా తల్లి పిల్లకు, పిల్లలపిల్లలకు చెప్పుకొస్తున్న ఈ కథ తప్పెలా అవుతున్నది?"

నీళ్ళ టబ్బులో కూర్చుని లేచిన ఆర్కిమెడిస్ చెప్పిన సూత్రాలు పనిచేయడం మానేశాయా?

ఏమో, తెలీదు. నీళ్ళు మాత్రం పైకి రాలేదంతే.

ఇలాంటి చరిత్రలు చాలానే ఉన్నాయి. చాలా కాలంక్రితం ప్రభుత్వాలు పంచిన పొగరాని పొయ్యిలు, కొంతకాలం క్రితం ఇజ్రాయల్ పద్ధతిలో చేసిన కార్పొరేట్ వ్యవసాయం, ఈ మధ్యకాలంలో నడుపుతున్న కార్పొరేట్ బడుల, కార్పొరేట్ ఆసుపత్రుల సౌకర్యం........

అయినా ఈ కాకికథకు కొత్తగా పుట్టిన పిల్లలు ఊఁ కొడుతూనే ఉన్నారు. తమ పిల్లలకు ఈ కాకమ్మ కథను చెప్పుకుంటూనే పోతున్నారు - గర్వంగా, ఏవో తెలివితేటల్ని అందిస్తున్నామన్న ఉత్సాహంతో-

గాలికి బరువుందని చూపాల్సిన బెలూన్ల ప్రయోగం మాదిరి-

అవి ఎప్పటికీ చూపవు; మనం ఆ ప్రయోగాన్ని ’చెప్పకుండా’ ఉండనూ ఉండం. మళ్లీ ఒక సారి చూ(పి)స్తే చాలు - నిజం తెలిసిపోతుంది. అందుకే మనమెంతగా ఎరిగిన సత్యాలనైనా ఒక్కసారి ఇంకొంచెంగా పరీక్షించుకుంటే మంచిదేమో. శాస్త్రీయతని పుస్తకాల్లోనుంచి లేవనెత్తి ఇంకొద్దిగా జీవితాల్లోకి రానిస్తే నయమేమో. ఏమంటారు?

ఈ నెల కొత్తపల్లి పత్రిక పిల్లల సుకవి, కవికాకి, ధన్యజీవి, కీర్తిశేషులు జైసీతారాం గారికి అంకితం. శాస్త్రీయతను, సున్నితత్వాన్ని, ప్రకృతి సౌందర్యారాధనను రంగరించి ఆయన రాసిన బాలల గీతాలు అద్భుతాలు. కోకిలను కాదని కాకిని ఎంచుకున్న జైసీతారాంగారు నవంబరు పద్నాలుగున పుట్టారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా, కొత్తపల్లి ప్రచురణల తరపున, ఆయన స్వీయ రచనలతోటే ఆయనకో అక్షర హారాన్ని ఇద్దామని ఉన్నది. ఆయన స్వరాన్ని అందరూ వినేందుకు, చదివేందుకు, చూసేందుకు వీలుగా ఆయన గేయ సంకలనాన్ని ప్రత్యేకంగా ఇంటర్నెట్లో ఉంచుదామని సంకల్పం. రఘుబాబు, మంచిపుస్తకం సురేష్ లు సేకరించి, జాగ్రత్తగా భద్రపరిచి, అందించిన ఈ అమూల్య రత్నం ఇక సుజనులందరిదీ కాగలదు. ఈ ప్రయత్నానికి మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ,

కొత్తపల్లి బృందం.