“దున్నపోత ! యేల దుక్కి దున్నవు నీవు ?
పంటలింక ఎట్లు పండు చెప్పు ?”
“కాడి కట్టలేదు నేడు మీ పాలేరు,
నాది కాదు తప్పు - నాది కాదు “
“ఏల కట్టలేదు పాలేర నాగలి ?
నిక్కి నీడలోన నిలిచినావు ?”
“రైతు ఇవ్వలేదు జీతమ్ము నెలనుండి,
నాది కాదు తప్పు - నాది కాదు “
“రైతు బిడ్డ! నీవు జీతబత్తెములేల
ఇవ్వలేదు, ధాన్యమింటదాచి ?”
“సోల దొరకలేదు చాల రోజులనుండి ,
నాది కాదు తప్పు - నాది కాదు “
“కట్టె కలప కిపుడు కరువు వచ్చినదేమి !
ఏల దొరకవీవు సోల, సోల ?”
“చెక్కి వడ్లవాడుచేయుచుండుట లేదు!
నాది కాదు తప్పు - నాది కాదు “
“వడ్ల వాడ ! గొప్ప వడ్రంగి మేస్తిరీ !
చెక్కి సోల నేల చేయ వీవు ?”
“బండబారిపోయి బాడిస తెగలేదు,
నాది కాదు తప్పు - నాది కాదు “
“బండబారినట్టి బాడిసా ! బాడిసా !
ఏల తెగవు చెప్పు మింక నీవు ?”
కాల్చలేదు నన్ను కమ్మరి కొలిమిలో,
నాది కాదు తప్పు - నాది కాదు “
“కాల్చవేల నీవు కమ్మరి! కొలిమిలో?
బాడిస అట్లు బండబారి పోవ?”
“కొలిమి మండలేదు – కూరుచుంటిని నేను
నాది కాదు తప్పు - నాది కాదు “
“కొలిమి! కొలిమి! అంటుకొనని కారణమేమి?
ఆరిపోవనేల అగ్గి అట్లు ?”
“తోలుతిత్తి చినిగి గాలి ఊదుట లేదు
నాది కాదు తప్పు - నాది కాదు “
“తిత్తి! తిత్తి! ఏల కొత్త తోలును తెచ్చి
కొలిమిలోన గాలి నిలుపవీవు ?”
“దున్న చావ లేదు తోలెట్లు లభియించు ?
నాది కాదు తప్పు - నాది కాదు “