అనగా అనగా ఓ కలియుగంలో పీడాంతకం అనే ఓ దేశం ఉండేది. ఆ దేశంలో ఉండే జనాలందరిదీ ఒకే మతం. మత పెద్దలంతా కలిసి ఆ దేశం ఎట్లా ఉండాలో రాసుకున్నారు. వాళ్ల దేవుడి చలవ వల్ల వాళ్ల బ్రతుకులూ అమోఘంగా నడుస్తూ పోయాయి. ఆ దేశంలో చాలా ఇసుక ఉండేది. వాళ్ళు ఆ ఇసుకతో ఏం చేయచ్చో కనుక్కున్నారు. వాళ్ల దేశంలో చాలా ఎండ ఉండేది. వాళ్ళు ఆ ఎండకు తట్టుకోవటమే కాక, దాంతో ఇంకా ఏం చేయచ్చో కనుక్కున్నారు.
ఒకసారి మత పెద్దలంతా కలిసి దేవుడిని ప్రార్థించారు "దేవుడా! మాకు అంతులేని సంపద కావాలి" అని. దేవుడు వాళ్లకు కనబడకుండానే నవ్వి, "నాయనలారా! మానవులు అంతులేని సంపదల్ని తట్టుకునే సమయం ఇప్పుడైతే లేదు. అయినా మీరు అంతగా అడిగితే నేను ఇవ్వక తప్పదు కాబట్టి, ఇచ్చేస్తాను- కానీ దానివల్ల వచ్చే ఫలితాలకు బాధ్యత మీదే! తర్వాత నన్ను ఏమీ అనకండి" అని చెయ్యి ఇట్లా తిప్పేశాడు-
అంతే! ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ అతి విలువైన బంగారు గనులు వెలిసాయి. ఎంత త్రవ్వినా కరిగిపోనన్ని నిల్వలు! ఆ దేశపు ప్రజలు వేలం వెర్రిగా ఆ గనుల మీద పడి, శక్తి కొద్దీ త్రవ్వుకోవటం మొదలుపెట్టారు.
అట్లా త్రవ్విన బంగారాన్ని మత పెద్దలు వేరే దేశాలవాళ్లకు కొద్ది కొద్దిగా అమ్మటం మొదలు పెట్టారు. వేరే దేశాల్లో ఈ బంగారం ఎంత ఉన్నదో గానీ, వాళ్లకు మటుకు వీళ్ల బంగారం చాలా నచ్చింది. 'మాకు కావాలంటే మాకు కావాలి' అని వేర్వేరు దేశాలవాళ్ళు పీడాంతకం ముందు వరసలు కట్టి నిలబడటం ప్రారంభించారు.
పీడాంతకం ప్రజలకు అది నిజంగా పండగే అయ్యింది. విదేశాలలో తయారయ్యే ఆహారాలూ, సరుకులూ, వస్తువులూ అన్నీ వరదల్లాగా పీడాంతకం నిండా ప్రవహించాయి. అవి వాళ్ళకు ఎంత చవకగా అనిపిచావాయంటే, వాళ్ళంతా వాటిని రెట్టింపు ధరలకు కొనుక్కోవటం మొదలు పెట్టారు!
దాంతో బాటే పీడాంతకపు మత పెద్దలందరికీ విదేశాల్లో 'దగ్గరివాళ్ళు' తయారవ్వసాగారు. విదేశాల్లోని తమ స్నేహితులకు బంగారాన్ని తక్కువ రేటుకు అమ్మటం, తమకు దగ్గర కాని వాళ్లకు బంగారాన్ని ఎక్కువ ధరకు అమ్మటం- ఇట్లా మొదలు పెట్టారు కొందరు. ఆ సరికి పీడాంతకం ప్రభుత్వం వాళ్ళూ మేలుకొని 'పీడాంతకం బంగారు ధరల నియంత్రణ సంఘం' ఒకదాన్ని స్థాపించారు గానీ, అది ఏమంత గట్టిగా పనిచెయ్యలేదు.
మెల్లగా పీడాంతకపు మత పెద్దల్లో గందరగోళం, అభిప్రాయ భేదాలూ నెలకొన్నాయి.
"ఈ రాజు మన రాజ్యానికి అనుకూలంగా ఉన్నట్లు లేడు- బంగారం రేట్లు తగ్గిస్తే మరింత ఎక్కువ బంగారం అమ్ముకోవచ్చు!" అని కొందరు అనసాగారు. "రేట్లు మరింత పెంచాలి- మన బంగారం, మన ఇష్టం!" అని మరికొందరు అనటం మొదలుపెట్టారు.
పడమరన దూరంగా ఉన్న దేశాలవాళ్ళు కొందరు ఈ భేదాభిప్రాయాలకు ఆజ్యం పోశారు. ఒక వర్గపు మత పెద్దల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగద్రోశారు. మరోవైపునుండి పీడాంతకం ప్రభుత్వానికి వాళ్లను అణచివేయమంటూ తక్కువ ధరకు ఆయుధాలనూ సరఫరా చేశారు.
అట్లా పీడాంతకంలో అంతర్యుద్ధం ఒకటి మొదలైంది. బయటి దేశాల సహాయంతో రాజుగారిని అణిచివేసిన తిరుగుబాటుదారులు పీడాంతకానికి కొత్త రాజులైనారు. వాళ్ళు పడమర దేశాలకు బంగారాన్ని తక్కువ ధరలకు సరఫరా చేశారు కొన్నాళ్ళు. అయితే ఆ చర్యలవల్ల వాళ్లకు దేశంలో మంచిపేరు లేకుండా అయ్యింది. "మన బంగారాన్నంతా విదేశాలకు అమ్మేస్తున్నారు; చవకగా" అని పుకార్లు మొదలయ్యాయి. దాంతో వాళ్ళు రాను రాను బంగారు ధరలు పెంచటం మొదలెట్టారు. పడమర దేశాలవాళ్ళూ సామాన్యులు కాదు కదా, అందుకని వాళ్ళు ఇప్పుడు మరో తిరుగుబాటు దారుడికి రహస్యంగా సాయం చెయ్యటం మొదలెట్టారు. వీళ్ల ప్రభుత్వాన్ని కూలద్రోసి వాళ్లను అందలం ఎక్కించారు-
అట్లా పీడాంతకం ప్రజలంతా ముక్కలు ముక్కలైనారు. కోరి త్రవ్వుకున్న బంగారం వాళ్లపాలిటి శాపమే అయ్యింది. రాను రాను వాళ్ల ప్రభుత్వాలు పూర్తిగా పడమటిదేశాల అదుపు ఆజ్ఞల్లోకి వెళ్ళిపోయాయి. పడమటి దేశాలు వాళ్ల దేశంలో నేరుగా తమ బలగాలను నింపి పెట్టటమే కాకుండా, ఇసుక దిబ్బల్లో దాక్కున్న తిరుగుబాటు దారులపైన విమానాలతో దాడులు చేయించాయి.
అప్పుడు ఇక ఆ తిరుగుబాటుదారులు పడమటి దేశాలపైన నేరుగా యుద్ధానికి దిగారు. ఆ దేశాలనిండా ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చి భీభత్సం సృష్టించారు. అమాయకులు, సైనికులు అని చూడకుండా ఎవరిని పడితే వారిని ఊచకోత కోశారు. అట్లాంటి అమానవీయ పనులు చేస్తున్నారని ఇక వాళ్లకు మద్దతు ఇచ్చేవాళ్ళే లేకుండా పోయారు! 'దుర్మార్గులు! హంతకులు! తీవ్రవాదులు!' అని పడమటి దేశాలన్నీ వాళ్లమీద ప్రచారం ముమ్మరం కానిచ్చాయి.
అట్లా ఉంటుంది విక్రం, జీవితం! ఈ కథలో తిరుగుబాటుదారులు అమానుషంగా ఉన్నారంటారు పడమటి దేశాలవాళ్ళు. కాదు, 'మా జీవితాలు ఈ పడమటి వాళ్లవల్లనే నాశనమైనాయి' అంటారు పీడాంతకం ప్రజలు. అయినా జరిగిందానికంతటికీ బాధ్యత ఎవరిది? దీనికి సమాధానం ఆలోచించి చెప్పకపోతే నువ్వసలు మనిషివే కాదు! సమకాలీన సమస్యల పట్ల స్పందించని మనిషి బ్రతికీ ఏం ప్రయోజనం?" అన్నది బేతాళం.
శ్రద్ధగా విన్న విక్రముడు బేతాళాన్ని మెచ్చుకుంటూ "నీ ఆవేదన నాకు అర్థమౌతున్నది బేతాళం. నేనుగా అయితే ఈ పడమటి దేశాల ప్రచారాన్ని పట్టించుకోను: తాము త్రవ్విన గుంతలో తామే పడ్డట్లు, వాళ్లంతా పీడాంతకపు తిరుగుబాటు దారుల దాడులకు తట్టుకోవలసిందే. అయితే కోల్పోయిన తమ దేశ స్వతంత్రను, సమగ్రతను తిరుగుబాటు దారులు తెలివిగా సాధించుకొని నిలబడాలి తప్ప, అరాచకంతోటీ, ఆవేశంతోటీ సర్వమూ సాధించుకోగలమని అనుకోరాదు- ముఖ్యంగా వాళ్ళు ఇతర దేశాల స్వార్థాన్ని అర్థం చేసుకుంటూ, తమలో తాము కలహించుకోవటం మానాలి. తమ స్వార్థంకోసం దేశహితాన్ని ఎవ్వరూ త్యాగం చేయకూడదు.
నిజంగానే ఇందులో సందేహమేమీ లేదు: నువ్వన్నట్లు, స్వార్థం మనిషిలోని అతి బలీయమైన శక్తి. ఆ శక్తిని గురించి తెలిసినవాడు కాబట్టే, దేవుడు తన బాధ్యత ఏమీ లేదని చెప్పి ముందుగానే తప్పించుకున్నాడు. మానవ మాత్రులం, మనం ఏం చేయగలం చెప్పు?!" అన్నాడు.
విక్రముడి నోరు తెరిపించిన బేతాళం మాటలు ఆపి చటుక్కున తిరిగి చెట్టెక్కి కూర్చున్నది!