ఐదేళ్ల చింటూని బెదిరిస్తోంది వాళ్లమ్మ: "రేయ్! అల్లరి మానేసి బుద్ధిగా చదూకో, లేకపోతే టీచరుగారు కొడతారు చూడు!" అని.

చింటూకి కూడా తెలుసు ఆ సంగతి. వాడు రోజూ స్కూల్లో చూస్తూనే ఉన్నాడు.

టీచర్లు పిల్లల్ని బాగా చదవలేదని కొడతారు; యూనిఫాం సరిగ్గా వేసుకురాలేదని కొడతారు; ఆలస్యంగా వచ్చారని కొడతారు; ఎక్కువ నవ్వితే కొడతారు; నవ్వకుండా నిలబడితే సమాధానం చెప్పలేదని కొడతారు.

ఒక్కోసారి ఊరికే కూడా కొడతారు.

ఇదంతా చూస్తూ గట్టిపడ్డాడు చింటూ. ఇప్పుడు వాడికి కొట్టించుకోవటం అంటే భయం పోయింది. "టీచర్లు కొడితే, తన్నులు తినేస్తే సరి- ఎక్కువ బాధపడకుండా ఊరుకునేస్తే సరి" అనిపిస్తోంది. "వాళ్లు తనని కొట్టకుండా ఉండలేరు, ఎలాగూ- తను బాగా చదువుకున్నాడనుకో, రైటింగు బాలేదని కొట్టచ్చు; అల్లరి చేయకుండా బుద్ధిగా ఉన్నాడనుకో, చొక్కాయి మురికిగా ఉందని కొట్టచ్చు... ఎలాగూ తన్నులు తినే దానికి, ఇక చదవటం ఎందుకు?"

వాడంటే ఇంకా‌ చిన్న పిల్లాడు. మీకు తెలుసా మరి, ఎందుకు చదవాలో?

చదవాల్సింది టీచరు గారు కొడతారని భయపడికాదు. అమ్మానాన్నలకి భయపడీ కాదు.

కొందరు పెద్ద పిల్లలు పేరు కోసం, ర్యాంకుల కోసం చదవాలనుకుంటారు. బాగా అలిసిపోతారలాగ.

కొందరైతే గొప్పగొప్ప ఉద్యోగాల కోసం చదువుతారు. అవి అందరికీ రావుగా, ఎలాగూ? అప్పుడు , అవి రాకపోతే, వీళ్లు బాగా నిరాశపడిపోతారు. ఒకవేళ ఆ ఉద్యోగాలే వచ్చాయనుకో- "నా అంతవాడు లేడు" అని పొగరుమోతుతనం పోతారు.

చాలా సంవత్సరాల క్రితం పోతన గారు ఓ పద్యంలో చెప్పారు చదువెందుకో-

చదవని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వి వేక చతురత కలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ - అని.

చదవని వాడికి జ్ఞానం రాదు - వాడికి ఏమీ తెలీదు కదా, అందుకని ఒట్టి అజ్ఞాని అవుతాడన్నమాట.

మరి చదివితే-? మంచేంటో, చెడేంటో, వాటి మధ్య తేడాని గుర్తిం‌చటం ఎలాగో - ఇదంతా వచ్చేస్తుంది.

అందుకని, చదవాలి.

మంచి గురువుల దగ్గర చదవాలి.

అజ్ఞానం పోగొట్టుకునేందుకు, మనం పుట్టిన యీ ప్రపంచంలో ఏది ఏంటో, ఎందుకు -ఏది- ఎలా జరుగుతోందో తెలుసుకునేందుకు, సరిగ్గా ఎట్లా బ్రతకాలో నేర్చుకునేందుకు చదవాలి.

చలికాలం చదువులకాలం కూడాను! యీ కాలంలో హాయిగా కూర్చొని, ఇష్టంగా చదువుకోవచ్చు, కావాలనుకుంటే.

కావాలనుకుందామా మరి?!

అభినందనలతో, కొత్తపల్లిబృందం.