మేఘవర్లుడు చెప్పిన కథను సావధానంగా విన్న నెమలి రాజు చిత్రవర్ణుడు కొద్దిసేపు ఆలోచించి, తల ఊపి, "అయినా, ఒక్క నిమిషం పాటు శత్రువుతో కలిసి ఉండటమే గొప్ప కష్టం వచ్చి మీద పడ్డట్లుంటుందే, మరి నువ్వు అంతకాలం పాటు ఆ హంసరాజు హిరణ్యగర్భుడి ఇంట్లో నిర్భయంగా ఎట్లా ఉన్నావో, తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉన్నది.
క్రూరులూ, భయంకరులూ అయిన ఆ శత్రు మూకల మధ్యన నువ్వు అంత ధైర్యంగా ఎట్లా ఉండగల్గావో చెప్పు!" అన్నది. మేఘవర్ణుడు అప్పుడు చిరునవ్వుతో మహారాజుకు నమస్కరిస్తూ, వినయంగా "ప్రభూ! 'పనిని నెరవేర్చుకోవాలి' అని అనుకున్నవాడు ఎవడైనా తన శ్రమను చూసుకోకూడదు- ఎవ్వరు ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకోవాలి. అవసరమైతే శత్రువును భుజానికి ఎత్తుకొని మోసి అయినా సరే తన కార్యాన్ని నెరవేర్చుకోవాలి. గతంలో ఒక ముసలి పాము తన అవసరం కొద్దీ కప్పలను తన వీపు మీద పెట్టుకొని మోసి, చివరికి తన సంకల్పాన్ని నెరవేర్చుకోలేదా? ప్రభువుల-వారికి ఆ కథ చెబుతాను- చిత్తగించండి" అని పాము-కప్పల కథ చెప్పసాగింది.
పాము-కప్పలు
కాంచీపురం సమీపంలోని పాడుబడిన అడవిలో ఎంతో కాలంగా నివసిస్తూండేది. 'మందవిషం' అనే ఓ ముసలి పాము. ఒక రోజున మధ్యాహ్న సమయంలో అది ఆహారం వెతుక్కొనేందుకు బయలుదేరి పోయింది.
అక్కడ దానికి 'కప్పల బెకబెకలు ఆకాశాన్నంటగా గంభీర జలాలతో విలసిల్లుతున్న' గొప్ప సరస్సు ఒకటి కనబడింది. "ఈ కప్పలన్నిటినీ తినగల్గితే ఎంత బాగుంటుంది! ఊరికే సరస్సులోకి దూకటం కాదు- మరేదైనా మార్గం ఆలోచించాలి" అనుకొని, అది ఆ సరస్సు ఒడ్డున నేలమీద పడగ వాల్చేసి, వ్యాధి పీడితమైన దాని మల్లే మూల్గుతూ పడి ఉన్నది.
దాన్ని చూసి అక్కడి కప్పలరాజు, జలపాదుడనేవాడు- దాని దగ్గరికి వచ్చి, "ఓ సర్పరాజా! నువ్వు తలచుకుంటే మహాబలవంతుడైన వాయుదేవుడిని సైతం ఒక్క గుటకలో మ్రింగివేయగలవు. అట్లాంటి నువ్వు, ఇక్కడ కప్పలు కుప్పలు తిప్పలుగా నీకు ఇంత దగ్గరలో, నిన్ను ఆనుకొనే దూకుతుంటే కూడా తినకుండా, కళ్లలో ప్రాణాలు పెట్టుకొని పస్తు పడి ఉండటం నాకు ఎంతో వింతగా అనిపిస్తున్నది. దీనికి ఏదైనా కారణం ఉందా, చెప్పు!" అన్నది.
అప్పుడు ఆ కాలనాగు "అయ్యో! కప్ప రాజా! నాకు ప్రాప్తించిన దుర్దశ ఎట్లాంటిదో నీతో ఎట్లా చెప్పమంటావు?! ఇంతవరకూ నేను ఏనాడూ పొట్ట పోసుకోవటం కోసం 'దేహీ!' అని ఒక్కరిని అడుక్కున్న వాడిని కాదు- ఇప్పుడు నాకు మీలాంటి వాళ్లను సేవించి పొట్ట పోసుకోవలసిన గతి పట్టింది. వెయ్యి మాటలెందుకు? ఇకమీద నేను మీ దాసుడిని- మీరు అనుగ్రహించి భోజనం పెడితే తింటాను; లేకపోతే వస్తుంటాను.
ఎందుకో చెబుతాను వినండి- నిన్న అర్థరాత్రి నేను ఆహారం కోసం తిరుగుతూండగా బ్రాహ్మణ పిల్లవాడొకడు అటుగా వచ్చి, దురుదృష్టం కొద్దీ నా తలమీద అడుగువేశాడు. ఆ అవమానాన్ని సహించ-లేక, నేను కూడా 'బుస్సు'మని విషం క్రక్కుతూ ఆ పిల్లవాడి కాలు పట్టుకొని తటాలున కరిచాను.
కాటు తిన్న ఆ బ్రాహ్మణ బాలకుడు భయంతో అరుచుకుంటూ ఇంట్లోకి పరుగెత్తి తండ్రికి సంగతంతా తండ్రికి చెప్పాడు. అంతలోనే విషప్రభావం కొద్దీ వాడు క్రిందపడి కంటి రెప్పలు మూస్తూ, తెరుస్తూ మూర్చపోయి, నోట్లో నురుగులు క్రక్కి చివరికి కళ్లు పూర్తిగా తేలవేశాడు.
బ్రాహ్మణుడు కూడా కొడుకును తొడలమీద పడుకోబెట్టుకొని, అంతులేని దు:ఖంలో మునిగిపోయి, పలు విధాలుగా ఏడవటం మెదలుపెట్టాడు. అప్పుడు అతని బంధుజనం అంతా వచ్చి చూసి, అతనికి ధైర్యవచనాలు చెప్పి పంపితే, అతను ఆ అర్థరాత్రి వేళ చిమ్మచీకట్లో, ఉరికంబం ఎక్కేవాడి కాళ్లు ముందుకు సాగనట్లు, ముందుకు పోనంటున్న పాదాలను ఈడ్చుకుంటూ పోయి, ఒక విషవైద్యుడిని పిల్చుకువచ్చాడు.
తన పిల్లవాడిని ఆ వైద్యుడి కాళ్ల మీద పడేసి, "ఇదిగో, ఇకమీద వీడు నీవాడే; మావాడు కాదు" అని మొత్తుకున్నాడు. చివరికి ఆ వైద్యుని కృపవల్ల విషం విరిగి ప్రాణాలతో లేచి కూర్చున్న కొడుకును చూసి మనసులో ఉవ్వెత్తున సంతోషం పెల్లుబడగా, "వీడు మీరు పెట్టిన ప్రాణమే, మీ చలవే!" నని ఆ వైద్యుని గొప్పదనాన్ని వేయి నోళ్లతో పొగిడి, సాగనంపాడు.
అంత జరిగినా నామీద ఆగ్రహం చల్లారక, బ్రాహ్మణుడు నన్ను శపిస్తూ "ఓ నాగమా! పున్నమినాటి చంద్రబింబాన్ని పోలే యీ అమాయకపు పిల్లవాడి మొహం చూసి దయ పుట్టటానికి బదులు, వాడిని కాటు వేసేందుకు నీకు మనసెట్లా వచ్చింది? ఎప్పుడూ బొరియల్ని, లోపాల్ని వెతకటమే పనిగా, వంకరటింకర బ్రతుకును యీడ్చే మీ పాపపు (పాముల) జాతికి- మీకు దయ ఎందుకు కల్గుతుందిలే! ఎలాంటి కారణమూ లేకుండా యీ విప్ర బాలకుడిని కరిచిన ఈ పాపం నిన్ను వదలకుండుగాక! అది నీ శరీరమంటా చుట్టుకొని, నీ అహంకారపు బురద అంతా ఇంకిపోయేంత వరకు, నీకు అహారంగా ఉండే కప్పలకే నీ చేత ఊడిగం చేయించుగాక! ఆ కప్పలు నీ పడగపైకి ఎక్కి ఊరేగి, దయతో ఏమైనా ఆహారం పెడితే, ఆ ఆహారం మాత్రమే నీకు అరుగు గాక!" అని రోషావేశాలతో అరిచాడు.
పాముల కష్టాలెంతటివో నీకు ఏమని చెప్పాలి? మీద పిడుగు పడ్డట్లు ఆ శాపపు పలుకులు నా చెవుల్లో పడి, నా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. నా ఒళ్ళు నా వశం కాకుండా అయ్యింది. దాంతో కాళ్లులేని వాడిలాగా కదలలేక, మెల్ల మెల్లగా ప్రాకుతూ మీ కృపా-కటాక్షాలకోసం ఇట్లా వచ్చాను. దైవం చేత కూడా తిరస్కరింపబడి, మీ పాదాలను ఆశ్రయించుకున్న నా చేయి విడువక, నన్ను మీ వాహనంగా చేసుకొని, ఇంత ఆహారదానం చేస్తూ కాపాడితే, నేను ఎప్పటికీ మీ పాదాలను సేవించుకుంటూ నా యీ పాడు బ్రతుకును వెళ్లదీస్తాను!" -అనేసరికి జలపాదం ఉప్పొంగి పోయింది.
'వాహనాన్ని అధిరోహించనున్నాను!" అనే ఉత్సాహం దాన్ని గ్రుడ్డిదాన్ని చేసింది; దాని వివేకాన్ని నాశనం చేసింది. పాడుపాము విసిరిన మాయ వలలో చిక్కుకున్న ఆ కప్పరాజు, అక్కడే నివసించేందుకు పాముకు అనుమతిని ఇచ్చేసింది. దాంతో మందవిషం కూడా దాన్ని తన పడగమీద ఎక్కించుకొని, కొంతసేపు చిత్ర విచిత్రంగా ఇక్కడా-అక్కడా త్రిప్పి, లేని బడలిక తెచ్చుకొని, రొప్పుకుంటూ, రోజుకుంటూ, తలను నేలవాల్చి కదలక-మెదలక ఉండిపోయింది. జలపాదం దాన్ని చూసి "నువ్వెందుకు, ఇట్లా నడవలేక పోతున్నావేమి?" అని అడిగింది.
మంద విషం మరింత నీరసం తటిస్తూ "స్వామీ! నిన్నటినుండి ఒక్క పిడిసెడు ఆహారం కూడా లభించకపోవటం వల్ల, శుష్క ఉపవాసంతో కడుపు మాడి, నా జవసత్వాలన్నీ ఉడిగిపోయినై; నేను బ్రతికి ఉండీ, శవం మాదిరి అశక్తుడినయ్యాను. ఆకలితో నకనక-లాడుతున్న నా కడుపుకు ఇకనైనా కొంత ఆహారం ఇస్తే తప్ప, ఇక నేను వాహన కార్యం ఏ విధంగా చేయగలను, చెప్పండి?! ఒకసారి కడుపునిండితే ఇక నేను ఎంత విచిత్రంగా అడుగులు వేస్తానో ప్రభువులవారే చూడవచ్చు!" అన్నది.
దాంతో కరిగిపోయిన జలపాదుడు ఆ మాటలు నిజం అనుకొని "ఓ పాము రాజా! నేను ఓ మాట చెబుతాను, విను. నువు ఇట్లా మధ్య మధ్య నన్ను అడగాల్సిన పనిలేదు- 'బాగా ఆకలి అయినప్పుడల్లా నీకు కావలసినన్ని కప్పలను తినవచ్చు' -అని ఒకే సారిగా నీకు ఇదిగో, అనుమతిని ఇస్తున్నాను. ఇక ప్రతిరోజూ నీకు ఇష్టం వచ్చినన్ని కప్పలను తినవచ్చు. ఇప్పుడిక పో! పోయి, నీకు కావలసినంత ఆహారం తీసుకొని రా, వాహనపు పని మళ్లీ చేద్దువు" అన్నది రాజసంగా.
"మహాప్రసాదం" అన్న మందవిషం నీళ్లలోకి దూకి, చిన్న చిన్న కప్పల్ని కొన్నిటిని కరువు తీరా మ్రింగి, కడుపు నింపుకొని, చటుక్కున వచ్చి కప్పరాజు ఎదుట నిలబడింది. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజూ కావలసినన్ని కప్పల్ని భోంచేసింది. మొదట సన్న కప్పలను, తర్వాత ఇంకొంచెం బలవంతులను, తర్వాత మంత్రులను- ఇట్లా క్రమంగా చెరువంతా జలవపాదం తప్ప వేరే ఏ కప్పలూ లేకుండా అయిపోయింది.
చిట్ట చివరికి, ఒంటరిదిగా మిగిలిన కప్పరాజుని సైతం దవడల్లో ఇరికించుకొని దాని మాంసం అంతా యిష్టంగా మెక్కింది మందవిషం.
ఆ తర్వాత "ఆహా! ఇప్పటికి కదా, నా వ్రతం పరిసమాప్తి అయ్యింది?!” అని సంతోషించి, అటుపైన ఆ కొలనును వదిలి వేరే చోటికి పోయింది ఆ పాము!
(...తర్వాత ఏమైందో మళ్ళీ చూద్దాం...)