చీనీ దేశంలో హూణుల పరిపాలన సాగుతున్న రోజులవి. ఆ రోజుల్లో కక్షలు, కార్పణ్యాలు చాలా ఎక్కువగా ఉండేవి అక్కడ. 'యువాన్-నంగ్' అనే ఉడుకు రక్తపు కుర్రవాడు చేసి పెట్టమన్న పనినేదో 'చావో-సో' అనే తోటి ఉద్యోగి ఒకడు చేసిపెట్టలేదు. దాంతో వాడికి చాలా కోపం వచ్చింది. అదను చూసుకొని 'చావో-సో'ను నిర్దాక్షిణ్యంగా చంపేసాడు వాడు. అయితే ఆ తర్వాత వాడికి ఇక శాంతి లేకుండా పోయింది. ఏవేవో ఆలోచనలు రావటం మొదలు పెట్టాయి. పగలూ - రాత్రీ ఎడతెరపి లేకుండా ఆలోచనల వరద మొదలైంది. వాటి మధ్య , వాడికి 'చావో-సో' ఆకారం కనిపించటం మొదలెట్టింది.

"హి హి హి" అని అరిచేదది - "నన్ను అన్యాయంగా చంపేస్తావా? ఇక చూడు - నిన్నేం చేస్తానో చూడు!" అని పళ్లుకొరికేది. 'యువాన్-నంగ్' దాని బారి నుండి తప్పించుకునేందుకు గాను ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవరో మాంత్రికులను, భూతవైద్యులను, డాక్టర్లను సంప్రతించాడు. ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రతిరోజు 'చావో-సో' ఆకారం వాడి కళ్ల ముందుకు వస్తూనే ఉంది. బెదిరిస్తూనే ఉంది. ఆ దెబ్బకు వాడికి తిండి సయించలేదు; చిక్కి శల్యమైపోయాడు. ఆ సమయంలో వాడి మేలు కోరేవాళ్లెవరో వాడికి ధర్మమార్గాన్ని చూపారు: ధ్యానం నేర్పారు. ధ్యానం చేస్తూ చేస్తూంటే వాడికి ఇక ఆ ఆకారం కనబటటం మానేసింది. వాడి భయం దూరమైంది!

దాంతో 'యువాన్-నంగ్‌'కు ధర్మం పట్ల ఆసక్తి పెరిగింది. సన్యాసం స్వీకరించాడు; చాలా శాస్త్రాలు, గ్రంధాలు చదివాడు; తనే స్వయంగా చాలా మందికి దారి చూపి మార్గదర్శకుడైనాడు. గొప్ప ధార్మికుడుగా పేరుగాంచాడు.

ఆ క్రమంలో వాడి మనసు కూడా చాలా పరిశుద్ధం అయ్యింది. అధికారాన్ని గాని, పేరు ప్రతిష్ఠలను గానీ కోరలేదు వాడు. ఏం చేసినా నిస్వార్థంగా , సేవాభావంతో చేయటంతో వాడి జన్మధన్యమైంది, అట్లా చావో - సో ఆలోచన నుండి తప్పించుకున్నాడు వాడు.

తరువాత వాడు పది జన్మలెత్తాడు, ప్రతి జన్మలోనూ తన సాధనని నిష్కల్మషంగా, నిరంతరాయంగా కొనసాగిస్తూనేపోయాడు. అతని పుణ్యకర్మల ఫలితంగా అతని పేరుప్రతిష్ఠలు జన్మజన్మకీ పెరుగుతూ పోయాయి. చివరికి, పదోజన్మలో వాడు చక్రవర్తి గారికి ప్రీతి-పాత్రుడైనాడు. చక్రవర్తికి అంతరంగికుడుగా, గురువుగా, రాజ్యంలో అతని మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది.

జాతి గురువు - 'వు - తా' అని బిరుదు నిచ్చిన చక్రవర్తిగారు, ఆయన్ని విపరీతంగా అభిమానించారు. తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ చక్రవర్తులు మాత్రమే ఉపయోగించే సింహాసనం ఒక దానిని ఆయన ప్రత్యేకంగా చేయించి 'వు - తా' కు సమర్పించుకున్నాడు. దాన్ని ఎంత చక్కని కర్రతో, ఎంత అందంగా తయారు చేశారంటే, ఎవరైనా దాన్ని మెచ్చుకో-వలసిందే. ఎంతంటి వారైనా ఆ కళా-నైపుణ్యం ముందు తలవంచవలసిందే.

దాని మీద కూర్చొని, 'వు - తా' ఒక్క క్షణం పాటు సంతోషాన్ని పట్టలేకపోయాడు. ఆ క్షణంలో ఒక ఆలోచన అతనిలోకి ప్రవేశించింది - మెల్లగా అతన్ని అది వశం చేసుకున్నది. అతను అనుకున్నాడు - "ఆహా! నా అంత గొప్ప జ్ఞానులు వేరే ఎవ్వరైనా ఉన్నారా, అసలు?! సృష్టిలోనే ఈ కుర్చీ అత్యద్భుతం కదా! ఇంత గొప్ప బహుమానం నాకు కాక వేరే ఎవరికీ దక్కలేదు గదా, అది కూడా చక్రవర్తుల వారి స్వహస్తాల మీదుగా?" అని.

అహంకార పూరితమైన ఆ ఒక్క ఆలోచనా అతను అన్ని జన్మలుగా కప్పుకున్న రక్షణ కవచాలను అన్నిటినీ ఆ ఒక్క క్షణాన్నే పగుల గొట్టింది. పది జన్మలుగా ఏ పాపాన్నైతే అతను అణచిపెట్టాడో అది తక్షణమే తలెత్తింది. బలంగా అతన్ని తాకింది!.

మరుక్షణంలో జాతి గురువు - 'వు - తా' గారి కాలు వాచిపోయింది! ఎర్రగా కమిలినట్లు అయిపోయిన ఆ కాలి పైన ఒక పెద్ద పుండు తయారైంది! మనిషి ముఖం ఆకారంలో ఉన్నదది! ముక్కు, కళ్లు, నోరు, చెవులు! అంతేకాదు; అది 'వు-తా గారితో ప్రత్యేకంగా మాట్లాడటం‌ కూడా మొదలు పెట్టింది - "నువ్వు నా నుండి తప్పించుకున్నాననుకున్నావు కదూ?! కానీ తప్పించుకోలేవు! నిన్ను ఏం చేస్తానో చూడు!" అనటం‌ మొదలుపెట్టింది,

"నాకు ఆకలిగా ఉంది! మాంసం కావాలి నాకు- పచ్చిమాంసం! అది ఇచ్చావా సరి, లేకపోతే ఇదిగో - ఈ బాధని భరించు!" అని అరిచేది. దాంతో 'వు-తా'కు భరించరాని వేదన కల్గేది. జాతి గురువు ఐనా సరే, ఆయన రహస్యంగా పచ్చిమాంసం తినాల్సి వచ్చింది; అలా కాకపోతే నొప్పి తగ్గేది కాదు మరి!

కొద్దిరోజుల్లోనే 'వు - తా' గారి బ్రతుకు దుర్భరం అయిపోయింది. ప్రతిరోజూ రహస్యంగా పచ్చిమాంసం తినటం, ఆ సంగతి ఎవ్వరికీ తెలీకుండా కాపాడుకోవటం అంటే మాటలు కాదు గదా, మరి?! అయితే అనేక జన్మలలో ధ్యానం బాగా చేసి ఉండటం మూలాన, ఆయనలో క్షమత బాగానే పెరిగి ఉన్నది. ఈ సమస్యకి కారణం కూడా ఆయనకు అర్థమైంది. ఆయన తన గురువు 'కకుడి'తో ఈ సంగతిని చెప్పుకొని పశ్చాత్తాప పడ్డాడు.

'ఇన్ని జన్మల పుణ్య సంస్కారాలనూ పశ్చాత్తాపపు అగ్నిలో దహిస్తే ఫలితం ఉండవచ్చు' అన్నాడు కకుడి.

'వు - తా' ఆ పనే చేశాడు. తన పుండుకు రహస్యంగా దుష్ట ఆహారాన్ని ఇవ్వటం మానివేశాడు. బాధని భరించాడు. మనసును ప్రతిరోజూ పశ్చాత్తాపపు అగ్నిలో నిశ్చలంగా నిలిపి దహింపజేశాడు.

అతని పాపభారం, అప్పటికి గానీ ఉపశమించలేదు!

క్రమేణా అతనికాలు బాగైంది.

మనం కూడబెట్టుకునే దుష్ట సంస్కారాలు అప్రయత్నంగా దూరం కావు! వాటిని అభ్యాసం ద్వారా, ప్రయత్న పూర్వకంగా తొలగించుకోవాలి.