రామాపురంలో చంద్రమ్మ, సోమయ్య అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఏ రోజుకారోజు పనికి పోతే గానీ ఇల్లు గడవని పరిస్థితి వాళ్ళది. ఇద్దరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళకు ఒక్కడే కొడుకు- పేరు రామారావు.
మొదట్లో భార్యాభర్తలిద్దరూ వాడిని బడికి పంపించలేదు. "పేదోళ్లకు చదువు-లెందుకు?" అనేశాడు సోమయ్య. అయితే రామారావుకు మాత్రం బడికి వెళ్ళాలని ఉండేది. ఆ ఊర్లో పనిచేసే ఉపాధ్యాయుడు కూడా "మీవాడు తెలివైనవాడమ్మా, బడికి పంపండి- బాగు పడతాడు" అని కనబడ్డప్పుడల్లా చెప్పాడు. దాంతో "సరేలే, పది వరకు చదివిద్దాం" అని, వాడిని బడికి పంపసాగారు భార్యాభర్తలు.
రామారావుకు తల్లిదండ్రుల కష్టం తెలుసు. అందుకని వాడు ప్రతి ఆదివారమూ పోయి ఇంటికి అవసరమైన కట్టెలు కొట్టుకొచ్చేవాడు; తన బట్టలు తనే ఉతుక్కునేవాడు; ఇంటి పనులు చేసి పెట్టేవాడు; సెలవల్లో పొలం పనులు చేసేవాడు; బళ్ళో కూడా మనసు పెట్టి బాగా చదివేవాడు; అందరి చేతా 'మంచి పిల్లవాడు' అనిపించుకున్నాడు.
పదో తరగతి పరీక్షల్లో వాడికి మంచి మార్కులు వచ్చాయి. పట్నంలో ఉన్న కాలేజీ వాళ్ళు "మీ వాడికి ఫ్రీ సీటు ఇస్తాం- హాస్టల్ ఫీజులు మాఫీ చేస్తాం" అని కబురు పెట్టారు- దాంతో "ఇంకో రెండేళ్ళు చదవనిద్దాంలే-పోనీ" అని కాలేజీలో చేర్చారు తల్లిదండ్రులు.
ఆ సరికి రామారావుకి చదువంటే చాలా ఇష్టం ఏర్పడింది. కానీ వాడికి తెలుసు- వాడిని ఆమాత్రం చదువులు చదివించే స్థోమత కూడా వాడి తల్లితండ్రులకు లేదు. అందుకని వాడు కాలేజీ అయిపోగానే పట్నంలోని దుకాణాల్లో లెక్కలు రాసే పని పెట్టుకున్నాడు. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఏదైనా పని చేసి చదువుకోవాలని, సెలవల్లో పనికి పోయేవాడు. అలా వచ్చిన డబ్బుల్లో కొంత చదువుకు వాడుకొని, మిగతాది ఇంట్లో ఇచ్చేసేవాడు- ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండేవాడు కాదు.
కాలేజీలో చేరిన మొదటి రోజునే 'రూపేష్' అనేవాడు పరిచయం అయ్యాడు రామారావుకి. రూపేష్ ధనవంతుల కొడుకు. వాడి చేతిలో ఎప్పుడూ డబ్బులు ఆడుతూ ఉండేవి- ఏవేవో కొనుక్కొని తింటూ ఉండేవాడు; అందరి మీదా విసుక్కునేవాడు; ఎవ్వరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు. అయినా వాడికి ఎందుకనో రామారావు నచ్చాడు- వచ్చి వాడి ప్రక్కనే కూర్చునేవాడు.
కాలేజీలో క్లాసులు మొదలయ్యాయి. రామారావు రోజూ క్రమం తప్పకుండా క్లాస్‌కి వెళ్ళేవాడు. ఎప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు చదివేసేవాడు. ఎంత చిన్న హోంవర్కు ఉన్నా మర్చిపోకుండా చేసేసుకునేవాడు. కాని రూపేష్ మాత్రం క్లాసులకు వెళ్లకుండా బయట తిరిగేవాడు. మళ్ళీ "నీ నోట్సు ఇవ్వురా, రాసుకొని మళ్ళీ ఇచ్చేస్తాను" అనేవాడు.
కొన్నాళ్ళు ఇదంతా గమనించిన రామారావు రూపేష్‌తో "ఒరే! నువ్వు ఇలా బయట తిరగొద్దురా, ఇద్దరం కలిసి బాగా చదువుకుందాం! అర్థం చేసుకో ప్లీజ్" అని రకరకాలుగా చెప్పాడు. కాని రామారావు వినలేదు- "నీ పని నువ్వు చూసుకో- నేను అడిగినప్పుడు నీ నోట్సు ఇవ్వు అంతే. నీతులు బోధించకు" అని అరిచేవాడు.
"ఇంక చేసేదేమున్నది?" అని రామారావు పోయి తన పని తను చూసుకునేవాడు.
కొంతకాలం తర్వాత మొదటి యూనిట్ టెస్ట్ పరీక్షలు మొదలయ్యాయి. రామారావుకు అన్ని అంశాలలోనూ మంచి మార్కులు వచ్చాయి; ఇక రూపేష్ ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ ఫెయిల్ అయ్యాడు!
రూపేష్ వాళ్ల ఇంట్లో ఈ సంగతంతా తెలిసింది. వాళ్ళు వాడిని మందలించారు. రామారావుని ఇంటికి రమ్మని, "మా వాడిని కొంచెం గమనించుకో నాయనా!" అని చెప్పారు. "కాలేజీ అయిపోగానే మా ఇంటికొచ్చి కూర్చొని చదువుకోరాదూ, ఇద్దరూ?" అన్నారు.
"అది కష్టమండి- నేను దుకాణంలో పనికి పోవాలి" అన్నాడు రామారావు. అట్లా వాళ్ల ఇంట్లో వాళ్లతో పాటు రూపేష్‌కి కూడా రామారావు వాళ్ళ ఇంటి పరిస్థితి తెలిసింది.
కొంచెం సేపు ఆగి, తర్వాత- "అయితే ఒక పని చెయ్యి- మాకూ దుకాణం ఉన్నది కద, కాలేజీ అయిపోగానే ఇద్దరూ ఇక్కడికి రండి- కొద్ది సేపు చదువుకున్నాక, ఇద్దరూ మా దుకాణంలోనే పని చేయచ్చు. ఇకనుండి మా వాడికి 'పాకెట్ మనీ' అని లెక్కలేనన్ని డబ్బులు ఇవ్వం. నీకు ఇచ్చినట్లుగానే మావాడికి కూడా ఇప్పటినుండి నెల జీతం ఇస్తాం- దాంతో వాడు ఏం కావాలంటే అది చేసుకుంటాడు. ఏ సంగతీ చెప్పండి మరి-" అన్నారు రూపేష్ వాళ్ల అమ్మానాన్నలు.
రామారావు రూపేష్ వైపు చూశాడు. "అంత పేదరికంలో ఉండి కూడా రామారావు ఎంత శ్రద్ధగా చదువుతున్నాడు- మరి నేను?!" అని విచారిస్తున్న రూపేష్ అప్పటికప్పుడు "సరే, అట్లాగే కానీయండి- ఇద్దరం కలిసి చదువుతాం, కలిసి పనిచేస్తాం!" అన్నాడు.
ఇక ఆనాటినుండి రూపేష్, రామారావు ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. ఇద్దరూ ఒక్క క్లాసూ మిస్ కాకుండా వెళ్లారు. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకున్నారు. రోజూ సాయంత్రం పూట దుకాణంలో పని చేశారు. వాళ్లు కలసి మెలసి ఉండటమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. సంవత్సర పరీక్షల్లో ఇద్దరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అంతేకాదు; ఆ సంవత్సరం వాళ్ల కాలేజీలో 'బెస్ట్ స్టూడెంట్ అవార్డు'కు ఎంపికయ్యారు ఇద్దరూ!
సాధారణంగా ఈ అవార్డును ఒక్కరికే ఇస్తారు. అలా ఎంపికైన వాళ్లు ఎంత వరకూ చదివితే అంతవరకూ అయ్యే ఖర్చునంతా కాలేజీ వాళ్లే భరిస్తారు. కానీ ఇప్పుడు రామారావు, రూపేష్ ఇద్దరూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు- దాంతో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు.
అప్పుడు రూపేష్ "సార్! మా ఇంట్లో డబ్బుల సమస్య లేదు- మా అమ్మా నాన్నలు నన్ను చదివించగలరు. కానీ రామారావు వాళ్ల తల్లి తండ్రులు చాలా పేదవాళ్లు. ఈ డబ్బుల సహాయం లేకపోతే వాడికి ఇక చదువుకునే వీలుండదు. అందుకని ఈ అవార్డుకు రామారావునే సెలెక్ట్ చేయండి" అన్నాడు.
"అవునండి- రామారావు వల్లనే మావాడికి బాధ్యత తెలిసి వచ్చింది. కాలేజీ అయిపోగానే ఇద్దరూ దుకాణంలో పని చేశారు. రామారావుతో పాటు మావాడికీ జీతం ఇచ్చాం. తన జీతం డబ్బులు మొత్తాన్నీ మావాడు పొదుపు చేశాడు- ఆ మొత్తాన్ని కూడా తన వంతుగా రామారావుకు కానుకగా ఇమ్మన్నాడు- అవార్డుతోబాటు ఈ మొత్తాన్ని కూడా రామారావుకు అందించండి. అతను పెద్ద చదువులు చదువుకొని పైకి రావాలనీ, అందరికీ పనికొచ్చే పనులు చేయాలని మా కోరిక!" అన్నారు రూపేష్ వాళ్ల అమ్మానాన్నలు.
తోటి విద్యార్థులు, కళాశాల పెద్దలు అందరూ రూపేష్-రామారావుల స్నేహాన్ని మెచ్చుకున్నారు.