హరి ఇప్పుడు ఐదో తరగతి. వాడికి పాటలు పాడుకోవటం, తోటి పిల్లల్ని బెదిరించడం, వీలైతే సెల్‌ఫోన్‌తో ఆటలాడటం ఇష్టం. చదువులంటే మటుకు అస్సలు ఇష్టం లేదు. సహజంగానే టీచర్లంతా వాడిని తిట్టేవాళ్లు; మార్కులు తక్కువ వేసేవాళ్లు; దాంతో వాడి అమ్మానాన్నలకి ఎక్కడలేని కష్టం తోచేది.
"వీడిని ఎట్లా‌ అయినా బాగా చదివించాలయ్యా" అనేది వాళ్లమ్మ. "చూస్తుండే! నా కొడుకు బంగారం. వాడిని మంచి బళ్లో వేసి చదివిస్తా. వాడు గొప్ప ఆఫీసరవుతాడు చూడు!" అనేవాడు వాళ్లనాన్న రాజయ్య. ఆయనకు కొడుకంటే గొప్ప గారాబం. రాజయ్య మామూలు చిన్న రైతు. రెండేళ్లుగా పొలాలన్నీ బీడు పెట్టుకొని ప్రభుత్వం వాళ్లిచ్చే సాయం కోసం చేతులు చాపుకొని కూర్చున్నారు ఆ ప్రాంతపు రైతులందరూ.
రాజయ్యదీ అదే పరిస్థితి. పంటలు లేవు. పనులు లేవు- ఆఫీసుల చుట్టూ తిరగటం, ఏ పథకంలో కొంచెం డబ్బులు వస్తాయోనని ఏ రోజుకా రోజు పథకాలు రచించడం- ఇదే పని!

అట్లా బ్రతికీ బ్రతికీ రాజయ్యకు ప్రభుత్వ పథకాలలోని లొసుగులు బాగా ఒంటి పట్టాయి-"ఏ పథకానికి ఎవరైనా అర్హులు కావొచ్చు- ఆ సారుకు కొంచెం, ఈ సారుకు కొంచెం లంచం ఇస్తే చాలు" అనుకోసాగాడు.
హరి పరిస్థితి రాజయ్యకు తెలుసు. అయితే నేమి, తండ్రి కదా!. ఎలాగైనా ప్రభుత్వం వారి 'నవోదయ' బళ్లో చేర్పిస్తే భలే ఉంటుంది. అక్కడైతే టీచర్లు రోజూ బడికి వస్తారు, పాఠాలు సక్రమంగా చెబుతారు; నా కొడుకుని దారిలోకి తెస్తారు. భోజనాలు బాగా పెడతారు; పుస్తకాలు-వగైరాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోటే గడిచిపోతాయి" అని, కొడుకు చేత ముందుగానే అప్లై చేయించి, పరీక్ష జరిగే రోజున వాడిని తీసుకొని పరీక్ష కేంద్రానికి వచ్చాడు.

అక్కడికి వచ్చిన పిల్లలందర్నీ చూసి హరికి ఏమి అనిపించలేదు గానీ, రాజయ్యకి మటుకు చాలా‌భయం వేసింది. "ఇంతమంది పిల్లలు పరీక్ష రాస్తే, ఇక మా వాడికి ఏం అవకాశం?" అనిపించింది. అక్కడ కనిపించిన ఒక సారుని అడిగాడు-"ఎంతమందికి సీట్లు వస్తాయి సార్‌?" అని. "ఎనభై మందిలో ఒక్కరికి మాత్రం" అన్నాడాయన. "అవునా, అంత పోటీనా? అన్నాడు రాజయ్య" మరేమనుకుంటున్నావు? ఇందులో సీటు ఏమంత సులభంగా రాదు" అని చక్కా పోయాడా సారు.

రాజయ్యకు చాలా బెంగ వేసింది. తను ఇది ముందుగా ఊహించలేదు గానీ, లేకపోతే ఏ యం. ఎల్. ఏ గారి చేతనో ఒక సిపారసు పత్రం వెంట తెచ్చును! ఇప్పుడెలాగ? రాజయ్య కళ్లు అటూ, ఇటూ వెతికాయి. అక్కడ, గేటు ప్రక్కనే, ఖాఖీ చొక్కా వేసుకొని ఓ 'వాచ్‌మ్యాన్' కనిపించాడు. రాజయ్య అతని దగ్గరకు పోయి-

"నీదే ఊరు?" అని అడిగేశాడు.
'ఈ ఊరే' అన్నాడు వాచ్‌మ్యాన్.
"ఇక్కడ చాన్నాళ్ల నుండి ఉన్నావా?"
-"ఎందుకు?"
"ఏం లేదు! మావాడిని కొంచెం చూసుకుంటావేమోనని-" హరిని చూపిస్తూ అన్నాడు రాజయ్య.
"ఇందులో, అట్లాంటి వేమీ ఉండదన్నా, మన చేతిలో ఏదీలేదు"
"అబ్బే, అట్లాకాదు నేననేది; మన సార్లకి ఎవరికన్నా చెబుతావేమో, వాళ్లకి కూడా ఎంతో ఒకంత ఇస్తాను నేను- అని" -అంతలోనే ఎవరో తల్లి తండ్రులు అటుగా రావటం, వాచ్‌మ్యాన్‌ ప్రక్కకి జరిగి వాళ్లని పోనివ్వటం జరిగాయి.
"కుదరదన్నా, అట్లాంటిదేమైనా ఉంటే నేను-" అతను ఇంకా వాక్యాన్ని పూర్తి చేయకనే రాజయ్య చేతిలోంచి ఐదు వందలు రూపాయలు అతని జేబులోకి చేరాయి.
"అతనొక సారి రాజయ్య వంకా, తన జేబు వంకా చూసుకొని-"సరే, ఎవరైనా తెలిసిన అయ్యవారు కనిపిస్తే చెబుతాను, కానీ-" అన్నాడు.

రాజయ్యకి ఊరట- "ఇక భయం లేదు. హరి గాడికి పర్లేదు" అని. "సారుకు కూడా ఏమైనా ఇవ్వాలేమో చెప్పు, ఇద్దాం!" అన్నాడు ఉత్సాహంగా.
వాచ్‌మ్యాన్ ఇక కనబడలేదు. పరీక్ష మొదలైంది; ముగిసింది. 'వాచ్ మ్యాన్ గానీ సారుగానీ నీకు ఏమైనా అందించారా?" అడిగాడు రాజయ్య, హరిని.
"లేదు- ఎవ్వరూ ఏదీ అందించలేదు. అందరికీ వేరు వేరు ప్రశ్న పత్రాలు ఇస్తారంట. కాపీ కొట్టినా ఏమీ లాభం ఉండదంట- నా ప్రక్కన కూర్చున్న వాడు చెప్పాడు!" అన్నాడు హరి.
'మరి నువ్వేం చేశావురా, రెండు గంటలసేపు?' చికాకుగా అరిచాడు రాజయ్య. జవాబుగా అట్టమీద పెన్సిల్‌తో దరువు వేశాడు హరి!
దూరం నుండి వీళ్లనే చూసిన ఆటో డ్రైవర్ ఓబులేసు తల తిప్పుకున్నాడు. తను వెంట బెట్టుకొచ్చిన పిల్లల్ని గబగబా ఆటో ఎక్కించుకున్నాడు. పరీక్షకు ముందు రాజయ్య తన జేబులోకి బలవంతంగా ప్రవేశ పెట్టిన ఐదు వందల్నీ మరోసారి పదిలపరుచుకుంటూ, మురిపెంగా నవ్వుకొని ఆటోను ముందుకు దూకించాడు.