అనగనగా ఒక చక్కని అడవి. ఆ అడవిలో జంతువులన్నీ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. వేటి పని అవి చేసుకుంటూ, వేటికి కావలసిన ఆహారాన్ని అవి సంపాదించు-కుంటూ సుఖంగా జీవిస్తుండేవి.
అదే అడవిలో నివసిస్తూండేది ఒక పిల్లి. దానిది చాలా స్వార్థబుద్ధి. కష్టపడకుండానే సుఖం రావాలనుకునే స్వభావం దానిది. ఒకరోజున దానికి ఓ 'భోజనశాల' కట్టాలనే ఆలోచన కలిగింది. అయితే భోజనశాలను కట్టేందుకు అవసరమైన డబ్బు లేదు, దాని దగ్గర.
ఆ అడవిలోనే నివసించేవి నాలుగు స్నేహితులు- రామ చిలక, గోరింక, పావురం, కోయిల. వాటి స్వభావం పిల్లి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. నిస్వార్థజీవులు అవి. వాటికి దాన గుణం ఉంది. తమ సహాయం వల్ల ఎవరైనా జీవితంలో ఎదుగుతారు అనుకుంటే అవి ఎంత డబ్బు ఇవ్వడానికైనా, చివరికి ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడేవి.
పిల్లికి ఈ నాలుగు పక్షుల గుణం ఎలాంటిదో తెలుసు. వాళ్ళ మంచితనాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనుకున్నదది. నాలుగింటిద గ్గరా వేరు వేరుగా అప్పులు చేసి, వేరు వేరు గడువులు తీసుకున్నది.
అట్లా నలుగురి సొమ్ముతోటీ పిల్లి ఓ చక్కటి భోజనశాల నిర్మించుకున్నది. అయితే దానికి ఆ డబ్బును తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏ మాత్రం ఇష్టం లేదు! అందుకని అది ఒక పన్నాగం పన్నింది. అదే అడవిలో నివసించే గ్రద్ద వద్దకు వెళ్ళి, ఈ నలుగురు మిత్రులను గురించి చాలా చెడుగా చెప్పింది. అడవిలో అందరినీ అవి పీడిస్తున్నాయనీ, 'అవి ఎప్పుడు పోతాయా' అని అందరూ ఎదురు చూస్తున్నారనీ చెప్పింది. అందరి మేలూ కోరి, తను కొంతకాలం పాటు గ్రద్దకు కావలసిన ఆహారాన్ని, వసతిని కల్పిస్తానని ; గ్రద్ద ఎలాగో ఒకలాగా ఆ నాలుగు పక్షులను చంపెయ్యాలని, అందుకుగాను తను కొంత డబ్బు కూడా ఇస్తాననీ చెప్పి, ఆ గ్రద్దను తనతో పాటు ఇంటిలోనే ఉంచుకున్నది పిల్లి.
ఇలా కొంత కాలం గడిచింది. ఒకసారి ఈ నలుగురు స్నేహితులు కలిసి అవీ ఇవీ ముచ్చటించుకుంటుంటే పిల్లి ప్రస్తావన వచ్చింది. ఆ పక్షులకు ఎందుకో పిల్లిపై అనుమానం కలిగింది. 'ఓసారి చూసొద్దాం' అని బయలుదేరాయవి. దారిలో కనిపించిన ప్రతి జంతువూ వాటికి పిల్లిని గురించి చెడుగానే చెబుతున్నాయి- "పిల్లిది స్వార్థబుద్ధి. ఈ మధ్య అది ఒక గ్రద్దను కూడా తన ఇంటిలోనే పెంచుతోంది".
తెలివిగల ఆ పక్షులు పిల్లిలేని సమయం చూసి ఇంటి ముందుకు వెళ్ళాయి. దూరంగానే నిలబడి గ్రద్దతో స్నేహపూర్వకంగా మాట్లాడాయి- "గ్రద్ద నేస్తమా! నువ్వు క్రూర జాతికి చెందిన దానివే కావొచ్చు. కానీ నీకూ మనసుంది కదా? ఈ పిల్లి చెడ్డది అని నీకు తెలీదా? మేము ఎవ్వరికీ ఏ అపకారమూ తలపెట్టలేదే? అట్లాంటి మమ్మల్ని చంపడానికే పిల్లి దగ్గర ఉంటున్నావు నువ్వు. ఇది న్యాయమా?" అని అడిగాయి.
గ్రద్దకి ఆ సరికి పిల్లి గురించి తెలిసిపోయింది. నలుగురు స్నేహితులూ తనను పలకరించిన విధానం చూసి దానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నన్ను క్షమించండి. నాకు ఇష్టం లేక పోయినా ఈ పనికి ఒప్పుకున్నాను. కాసింత డబ్బు కోసం ఆశపడ్డాను. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి" అన్నదది.
"మనందరం కలసి పిల్లి బుద్ధిని మార్చాలి. తగిన గుణ పాఠం చెప్పి, దాన్ని మంచి దారికి తీసుకొని రావాలి. సాయం చేస్తావా?" అని అడిగాయి పక్షులు. "ఓ! తప్పకుండా సాయం చేస్తాను. అంతకంటే ఏం కావాలి?" అన్నది గ్రద్ద. "నీనుండి ఆ మాత్రం సహకారం ఉంటే చాలు-మిగతాది మేం చేస్తాం" అని పక్షులు నాలుగూ వెళ్ళి అడవిలోని జంతువులన్నిటినీ కలిసి పిల్లి గురించి చెప్పాయి. మరునాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా భోజనశాల దగ్గరికి రమ్మని వాటిని ఆహ్వానించి వచ్చాయి.
జంతువులన్నీ వచ్చి పిల్లి ఇంటి చుట్టూ కొంతదూరంలో నిశ్శబ్దంగా కూర్చున్నాయి. పక్షులు నాలుగూ ఒక్కటొక్కటిగా లోపలికి వెళ్ళి, "డబ్బు కోసం వచ్చాం" అన్నాయి. "ఓ, దానికేం? నలుగురి అప్పూ ఒకేసారి తీర్చేస్తాను రండి. మీ డబ్బును పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. కూర్చోండి" అని వాటిని అక్కడ కూర్చోబెట్టి, పిల్లి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే "అవిగో, వచ్చాయి చూడు- దొంగ పక్షులు. వాటి పని పట్టు" అన్నది గ్రద్దతో.
గ్రద్ద పరుగున వచ్చి, పక్షులు నాలుగింటినీ ఇంటిముందున్న పొదల్లోకి తరిమింది. కొద్ది సేపటికి వెనక్కి తిరిగి వచ్చి, పిల్లితో "నీ పని పూర్తయ్యింది. నాలుగు పక్షులనూ చంపేశాను. నాకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వు.
నేను వెళ్తానిక. అయినా నువ్వు బలే పిల్లివే? నీ పని పూర్తి చేసుకోటానికి ఎంత మందినైనా ఇలాగే చంపించేట్లున్నావే?!" అన్నది.
"అవును! నాకెవరూ అడ్డు రాకూడదు. అందుకేగా, మరి ఆ నాలుగు పక్షులనూ సునాయాసంగా అడ్డు తొలగించు-కున్నది?"జవాబిచ్చింది పిల్లి గర్వంగా నవ్వుతూ.
మరుక్షణం అడవిలోని జంతువులన్నీ పిల్లి ఇంటిలోకి వచ్చేశాయి. "దొరికిపోయావు పిల్లీ! నీ వ్యవహారం అంతా రట్టు అయ్యింది. నీ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇకపై నీతో ఎవరూ కలవరు; మాట్లాడరు. నువ్వు ఒక్కదానివీ ఎలా బ్రతుక్కుంటావో బ్రతుక్కో. నువ్వు కట్టిన ఈ ఇళ్ళూ, భోజనశాలలూ అన్నీ ఇకమీద ఉమ్మడి ఆస్తులు ఐపోతాయి" అని అరిచాయి అన్నీ.
ఇట్లా జరుగుతుందని ఊహించని పిల్లి బిత్తరపోయింది. భయపడింది. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. తనని బహిష్కరించవద్దని ప్రాధేయపడింది. "తప్పు తెలుసుకున్నాను. క్షమించండి. ఇకపైన నీతిగా జీవిస్తాను. నన్ను నమ్మండి" అని ఏడ్చింది.
దయగల ఆ పక్షులు నాలుగూ ముందుకు వచ్చి "నిన్ను మార్చడానికే మేమంతా ఇలా చేసాం తప్ప, నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం మాకు ఏ మాత్రం లేదు" అన్నాయి.
జంతువులన్నీ పక్షుల డబ్బుల్ని తిరిగి ఇప్పించాయి. పిల్లితో ఎప్పటిలాగానే స్నేహంగా ఉండసాగాయి. పిల్లి తన బుద్ధిని మార్పుకున్నది. నీతిగా జీవించటం మొదలుపెట్టింది.