విశ్వ ఆర్థిక వేదిక వారు ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ లో నిర్వహించే సమావేశానికి ప్రపంచం మొత్తం మీద నుంచీ ఎంపిక చేసిన మేధావులను, జర్నలిస్టులను ఆహ్వానిస్తారు. ఈ ఏడూ అలాంటి సమావేశం జరిగింది.
ఇందులో ఖదీజా నియాజీ (Khadija Niazi) అన్న పన్నెండేళ్ళ బాలిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆమెని గురించే ఈసారి పరిచయం చేస్తున్నది!
ఖదీజా పాకిస్తాన్ దేశంలోని లాహోర్ నగరానికి చెందిన అమ్మాయి. అందరిలాగే స్కూలులో చదువుకుంటోంది.
ఆ అమ్మాయి కొన్నేళ్ళ క్రితం ఆకాశంలో ఎగిరే పళ్ళాల గురించి విన్నది. దాంతో ఆమెకు 'ఆస్ట్రో బయాలజీ' అంటే ఆసక్తి కలిగింది. 'పెద్దయ్యాక తను కూడా భౌతిక శాస్త్రంలో పెద్ద శాస్త్రవేత్త కావాలి. దానికోసం ఇప్పట్నుంచే ఆ దిశగా పరిజ్ఞానం పెంచుకోవాలి' అనుకుంది.
ఈమధ్య కాలంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్ని సబ్జెక్టుల పైనా ప్రాథమిక స్థాయి నుండి బాగా ఉన్నత స్థాయి వరకూ క్లాసులు ఇంటర్నెట్ ద్వారా నిర్వహిస్తున్నాయి. వీటిల్లో మనమూ పేరు నమోదు చేసుకుంటే, వారం వారం ఒక క్లాసు, రోజూ చేసుకునేందుకు హోమ్ వర్క్, చివర్లో ఒక పరీక్ష - ఇట్లా మన మామూలు క్లాసుల్లాగే ఇవీ జరుగుతాయి- ఇంట్లో, కంప్యూటర్ ముందన్నమాట! అయితే, ఈ పని చేస్తే మన స్కూల్లో అదనపు మార్కులు ఏమీ ఇవ్వరనుకోండి, అది వేరే సంగతి. ఏదన్నా అంశంపై మనకి ఆసక్తి ఉండి, స్వయంగా చదువుకుని అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఇంకా లేనప్పుడు, ఎంచక్కా ఇలాంటి కోర్సుల్లో చేరి ఆ విషయాలన్నీ ఒక క్రమంలో నేర్చుకోవచ్చన్నమాట!
ఖదీజా చేసింది అదే. తనకి పదేళ్ళు ఉన్నప్పుడు, 'కృత్రిమ మేధ' (Artificial Intelligence) అన్న కంప్యూటర్ కోర్సు చేసి, పాసయ్యింది. ఆ అనుభవం తనకి నచ్చింది. ఆ తర్వాత వెంటనే ఇంటర్నెట్ లో ప్రాథమిక స్థాయిలో ఫిజిక్స్ అంశాలు బోధించే కోర్సులో చేరింది. ఆ క్లాసులు క్రమం తప్పకుండా వింటూ, తన భౌతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకుంది.
ఇంతలో, ఉన్నట్లుండి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ క్లాసులనుంచే వెబ్సైటును భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించింది. ఖదీజాకు ఇక ఏం చేయాలో తోచింది కాదు! కానీ ఆ కోర్సులే చేస్తున్న ఇతర విద్యార్థులు వెంటనే ఆమెకి ఇతర మార్గాల ద్వారా కోర్సు అందే ఏర్పాటు చేశారు. ఇట్లా అందరి సాయంతో చివరికి ఖదీజా పరీక్ష రాయగలిగింది. ఊరికే రాయడం కాదు, డిస్టింక్షన్ తో ఉత్తీర్ణురాలు అయ్యింది! బాగా కష్టపడాల్సిన ఈ కోర్సులో, తనకంటే పెద్దవాళ్లందరి మధ్య, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణురాలు అయిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది! ఈ స్ఫూర్తితో తరువాతి నెలల్లో - ప్రాథమిక కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సుల్లో కూడా చేరి, వాటిలో కూడా డిస్టింక్షన్‌లో పాసైంది. ప్రస్తుతం గణితానికి సంబంధించిన కోర్సు ఒకటి చేస్తోందట!
ఇట్లా వరుస కోర్సుల్లో ఉత్తీర్ణతలు పొంది, అందరి మన్ననలూ అందుకున్నాక, విశ్వ ఆర్ధిక వేదిక సమావేశాలలో 'ఇంటర్నెట్లో చదువుకోవడం ద్వారా తనకి కలిగిన మేలు' గురించి ప్రసంగించింది-! విశ్వ రహస్యాలు తెలుసుకోవాలనీ, అందుకు గాను చరిత్ర, ఆస్ట్రో బయాలజీ, కెమిస్ట్రీ- ఇలా వివిధ అంశాలపై కోర్సులు చేయాలని ఆమె కోరిక. ఈ అమ్మాయి ఇలా కోర్సులు చేస్తూ ముందుకు సాగడమే కాదు, తన స్కూల్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటూ చదువుకుంటోంది. అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తుంది. ఈమధ్య ఇంటర్నెట్లో ఒక బ్లాగు కూడా నిర్వహించడం మొదలుపెట్టింది. దానిపేరు - "World studies with me"! మనమూ చేరదామా, ఆమె ప్రపంచంలో ?