కథియవాడ బడికి ఇన్స్‌పెక్టరుగారు వచ్చారు. ఆయన వస్తున్నట్లు ఎవరికీ ముందుగా తెలీదు.
ఆ రోజుల్లో ఇన్స్‌పెక్టర్లు అందరూ ఇంగ్లీషు వాళ్ళు. వాళ్లని చూస్తే అధ్యాపకులకు అందరికీ వణుకు. స్కూలు ఇన్స్‌పెక్టరుగారి మెప్పు పొందటం అవసరం- లేకపోతే వాళ్ల ఉద్యోగాలు ఊడేవి! ఆ వచ్చే కొద్దిపాటి జీతమూ రాకపోతే కుటుంబం గడవదు కూడాను!
ఇన్స్‌పెక్టరుగారు వచ్చి 'తరగతి ఉంచుకున్న తీరును గమనిస్తారు; పిల్లల శుభ్రతని చూస్తారు; మంచి మంచి వాక్యాలు గోడలకు వ్రేలాడుతున్నాయా, లేదా? వివిధ ప్రపంచ దేశాల మ్యాపులున్నాయా? "బ్రిటిష్ రాజు గారు వర్థిల్లాలి" అని నేర్పుతున్నారా, లేదా? అన్నిటినీ మించి- సరైన ఇంగ్లీషు నేర్పుతున్నారా, లేదా?' అని పరిశీలిస్తారు. పిల్లలకు డిక్టేషను ఇస్తారు; వాళ్ళు రాసినవాటిని స్వయంగా దిద్దుతారు; పిల్లల స్థాయి ఎలా ఉందో చూసి, దాన్ని బట్టి అయ్యవారి విలువను అంచనా వేస్తారు.
పిల్లలు జవాబులు బాగా చెప్పకపోతే, తప్పులు రాస్తే, అయ్యవార్లకు చీవాట్లు తప్పవు. పిల్లలు మరీ ఘోరంగా ఉంటే అయ్యవారిని మార్చేస్తారు- పనిలోంచి తీసెయ్యచ్చు కూడాను!
ఇన్స్‌పెక్టరుగారి పేరు గైల్స్ దొర. బడిలోకి వచ్చీ రాగానే పరిసరాల్ని గమనించాడాయన. ఆ వెంటనే చకచకా ఆరో తరగతిలోకి వెళ్ళాడు. అక్కడున్న టీచరుగారు ఆయన్ని చూడగానే తను చెబుతున్న పాఠం ఆపి, లోనికి ఆహ్వానించారు వణుక్కుంటూ. పిల్లలందరూ లేచి నిలబడి 'గుడ్ మార్నింగ్' చెప్పి, 'గాడ్ సేవ్ ద కింగ్ (బ్రిటన్ జాతీయగీతం) పాడారు.
ఇన్స్‌పెక్టరుగారు పిల్లలందర్నీ దూరం దూరంగా కూర్చోబెట్టారు. పలకలు తీయమని ఐదు పదాలు డిక్టేట్ చేశారు- అయ్యవారికి సంతోషంగానే ఉంది- "ఈ పదాలన్నీ తను చెప్పినవే; పిల్లలందరూ వీటిని సరిగ్గానే రాస్తారు. తనని ఇన్స్‌పెక్టరుగారు మెచ్చుకుంటారు బహుశ:. తరగతి గదిలో వెనకవైపుగా ఉండి, ఎవరు ఎలా రాస్తున్నదీ చూడసాగాడాయన.
ఆరో తరగతిలో కొత్తగా చేరిన వాళ్ళల్లో మోహన్‌దాస్ అని ఓ పిల్లాడుండేవాడు. కొంచెం వెనకబడినట్లుండేవాడు. వాళ్ల నాన్న కరంచంద్ గారు కథియవాడ్ మహారాజావారి ఆస్థానంలో పెద్ద ఉద్యోగి. మోహన్‌దాస్ ఒక పదాన్ని తప్పుగా రాశాడు: "kettle" అని రాసేబదులు "ketle" అని రాశాడు. అయ్యవారు వెంటనే మోహన్ ప్రక్కకొచ్చి నిలబడ్డారు- కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగారు- కేవలం మోహన్‌కే కనబడేట్లు సైగ చేశారు- "ప్రక్కవాడి పలకలో చూడు- చూసి, సరిగ్గా రాయి!" అని.
మోహన్‌దాస్ అమాయకుడో, మరేమో, అధ్యాపకులవారి సైగలు అర్థం కానట్లే ఉండిపోయాడు- దిక్కులు చూసుకుంటూ.
తర్వాత ఇన్స్‌పెక్టరుగారు అందరి పలకలూ దిద్దారు- మోహన్‌దాస్ తప్పిస్తే అందరూ అన్ని పదాలూ సరిగా రాశారు. అతనొక్కడే- 'కెటిల్' అని రాయలేకపోయాడు! అందరూ తననే చూస్తుంటే మోహన్‌దాస్ సిగ్గుగా తలవంచుకొని కన్నీళ్ళతో నిలబడ్డాడు.
ఇన్స్‌పెక్టరుగారు వెళ్ళాక, అధ్యాపకులవారు మోహన్‌ని కసిరారు- "నేను సైగలు చేస్తూనే ఉన్నాను కదా, ప్రక్కవాడి పలకలో చూసి కాపీ కొట్టమని?! అది కూడా రాకపోతే ఎలాగ?" అని.
ఆ మోహన్‌దాసే, పెద్దయ్యాక, తన ఆత్మకథలో ఈ సంగతి చెబుతూ "చిన్నప్పటినుండి నాకు సత్యం పట్ల ఆకర్షణ ఉండేది- నాకైనేను సత్యంగా ఉండటం, ఇతరులతో ఎప్పుడూ నిజమే చెప్పటం, భగవంతుడి పట్ల నిజంగా ప్రవర్తించటం- వీటి వల్లనే నా ఆత్మకు బలం చేకూరింది" అని రాసుకున్నాడు.
ఇంతకీ మోహన్‌దాస్ ఎవరో గుర్తు పట్టారా? మన జాతిపిత, మహాత్మా గాంధీ!
పిల్లలకి నిజాయితీ గురించి చెప్పేటప్పుడు సాధారణంగా ఈ సంఘటనను గుర్తుచేసు-కుంటుంటారు అందరూ.
అయితే, ఇంతకీ ఈ కథలో ఇన్స్‌పెక్టరుగారు పరీక్ష పెట్టింది ఎవరికి? పిల్లలకా, అధ్యాపకుడికా?
పైకి చూసేందుకు 'ఆ పరీక్ష పిల్లలకే' అనిపిస్తుంది; కానీ నిజానికి ఆ పరీక్ష అధ్యాపకులకు! పిల్లల స్థాయిని బట్టి అధ్యాపకుల జ్ఞానాన్ని, ప్రతిభను అంచనా వేయచ్చు!
ఇవాల్టి పరీక్షలలో అలాంటి స్ఫూర్తి ఒకటి రావటం అవసరమేమో అనిపిస్తుంది. పరీక్షలు ఉన్నది మన పిల్లల్లో సింహ భాగాన్ని దోషులుగా నిలబెట్టి వాళ్ల లోటుపాట్లని బహిర్గతం చేసేందుకు కాదు; ఎవరో కొందరు పిల్లల్ని మునగ చెట్లు ఎక్కించేందుకూ కాదు- వారికి విద్యగరిపిన అధ్యాపకుల ప్రతిభను గుర్తించేందుకు అవి గీటురాళ్ళు' అనుకుంటే కొంత బాగుంటుందేమో. 'పరీక్షల అసలు పరమావధి విద్యార్థి కాదు- అధ్యాపకులే' అనిపిస్తుంది- మీరేమంటారు?
విద్యార్థులకు ఇష్టంగా విద్యగరపే అధ్యాపకులకు నమస్కారాలు!
కొత్తపల్లి బృందం