అనగనగా ఒక ఊళ్ళో ఒక చలాకీ గుర్రపు పిల్ల ఉండేది. దాని పేరు జాకీ. దానికి వేగంగా దౌడు తీయడమన్నా, కొత్త ప్రదేశాలు చూడటమన్నా భలే సరదా. పరిగెడుతూ పోతే ఆకలి మాట కూడా గుర్తుకురాదు దానికి.
కానీ వాళ్ళమ్మ దానిని ఊరి పొలిమేరలైనా ఎప్పుడూ దాటనిచ్చేది కాదు- ' పిల్లది దారి తప్పిపోతుందేమో ' అని భయం వాళ్ళమ్మకి.
ఒక రోజు పగలంతా బుద్ధిగా ఉండి, మధ్యాహ్నం దాటాక కాస్త చల్లబడగానే ఊరి ప్రక్కనున్న అడవిలోకి
వెళ్తానని చాలా బ్రతిమాలింది జాకీ. చివరికి ఒప్పుకున్నది వాళ్ళమ్మ, జాకీ ఆనందానికి హద్దులే లేవు.
తనివితీరా అడవినంతా చుట్ట బెట్టే సరికి చీకటి పడబోతూ ఉంది. అప్పటికి గుర్తుకొచ్చింది- "చీకటి పడే లోపే
ఇంటికొచ్చేస్తానమ్మా" అని తను అమ్మకిచ్చిన మాట.
ఇక ఇంటి వైపుకు శక్తికొద్దీ వేగంగా పరుగెత్తింది జాకీ. అది ఇంటికి చేరేసరికి 'హమ్మయ్య' అనుకున్న వాళ్ళమ్మ, దానికి ఇష్టమైన పచ్చిగడ్డి పెట్టింది. అయితే అప్పటికే అలసట వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి జాకీకి.
"ఎంత అందంగా ఉందో అడవి! దాన్ని చూడగానే ఆకలి తీరిపోయిందమ్మా" అని చెప్తూనే నిద్రపోయింది.
ఆ రోజున కలత నిద్రలో జాకీకి ఒక అందమైన కల వచ్చింది: తనకు రెండు రెక్కలు వచ్చేసినట్లూ, వాటితో అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లూను! అది ఎగురుతుంటే క్రింద ఉన్న పశువులన్నీ తనను వింతగా చూస్తున్నాయంట, అట్లా పైన ఎగురుతూ క్రింద ఉన్న ఊళ్ళని చిన్నవిగా చూడటం భలే తమాషాగా ఉందిట దానికి. క్రొత్త క్రొత్త ప్రదేశాలు రోజూ బోలెడు చూడగల్గుతోందట, ఆ రెక్కల జాకీ. ఆకాశంలో గడ్డి ఉండదు కదా మరి? అందుకని క్రింద ఎక్కడైనా పచ్చటి పచ్చిక కనిపించగానే దిగి, కడుపు నిండా మేసి, చక్కగా ఎగిరిపోతోందిట.
ఒక రోజున అది అలా మేస్తోంటే, క్రింద నుంచి దాన్ని రోజూ చూసి ఆశ్చర్యపోయే దూడల గుంపు చుట్టు ముట్టిందట దాన్ని. "నీ రెక్కల రహస్యం మాకూ చెప్పవా, దయచేసి?" అని అడిగాయవి దాన్ని.
"ఔను కదా, ఇప్పటి వరకూ నేనూ ఆలోచించ లేదు, నాకీ రెక్కలెప్పుడొచ్చాయబ్బా?" అని కలలో ఆశ్చర్యపోయింది జాకీ. ఎంత ఆలోచించినా తనకు రెక్కలెట్లా వచ్చాయో దానికి గుర్తుకే రాలేదట.
"ఉండండి, మా అమ్మ నడిగి చెప్తాను" అని కలలో అనేసి, నిజంగానే "అమ్మా, నాకీ రెక్కలెట్లా వచ్చాయమ్మా, ఎప్పుడు వచ్చాయమ్మా?" అని నిద్రలో కలవరించటం మొదలుపెట్టింది జాకీ.
"కడుపు నిండా తిండి తినకుండా నిద్రపోతే రెక్కలైనా వస్తాయి, ఇంకేమైనా వస్తాయమ్మా" అని జాకీని నిద్రలేపి 'గడ్డి' పెట్టింది వాళ్ళమ్మ.