"అనగనగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక పుట్ట" అని అన్నది అమ్మ ఎప్పటిలాగానే, తన పాపకోసం కథ మొదలు పెడుతూ.

"అమ్మా ఎప్పుడూ అదేనా, వేరే కథ చెప్పు" అడిగింది పాప.

"అన్ని కథలూ ఒకేలాగా మొదలవుతాయి పాపా, రాను రాను మారిపోతై. ఈ కథ నీకు తెలీని కొత్త కథే" అంది అమ్మ.

"ఊఁ సరే, అయితే, చెప్పు" అంది పాప.

అమ్మ కొనసాగించింది- "నీకు తెలుసు కదా, అడవిలో ఒక పెద్ద నది ఉంది. ఆ నది ఒడ్డున పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఉంది, నేను చెప్పిన చెట్టు. ఆ చెట్టుమీద ఒక కాకి తన పిల్లలతో కలిసి జీవిస్తున్నది. ఒకసారి ఏమైందంటే, పిల్లలకు ఆహారం తీసుకురావడానికి వెళ్లింది తల్లి. కాకి పిల్లలు మరి చాలా ఆకతాయిలు కదా, అందుకని అవన్నీ తల్లికాకి లేని సమయం చూసుకొని తలలు కిందికి వంచి నదిలోకి చూస్తూ గొడవ పడటం మొదలు పెట్టాయి.

కొంచెం సేపటికి వెనక్కి తిరిగివచ్చిన తల్లి కాకికి, తలక్రిందులుగా ఉన్న పిల్లలు కనబడ్డాయి. దానికి చాలా భయం వేసింది. అదన్నది-

"పిల్లలూ! అట్లా తొంగి చూడకండమ్మా. కాలు జారి కింద పడవచ్చు, నీళ్లలో కొట్టుకు పోవచ్చు, శత్రువులు ఎవరైనా మనమీది దాడి చేయచ్చు- ప్రమాదం జరిగాక ఇంక ఏమీ చెయ్యలేం కదా, అందుకని ముందునుండే జాగ్రత్తగా ఉండాలి" అని.

పిల్లలు తల్లి మాటలను విన్నారు- ఆ క్షణం వరకే ! తరువాత వాళ్ల పని వాళ్లది!

మర్నాటి రోజున తల్లి ఆహారానికి వెళ్లగానే మళ్లీ క్రిందికి తొంగిచూడడం మొదలు పెట్టాయి. ఈ సారి తల్లి పిల్లలను ఇంకొంచెం గట్టిగా మందలించింది. "చెప్పేది మీ మంచికే కదా! ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగ?" అన్నది.

అయినా పట్టించుకోలేదు కాకి పిల్లలు.

తరువాతి రోజు ఏమైందో తెలుసా? తల్లి అటు ఆహారానికి వెళ్ళగానే పిల్లలన్నీ‌ లేచి తలక్రిందులుగా వ్రేలాడుతూ ఒక దానిని ఒకటి నెట్టుకోవటం మొదలు పెట్టాయి. అంతలోనే ఒక కాకి పిల్ల పట్టు తప్పింది. తటాలున నదిలో పడింది; మిగతావి ఇంకా చూస్తూండగానే నదిలో కొట్టుకుని పోయింది!

మిగిలిన పిల్లలన్నీ భయంతో కెవ్వుమని అరిచాయి- హాహాకారాలు చేశాయి"

అమ్మ కథ ఆపింది- పాప కళ్ళలో నీళ్ళు- "కాకి పిల్ల ఇంక రాలేదా, పాపం?!" అన్నది.

"ఇంకా కథ ఐపోలేదు పాపా" చెప్పింది అమ్మ- "సరిగ్గా ఆ సమయానికి తల్లి కాకి నదిపైనుండి ఎగురుకుంటూ వస్తున్నది. పిల్లల అరుపులు వినగానే దానికి సంగతి అర్థమైంది. క్రిందికి చూసేసరికి మునుగుతూ, తేలుతూ కొట్టుకుపోతున్న పిల్ల కనిపించింది. అది ఒక్కసారిగా నీళ్లలోకి దూకి, కొట్టుకుపోతున్న పిల్లను ముక్కున కరచుకొని గూటికి ఎగిరి వచ్చింది.

పిల్ల నీళ్ళు మ్రింగి, కొస ప్రాణంతో కొట్టుకుంటున్నది పాపం! అప్పుడు తల్లి, మిగిలిన పిల్లలు అన్నీ కలిసి, ఆ కాకి పిల్లని ఒత్తి, తుడిచి, రెక్కలతో విసిరి సేవలు చేశాయి. కొంత సేపటికి పిల్ల కళ్ళు తెరిచింది. వాళ్ళ అమ్మని, తోటి పిల్లల్ని గుర్తు పట్టింది.

అప్పుడు తల్లికాకి అన్నది- "నేను ముందే చెప్పానా, ప్రమాదం అని?! మీరు నా మాట వినలేదు. చూశారా, ఎంత కష్టం వచ్చిందో? సమయానికి నేను అక్కడే ఉన్నాను కాబట్టి పాపకి ఏమీ కాలేదు. లేకపోతే ఎంత నష్టం జరిగేది?! అందుకనే, ఎప్పుడైనా సరే పెద్దలమాట విని బుద్ధిగా ఉండాలి అనేది!" అని. ఇక అప్పటినుండి పిల్లలన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నై" అని ముగించింది అమ్మ.

ఆ రోజున నాన్న పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక, వాళ్ల నాన్నకి ఇదే కథ చెప్పింది, పాప.

నాన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. "బలే కథ చెప్పావు పాపా! అమ్మకి చూశావా, పిల్లలంటే ఎంత ప్రేమో?!"అన్నారు.

"లోకంలో తల్లి ప్రేమ చాలా మధురమైనది
అది అందరికీ దొరకని ఒక వజ్రం
వెలకట్టలేని ఒక నాణెం
చేయలేని ఒక యుద్ధం
స్వరంలేని రాగం
మరువలేని ఒక జ్ఞాపకం" అని తను రాసిన ఓ కవిత వినిపించారు.

"అందరి అమ్మలూ అంత గొప్పగా ఉండరులేండి!" అన్నది అమ్మ-

"అమ్మ ఉండటం ఒక వరం
ఆమె లేకుంటే అదే ఒక శాపం!
బ్రతకాలి అని అనిపిస్తుంది అమ్మ ఉంటే
ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది అమ్మ లేకుంటే" అని తనూ ఓ కవిత చెప్పేసింది.

పాప నవ్వింది. "నువ్వు చెప్పిన మాట వింటానులే అమ్మా, ఎప్పుడూ గొడవ చేయను!" అని వాళ్ల అమ్మకు మాట ఇచ్చి హాయిగా నిద్రపోయింది.