సీతాపురం ఊరిపెద్ద శంకరుడు ధనికుడే గాక, చాలా దయాగుణం ఉన్నవాడు. అతనికి పూర్వీకులనుండి సంక్రమించిన ఆస్తులు చాలానే ఉండేవి కానీ, వేరే వ్యాపారాలంటూ ఏవీ ఉండేవి కావు. స్వతహాగా మంచి మనసు కలవాడు కావటంతో అతను తన సమయాన్నంతా ప్రజలకు ఉపయోగపడే పనులకే వెచ్చిస్తూ ఉండేవాడు. ఊళ్ళోవాళ్ళే కాక ఆ చుట్టుప్రక్కల అందరూ అతని గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు.

ఒక వానాకాలంలో సీతాపురానికి ఏనాడూ లేనంత భారీ వరద వచ్చింది. తుఫానుకు తోడు చెరువుకూ గండి పడటంతో పెద్ద నష్టమే సంభవించింది. ఆ వరద వల్ల చాలా మంది ఇళ్లు కోల్పోయారు; కొందరు వరదలో కొట్టుకుపోయారు. శంకరుడు ఉండే భవనం తప్ప ఊళ్ళోని ఇళ్ళన్నీ ఎంతో కొంత కూలిపోయాయి. శంకరుడి భవనానికి మాత్రం ఏమీ కాలేదు.

అయితే కూలిన చెట్లను, సర్వస్వమూ కోల్పోయిన ఇళ్లను చూసి శంకరుడు చాలా బాధపడ్డాడు. ఊళ్ళోని జనాలందరికీ తన భవనంలో చోటు కల్పించాడు; వాళ్ళకు మూడు పూటలా భోజన ఏర్పాట్లు చేశాడు. వరద భీభత్సం తగ్గిన తర్వాత ఇళ్లు కొట్టుకుపోయిన వాళ్ళకు అందరికీ ఇళ్లు కట్టించాడు. ఇళ్ళు కట్టే పని పూర్తయేంతవరకూ అందరికీ తనే ఆశ్రయం ఇచ్చాడు. దీనులైన ప్రజలకు తనే దైవం అయినాడు.

ఈ క్రమంలో శంకరుడు తన తాహతును మించి ఖర్చు చేశాడు. ఇలా దానాలు, ధర్మాలు చేసి చేసి అతని ఆస్తి మొత్తం తరిగిపోయింది. చూస్తూ చూస్తూండగానే అతను పేదవాడైపోయాడు. అంతవరకూ అతన్ని 'మంచివాడు' అని మెచ్చుకున్నవాళ్ళు చాలామంది ఇప్పుడు మొహం చాటు చేయటం మొదలు పెట్టారు. నేను చెప్పాను కదరా, "కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, నీ దానాలూ ధర్మాలూ ఏదో ఒకనాడు నీ తలకే చుట్టుకుంటాయి అని చెబితే విన్నావు కావు!" అని వాళ్ళ అమ్మ కూడా బాధపడటం మొదలు పెట్టింది. కష్టాలు కలిసి వచ్చినట్లు, ఆమె ఆరోగ్యం కూడా అకస్మాత్తుగా మందగించింది. సరైన వైద్యం చేయించేందుకు కూడా శంకరుడి దగ్గర డబ్బు లేదు.

శంకరుడు ఆనాటి వరకూ ఎవరికైనా ఇచ్చిందే తప్ప, ఏనాడూ చెయ్యి చాచి ఎరుగడు. ఇప్పుడు, అతని తల్లి పరిస్థితి ఇలా ఉందని తెలిసి, స్థానికంగా ఉన్న వైద్యులు తమంతట తాముగా వచ్చి, తామే ఔషధాలు తెచ్చి ఇచ్చి వైద్యం చేయసాగారు. కొద్ది రోజులకు ఆమె ఆరోగ్యం మెరుగైంది; కానీ ఇప్పుడిక "బలమైన ఆహారం తినాలి" అన్నారు వైద్యులు.

పేద శంకరుడు "బలమైన ఆహారం ఎక్కడినుండి తేవాలి?" అని మథనపడసాగాడు. అయితే ఆ చుట్టుప్రక్కల ఉన్న రైతులు అతనికి బాసటగా నిల్చారు. ప్రతి ఒక్కరూ తాము పండించిన కూరలు, పళ్ళు వేటికవి తెచ్చి ఇవ్వటం మొదలు పెట్టారు.

"మీ అందరి రుణం నేను ఎలా తీర్చుకోను?!" అని బాధ పడేవాడు శంకరయ్య. "మీరు ఇంతకాలం మాకు చేసిన సాయాన్ని మరచిపోతే మేం మనుషులం ఎలా అవుతాం?!" అనేవాళ్ళు వాళ్ళు.

సరిగ్గా అదే సమయానికి ఎన్నికలు వచ్చాయి. "ఈ ప్రాంతంలో ప్రజల్లో మంచి పేరున్న కొత్త వ్యక్తికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి" అనుకున్న రాజకీయ పార్టీ వాళ్ళు ఒకరు వచ్చి శంకరయ్యను శాసనసభ్యుడిగా ఎన్నికల్లో నిలబడమన్నారు. "ఒక పార్టీ తరపున నిలబడితే మరొకరితో పోటీ పడాలి. నాకు ఈ పోటీలూ వద్దు, ఈ రాజకీయాలూ వద్దు. అయినా ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు నా దగ్గర ఏమాత్రం‌ డబ్బులు లేవు" అన్నాడు శంకరయ్య. అయినా రాజకీయపార్టీలన్నీ కలిసి పోటీ లేకుండా అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి- పేద శంకరుడు నేరుగా శాసన సభ్యుడు అయిపోయాడు.

"అందరికీ సాయపడేందుకు మళ్ళీ అవకాశం వచ్చింది" అని మళ్ళీ పనిలోకి దిగాడు శంకరుడు. ప్రభుత్వం అండదండలు తోడవ్వటంతో మంచిపనులు అనేకం చేపట్టాడు. "శంకరయ్యకు డబ్బులు లేకుంటేనేమి, ఆయన మంచితనమే ఆయనకు అందివచ్చింది" అనేవాళ్ళు అందరూ.