ఒక ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టుమీద ఒక కాకిజంట నివసిస్తూ ఉండేది. రోజూ ఊళ్ళోకి పోవడం, అక్కడా, ఇక్కడా పడిఉండే పండ్లనూ, కాయకూర ముక్కల్ని, ఎలుకల వంటి జీవాల్నీ పట్టుకొని తినటం వాటి దినచర్యలో బాగంగా ఉండేది. మిగిలిన కాకుల మాదిరి, అవి, చిన్న పిల్లల్ని బెదిరించడం, వాళ్ల దగ్గరున్న తిండిపదార్థాల్ని లాక్కోవటం వంటివి చేసేవికాదు.

ఈ కాకుల ప్రశాంత జీవనం ఒక కోతి కారణంగా అస్తవ్యస్తమైంది. కొత్తగా ఎక్కడనుండో ఊళ్ళోకి వచ్చిన ఈ కోతికి హడావిడి, గందరగోళాలంటే మహా ప్రీతిగా ఉండేది. అది రోజుకో చెట్టును మారుస్తూ చివరికి కాకుల జంట ఉంటున్న రావిచెట్టునే తన నివాసంగా ఎంపిక చేసుకుంది. కాకులు ఎంతో శ్రమ పడి కట్టుకున్న గూడును అది చిందరవందర చేసేసింది. ఎవరైనా ప్రేమకొద్దీ కాకులకు ఏమైనా ఇవ్వబోతే అది మధ్యలోకి వచ్చి దూకి, వారిని భయభ్రాంతుల్ని చేసి, వాటిని లాక్కుపోయేది.

కాకి జంట తమ కష్టాల్ని మిగిలిన కాకులకి చెప్పుకొని కంటతడి పెట్టుకున్నది. కానీ అవి మాత్రం ఏమిచేస్తాయి, ఓదార్చడం తప్ప? " కష్టాలు ఎంతో కాలం ఉండవు, పైవాడున్నాడు" లాంటి ముచ్చట్లు చాలా చెప్పాయి; కానీ కష్టాలు తీర్చే మార్గం మాత్రం ఎవ్వరికీ కానరాలేదు.

రానురానూ కాకుల కష్టాలు ఎక్కువయ్యాయి. కాకులన్నింటికీ ఇప్పుడీ బెడద పట్టుకున్నది. ఇక వాటికి ఇప్పుడీ సమస్య తీర్చుకోక తప్పనిదయింది. రోజూ అవన్నీ రావి చెట్టుమీదికి చేరుకొని చర్చిస్తున్నాయి. మొదట్లో ఏడెనిమిదికాకులు చేరేవి, ఇప్పుడు వందల సంఖ్యలో కాకులు - అన్నీ గోలగోలగా, గజిబిజిగా అరుస్తున్నాయి; మాట్లాడుతున్నాయి. కోతిమీద తమకున్న కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఉండిన నిశ్శబ్దం ఇప్పుడక్కడ లేదు.

శాంతి వెనక దాగిన అశాంతి ఇప్పుడు ముసుగును చీల్చి బయటికి వస్తున్నది.

కొన్ని ముసలికాకులు కోతికి ప్రేమగా చెబుతున్నాయి - అడవిలోకి పొమ్మని.

కొన్ని కోతికి అడవిలోంచి నేరేడుపళ్ళు తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టాయి.

కొన్ని కోతిని బెదిరిస్తున్నాయి, అవమానిస్తున్నాయి.

కొన్ని కాకులు కోతిపై దాడి చేయదం మొదలుపెట్టాయి.

కాకి గోల ఎక్కువైందని మనుషులు కర్రలు పట్టుకొని వచ్చి కోతిని తరమసాగారు.

కోతికి బెడద ఎక్కువనిపించింది. ప్రాణానికి అపాయమేమో అనిపించింది. అడవిలో నేరేడు పళ్ళు, కలవి కాయలూ, బలిజ పళ్ళూ రుచిగా అనిపించసాగాయి.

ఒక రోజు సాయత్రం ఇక కోతి ఊళ్ళో కనిపించలేదు.

కాకుల జీవితాలు తిరిగి గాడిలో పడ్డాయి.