సూర్యకాంతంకి ఒక్కడే కొడుకు. భర్త చనిపోయి చాలా కాలం అయిపోయింది. కొడుకు సుందర్ సొంత ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు.
సుందర్ ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి, మళ్లీ రాత్రికి గానీ తిరిగి వచ్చేవాడు కాదు. సూర్యకాంతం ఇంట్లో పనులు చేసీ చేసీ అలసిపోయేది. సాయంగా ఎవరూ లేరు- ఒక్కతే ఇంటి పనంతా చేసుకోవాలి. అందుకని తనకు సరిపడే కోడలి కోసం వెతికీ వెతికీ చివరికి 'మీరా' అనే పిల్లను మెచ్చింది.
ఆ పిల్ల అయితే తను చెప్పినట్లు వింటుందనీ, తను ఏమన్నా కిసుక్కుమనదనీ లెక్కలు వేసుకొని, సుందర్‌ని ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసింది.

మీరా రూపవతి, అందాల బరిణ, ముద్దుల గుమ్మ. కోడలు ఇంటికొచ్చాక కొద్ది రోజులవరకూ సూర్యకాంతమే అన్ని పనులూ చేసింది. కోడలు అత్తగారిని చాలా బాగా చూసుకున్నది. "నా కోడలు బంగారం రా" అనేది సూర్యకాంతం.
అయితే రాను రాను అసలు రంగు బయట పడ్డది. కోడల్ని కూర్చోబెట్టి సాకే ఉద్దేశం అత్తకు లేదు. అత్తను కూర్చోబెట్టి సాకే ఉద్దేశం కోడలికి లేదు! అత్త ఏదైనా పని చెప్పగానే చటుక్కున లేచి అవతలికి వెళ్ళేది మీరా. కోడలు కనబడగానే లేనిపోని పనులు చెప్పేది సూర్యకాంతం.
"నా కోడలు చూడండమ్మా! నా కొడుకును ఎట్లా కొంగున ముడి వేసుకున్నదో! కోడలంటే అట్లా ఉండాలి!" అని కోడలు చేసే ప్రతీ పనినీ దెప్పి పొడిచేది సూర్యకాంతం.
"ఎంతైనా అత్త అత్తే! అత్త బుద్ధి చూపించుకున్నది చూడు మా అత్త!" అనటం మొదలుపెట్టింది మీరా.
రాను రాను సూర్యకాంతానికి కోడలంటే ఎక్కడలేని కోపం రాసాగింది. కోడలు చేసే ప్రతి వంటకూ ఏదో ఒక వంక పెట్టి "ఇదిగో, ఇది నన్ను చంపడానికే వచ్చింది, నా గుమ్మంలో అడుగుపెట్టింది మొదలు నాకు మనశ్శాంతి లేకుండా పోయింది!" అని కనబడ్డవాళ్ళకల్లా చెప్పేది. "కొడుక్కి చెప్పు" అని వాళ్ళు ఎగద్రోసే సరికి, చివరికి ఆ ఫిర్యాదులన్నీ‌ సుందర్ చెవుల్లో వెయ్యటం‌ మొదలు పెట్టింది సూర్యకాంతం.
తల్లి మాటలను వినీ వినీ సుందర్‌కి పిచ్చెక్కినట్లయింది. "అమ్మా! ముసలి దానివైపోయావు. అదేమో చిన్నది. నీకు దాని పద్ధతులు నచ్చితే సరి- లేకపోతే ఇప్పుడు ఏం చెయ్యగలం చెప్పు- అన్నీ వదిలేసి ఏదో 'రామా!కృష్ణా!' అంటూ కాలం గడుపు!" అనేశాడు.
సుందర్‌కి వీళ్ళిద్దరి గుణగణాలూ తెలుసు. "మీరా పట్నం అమ్మాయి. సూర్యకాంతం ఇప్పుడు పట్నంలో ఉంటున్నా, ఒకప్పటి పల్లెటూరి మనిషే. ఇద్దరి పద్ధతులూ ఒకరివొకరికి సరిపోవు.
సూర్యాకాంతానికి మూఢనమ్మకాలంటే మక్కువ. కోడలివి ఆధునిక భావాలు. కోడల్ని తనదారిన తాను పోనిచ్చే పెద్దరికం తల్లికి లేదు. ఆమె ఏమన్నా భరించే ఓపిక మీరాకు లేదు. ఫలితం ఇలాగే ఉంటుంది.."

చివరికి ఒకరోజున సుందర్‌ ఇంటికి రాగానే కోడలి మీద వంద చాడీలు చెప్పింది సూర్యకాంతం. అసలే ఆఫీసు గొడవలతో చికాకుగా ఉన్న సుందర్‌ ఇక భరించలేకపోయాడు. "అమ్మా! నీకు ఎన్ని సార్లు చెప్పాలమ్మా, తిట్టద్దని, శాంతంగా ఉండమని.. ఇక అయ్యేది లేదు. నీకు ఎన్ని కావాలో అన్ని డబ్బులిస్తాను- ఏ కాశీకో, తీర్థయాత్రలకో వెళ్లి కాలం గడుపు- అట్లా పోయావంటే నీకూ శాంతి, నాకూ శాంతి! ఎన్నాళ్లని ఇక్కడ కష్టపడుతూ ఉంటావు?! " అనేశాడు.
కొడుకు మాటలు విన్న సూర్యకాంతానికి భయం వేసింది. "వీళ్ళు నన్ను వదిలించుకునేట్లున్నారు- ఇప్పుడెట్లా?!" అనుకున్నది. బైటికి మటుకు "అప్పుడే పెద్దవాడివి ఐపోయావురా! పెళ్లయి సంవత్సరం కూడా కాకనే నీకు పెళ్లాం తీపయ్యింది; తల్లి చేదయ్యిందట్రా? ఏదో, నీకో కొడుకు పుడితే, వాడిని చూసి అట్లాగే ఏదైనా తీర్థయాత్రకు వెళ్దామని ఆగానుగాని, లేకపోతే నేను ఇక్కడెందుకుంటాను, అసలు?!" అన్నది.
"ఏదో అమ్మా!‌ నీ ఖర్మ కొద్దీ మీరా దొరికింది. ఇప్పుడు తను ఏమంటే అది కానిచ్చి నువ్వు సర్దుకుపో" అని తప్పుకున్నాడు సుందర్.

సంవత్సరం తిరిగే సరికి, మీరాకు చక్కని బాబు పుట్టాడు. సూర్యకాంతం మనవడ్ని చూసి తెగ మురిసిపోయింది. వాడిని ఎత్తుకొని "నిన్ను చూసేందుకేరా, నేను ఇక్కడ కాపలా కుక్కలాగా పడి ఉన్నది; లేకపోతే మీ అమ్మ డాకినితో నేనెందుకుంటాను?" అన్నది.
"కుక్కలాగా ఎందుకత్తా! మనవడిని చూశాక కాశీకి వెళ్లిపోతానన్నావుగా, ఇంక కాశీకి బయలుదేరు!" అంది మీరా ఒళ్ళుమండి. మీరా మాటలు విన్న సూర్యాకాంతం "అందుకే నమ్మా...'కోడలు కన్నా కొరివిదయ్యం నయం' అన్నారు పెద్దలు! వాళ్ళు చెప్పింది నిజమని నిన్ను చూస్తే తెలుస్తుంది. అయినా నీతో నాకేం పని?! నామనవడికి విద్యా బుద్ధులు గరిపాక ఇంక మీరు ఉండమన్నా, ఉండను గాక ఉండను" అంది అత్త సూర్యాకాంతం, కొంచెం తగ్గి.
పదేళ్ళు గడిచాయి. సుందర్‌ కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి నానమ్మ రకరకాల ఆటలు, పాటలు నేర్పింది. వాడి ముద్దు మురిపాలలో కొంచెం‌ మెత్తబడింది. అయినా మిరపకాయ ఘాటు ఎక్కడికి పోతుంది? ఒక రోజున మీరాతో తగవు వేసుకున్నది- "వాడిని మంచి బళ్ళో వేయాలి" అని.
మీరాకి కోపం వచ్చేసింది- "అత్తా! మనవడు పెద్దవాడయ్యాక కాశీకి వెళతానన్నావు గదా! ఇంక బయలుదేరు,కాశీకి!" అన్నది. "ఒసేయ్!‌ఊరికే నోరు పారేసుకోకే, పసివాడు, అప్పుడే పెద్దవాడు అయ్యాడటనే, నీ తొందర కూల! వాడి పెళ్ళిని నా కళ్ళారా చూడకుండా నేను ఎక్కడికి వెళ్తానే?!" అంది కోడలిమీద ఒంటికాలితో లేస్తూ.
చూస్తూండగానే మీరా కొడుక్కి పెళ్లి అయ్యింది. పెళ్ళిలో సూర్యకాంతం వాడికో ఉంగరం‌ పెట్టి, "నీ పెళ్ళి చూసేందుకే నాయనా, నా ముసలి ప్రాణం ఈ గయ్యాళి ఇంటి గడపను పట్టుకొని వ్రేలాడుతున్నది!" అని కళ్లనీళ్ళు పెట్టుకున్నది.
"శుభమా, అని మనవడి పెళ్ళి చేస్తుంటే ఇప్పుడీ కళ్ళ నీళ్ళేమిటి?" అని చికాకు పడ్డ మీరా తనూ చెంగు బిగించి- "మరేఁ అత్తా! మనవడి పెళ్ళయిందిగా, ఇప్పుడింక కాశీకి బయలుదేరండి!" అంది.
వికవికా నవ్వింది సూర్యకాంతం. "ఇప్పుడింక నేను తగ్గుతాననుకున్నావా, తగ్గేది లేదు! పదవే కోడలు పిల్లా పద! ఇప్పుడు నువ్వూ అత్తవే, నేనూ అత్తనే! బయలుదేరు- ఇంక ఇద్దరం కలిసి కాశీకి పోదాం పద..వెంటనే బయలుదేరాలి మరి!" అని అరిచింది.
అత్త తిరగబడేసరికి కోడలికి మతిపోయినట్లయింది. ఆమె తెలివికి, మీరా కాస్తా తెల్లబోయి, ఇక మారు మాట్లాడలేక ముఖం దించుకుంది.
"కోడలుకూడా ఒకనాటికి అత్తే! అయినా మా అమ్మని గెలవాలంటే ఎవరికి సాధ్యం?!" చిన్నగా నవ్వుకున్నాడు సుందర్.