సోంపేటలో ఉండే నాగయ్య కొడుకు సోంబాబు మహా సోంబేరి. ఆటలంటే మహా ఇష్టం, చదువంటే మాత్రం గిట్టదు, భయం! 'బడి' అంటే బందిఖానానే వాడికి.

తాను తెలివి తక్కువవాడిననీ, తనకు అసలు చదువు అనేదే అబ్బదనీ వాడి భావన. అందుకే వాడు బళ్ళో పెద్ద పంతులు కంటపడకుండా తప్పించుకు తిరుగుతుంటాడు.

రోజూ అమ్మ పెట్టిన పెరుగన్నం కడుపునిండా తిని, పుస్తకాల సంచీని భుజానికి తగిలించుకుని, చెట్లమ్మట పుట్టలెమ్మటా తిరిగి, మళ్ళీ బడి వదిలేవేళకు ఇల్లు చేరుతుండేవాడు వాడు.

అమ్మ-నాయనలకు వాడి ఈ మోసం ఇంకా తెలీనే లేదు. కొడుకు చక్కగా బడికి పోతున్నాడనుకునేవాళ్ళు వాళ్ళు.

ఐతే తన యీడు పిల్లలందరూ బళ్ళో ఉంటారు కదా, అందుకని ఒంటరిగా తిరగటం, ఆడుకోడం కష్టంగా ఉంది సోంబాబుకు. ఏదో ఆడుకుంటున్నాడు గానీ, నిజానికి అసలు సరిగ్గా తోచటమే లేదు.

అంతలో ఒక సోమవారం నాడు చెఱువుగట్టున కూర్చుని నీళ్ళలోకి రాళ్ళు విసురు తున్న రాంబాబు కనబడ్డాడు వాడికి. వాడిని చూడగానే సోంబాబు ఎగిరి గంతేసినంత పని చేశాడు-

"ఒరే రాంబాబూ బావా ! ఈడున్నవేరా?! బళ్ళోకెళ్ళలే!?" అని అడిగాడు.

"ఓరి! సోంబాబు బావా! రారోయ్! బళ్ళోచదువు కట్టం గుందిరా ! రాయాల, సదవాల, లెక్కలెయ్యాల..

నావల్లకాదొరే ! సదూకునేంత తెలివినాకు లేదు! అందుకే ఈ చెఱువు గట్టు కొచ్చినా ! ఇద్దరం కల్సి ఆడుకుందాం రారోరే !" అంటూ లేచి దగ్గరి కొచ్చాడు రాంబాబు.

ఇకనేం? ఇద్దరూ కల్సి ఆడి పాడి, కంచెలోంచి దూరి పళ్ళ తోటలోని కెళ్ళారు . దొంగతనంగా జామపళ్ళు కోసుకు తిన్నారు. ఇంక కాపలా కుక్క ఊరుకుంటుందా? అది గట్టిగా అరిచి వెంటపడటంతో కాపలా కామయ్య కర్ర తీసుకుని లేచి వచ్చాడు- "ఎవడొరే చెట్లకాడ?!" అంటూ. అతన్ని, కర్రని, కుక్కని చూసి పరుగు లంకించుకున్నారు ఇద్దరూ. వాళ్ళని తప్పించుకునేసరికి గసపోసింది ఇద్దరికీ.

అంతలో బడి నుండి ఇంటి కెళుతున్న పిల్లలు కొందరు ఎదురొచ్చారు వాళ్ళకి. "ఒరే రాంబాబూ, సోంబాబూ !

మీరిద్దరూ బళ్ళోకి రాలేదని పెద్ద పంతులు అడుగుతున్నార్రా ! ఈడేం చేస్తున్నార్రా?" అంటూ అటకా-యించారు వాళ్ళు.

"ఓ అదా! మా నల్లావు తప్పిపోయిందిరా ! మాయమ్మ ఎతుక్కు రమ్మంటే రాంబాబునుకూడా తోడు తీసుకెళ్ళానురా !" అంటూ టకాలున అబధ్ధం చెప్పేశాడు సోంబాబు.

"ఓరి పోరా, నీ అబద్ధాలు! మీయమ్మ నల్లావును తోలుకెళుతుంటే చూసినంరా, ఇప్పుడే !" అని నవ్వారు సావాసగాళ్ళు.

వెంటనే సోంబాబు తెలివిగా "ఓరి రాంబాబూ, ఇన్నావురొరే ! కర్రావు కనిపించిందిట్రా ! ఇహ రా పోదాం" అనెయ్యగానే ఇద్దరూ నేస్తాలని తప్పించుకుని పరుగెత్తారు.

ఆ మరునాటినుంచీ రాం బాబు సోంబాబుకు తోడయ్యాడు. ఇద్దరూ కలిసి వాగులూ వంకలూ చెడ తిరగసాగారు. ఓ రోజున సోంబాబు వాళ్ళ నాన్న నాగయ్యను పనిమళ్ళా కలిసారు పెద్దపంతులు గారు: "ఏం నాగయ్యా! నీ కొడుకు బళ్ళోకొచ్చి ఎన్నాళ్ళైందో కనీసం నీకైనా తెల్సా? నీలాగే నీ కొడుకునూ ’ఓ'కు ఎన్ని వంకర్లో తెలీకుండా చేస్తావా?" అని అడిగేశారు. అప్పుడుగాని సోంబాబు గుట్టు రట్టు కాలేదు.

దాంతో నాగయ్య మరునాటి నుంచీ "ఒరొరే, సోముగా! నువ్వెటూ బడికి ఎగనామం పెడుతు న్నావ్! ఈ పసూలనైనా మేపుకురా రేపటాల్నుంచీ!" అని తను మేపే నాలుగావులనీ, రెండు గేదెలనీ, అప్పగించటం మొదలు పెట్టాడు. రాంబాబు వాళ్ళ అయ్యకూడా "ఓరి, రాంబాబూ ! నువ్వూ మన గేదెలనీ ఆవులనీ మేపుకురా, పో! ఇయ్యాల్నుంచీ పసుల్ని మేపుకొస్తేనే బువ్వ !" అని గద్దించాడు.

సోంబాబు, రాంబాబు 'భయపడతారేమో, అట్లా అయినా దారికి వస్తారు' అనుకున్నారు పెద్దోళ్ళు. కానీ‌ వీళ్ళిద్దరికీ మాత్రం 'రొట్టె విరిగి నేతిలో పడినట్లు' అయ్యింది. ఇద్దరూ హాయిగా పశువుల్ని తోలుకుంటూ గాలికి తిరగటం మొదలు పెట్టారు. వీళ్ళకి తెలీదుగాని, పెద్ద పంతులు గారు మాత్రం వీళ్ళని ఎలాగో ఒకలాగా దొరికించుకుందామని ప్రయత్నిస్తూనే ఉన్నారు. "వీళ్ళిద్దరూ తిట్లకి లొంగరు.. దెబ్బలకు అసలు లొంగరు.. మరి దేనికి లొంగుతారు?"

ఒక రోజున ఉదయాన్నే రాంబాబు చేల గట్లంట ఉరుకులూ పరుగులూ పెడుతూ ఎదురుగా వస్తున్న సోంబాబుని ఢీ కొట్టినంత పని చేసి "ఒరే సోంబాబూ! మీ ఆవు ఈనిందిరా!" అని అరిచి చెప్పాడు.

సోంబాబుకి జున్ను అంటే చాలా ఇష్టం. ఆవు ఈనిందంటే అమ్మ జున్ను చేసిపెడుతుందిగా? అందుకని వాడు సంతోషంతో "ఏ ఆవ్ రా బా వా?“ అని కేకేశాడు .

అప్పుడే అటునుండీ బళ్ళోకెళుతున్న పెద్ద పంతులు "ఓరి భడవల్లారా! మీ కెక్కడిదిరా ఇంత ఙ్ఞానం? చదువేరాదు అని కోతలు కోస్తారు- మీరు ఐదేసి భాషలు ఎట్లా మాట్లాడార్రా ?!" అన్నారు వాళ్ళకెదురుగా నిలబడి.

సోంబాబు-రాంబాబు ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ "మేం ఐదు బాసలు మాట్టాడ్డవేంటి పెద్దసారూ ?" అన్నారు .

"ఒరే పిల్లలూ ! 'యే'- అంటే మరాఠీలోను, 'ఆవ్' అంటే హిందీలోను, 'రా ' అంటే తెలుగులోను , 'బా' అంటే కన్నడలోను , వా అంటే తమిళంలోను ఒకే అర్థం, తెలుసా- 'రమ్మని ' అర్ధం ! మీరేమో మీకు ఏమీ రాదని భయపడి బడి ఎగగొడుతున్నారు! ఐనా అలవోకగా ఐదు భాషలు మాట్లాడేశారే, మరి? మీకు తెలీకుండానే ఇన్నిభాషలు మాట్లాడారే, ఇక బళ్ళో చదువు కుంటే మీ తెలివి ఇంకా పెరగదూ?! కొంచెం ధైర్యం చెయ్యండిరా!

బళ్ళోకొచ్చి చదువుకోండి. ఇంకా ఎన్ని భాషలు మాట్లాడి పెద్ద పండితులైపోతారో చూడండి! భాషల్లో ఏమున్నదిరా, ఇట్లా అంటే అట్లా నేర్చేసుకోగలరు, మీలాంటి తెలివైన పిల్లలు. మీరెంత తెలివిగల వాళ్ళో మీకే తెలీదు ! బళ్ళోకి రండిరా !" అని ఉబ్బేశారు పెద్ద పంతులు గారు.

ఆయన మాటలతో రాంబాబు-సోంబాబులకు తమ తెలివిపైన నమ్మకం కుదిరింది. మరునాటి నుండీ మళ్ళీ బడికెళ్ళటం మొదలు పెట్టారు. కొన్నాళ్ళకు బాగా చదువుకుని మంచి పండితులైనారు !

చూశారా ! తోటివాళ్ళు ప్రోత్సహిస్తే ఎవరైనా ఎంతటి పనులనైనా సులభంగా చేయగల్గుతారు. భయపెట్టి, బలవంతంగా ఎవరిచేతా ఏమీ చేయించలేము !