ఒక ఊళ్లో శివయ్య అనే యువకుడు ఉండేవాడు. వాళ్లది చాలా పేద కుటుంబం. శివయ్య చిన్నప్పటి నుండి కూలి పనులు చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతను డిగ్రీ చదివేటప్పుడే వాళ్ల నాన్న చనిపోయాడు. వాళ్ల నాన్న చనిపోయిన తరువాత శివయ్య చదువు ఆపేసి, ఉద్యోగం కోసం వెతకసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. చివరికి వాళ్లకి తిండి దొరకడానికి కూడా కష్టమైంది. ఇక చేసేదేమీ లేక కట్టెలు కొట్టి, వాటిని అమ్మి జీవనం సాగిద్దామని అనుకున్నాడు. అతనికి తెలుసు- చెట్లు నరకడం వల్ల వర్షాలు రావని. అయినా తప్పేటట్లు లేదు మరి!
అయిష్టంగానే మరుసటి రోజు కట్టెల కొట్టడానికి అడవికి వెళ్లాడు. అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా శివయ్యకు బాగా ఆకలి వేసింది. "అడవిలో ఏం దొరుకుతాయి?" అని కొద్ది సేపు ఊరుకున్నాడు. అయినా ఆకలి వేస్తూనే ఉంది. 'తినేందుకు ఏమైనా కావల్సిందే' అని అడవిలో అంతా వెతుక్కుంటూ తిరిగాడు. అది ఏప్రియల్ నెల- చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. అన్నిటికీ పూలు, అక్కడక్కడా పళ్ళు ఉన్నాయి. శివయ్యకు ఏవి తినచ్చో, ఏవి తినకూడదో అంత బాగా తెలీదు- అయినా తన అనుమానం కొద్దీ నచ్చిన పళ్ళు కోసుకొని తిని చూశాడు. వాటిలో కొన్ని అద్భుతంగా ఉన్నాయి!
వాటిని తింటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది: "నేను ఈ పళ్లు అమ్మి ఎందుకు జీవనం సాగించకూడదు? చెట్లను కొట్టకుండా ఉండొచ్చు కదా!" అనుకున్నాడు. వెంటనే తనకు నచ్చిన కాయలు, పళ్ళు కొన్ని కోసుకొని, పక్కఊరికి వెళ్లి అమ్ముకొని వచ్చాడు.
అప్పటికే అక్కడ వాళ్ల అమ్మ శివయ్య కోసం ఎదురుచూస్తూ ఉన్నది. 'కట్టెలు ఏవిరా?' అని అడిగితే జరిగినదంతా చెప్పి, తను సంపాదించిన డబ్బుల్ని ఆమె చేతిలో పెట్టాడు శివయ్య. "ఒరే, అడవిలో ఏ కాయలు మంచివో, ఏవి కావో తెలుసుకోవాలి. ఎవరినైనా అడిగి ఏవి దేనికి పనికొస్తాయో కూడా కనుక్కోవాలి" అని, వాళ్ల అమ్మ వెళ్ళి ఊళ్ళో వాళ్ళను అడిగి ఆ సమాచారం కూడా తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత శివయ్య, వాళ్ళ అమ్మ ఇద్దరూ పిల్లలు ఇష్టంగా తినే రేగిపళ్ళు, జానిపళ్ళు, నేరేడు కాయలు, బలిజపళ్ళు, కలివి కాయలు, వీటితోబాటు పెద్దవాళ్లకు ఉపయోగపడే కుంకుడు కాయలు, ఉసిరి కాయలు, తేనె- ఇలా రకరకాల వస్తువులను అడవిలోంచి తెచ్చి ఊళ్ళలో అమ్మటం మొదలు పెట్టారు.
ఆ సంవత్సరం వానలు సరిగా లేక, ఊరిలో కూడా పనులు ఏవీ లేక, ఊళ్ళోవాళ్ళు చాలామంది పట్నాలకు వలస పోతామని బయలుదేరారు.
కానీ శివయ్య "అడవి తల్లి ఉండగా మనకు అంత అవసరం ఏమొచ్చింది?" అని ఊళ్ళో యువకులకు మరికొంతమందికి తను చేస్తున్న పనినే నేర్పాడు. తను బ్రతకటమే కాకుండా మరికొంత మందికి బ్రతుకు తెరువు కల్పించాడు.
అయితే త్వరలోనే అడవిలోనే పళ్లు, కాయలు దొరకటం కష్టమై పోయింది.
ఊళ్ళో వాళ్లంతా సమావేశమయ్యారు. "అడవిని నమ్ముకుంటే బాగుంది. కానీ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చెయ్యాలి? అందుకని మనం మన పొలాల్లోనే పంటలతో పాటు పూల చెట్లు, కూరగాయలు, పళ్లు పండిద్దాం. నీళ్ళ పొదుపు కోసం బిందు సేద్యం చేద్దాం. ప్రస్తుతానికి పూలు త్వరగా పూస్తాయి కాబట్టి ముందు పూలచెట్లు పెట్టుకుందాం, తరువాత మిగిలిన పంటలు చేతికి వస్తే వాటిని అమ్మి జీవనం సాగిద్దాం" అన్నాడు శివయ్య.
ఇంత మంచి సలహా ఇచ్చినందుకు గ్రామస్తులంతా శివయ్యని అభినందించారు. అందరికీ లాభదాయకమైన ఈ పధకం ఫలించింది. ఆ సంవత్సరం ఊళ్ళో ఎవ్వరూ వలస పోలేదు!