చిత్రవర్ణుడు కొనసాగించాడు- "మీరందరూ తెలివైనవాళ్ళు. మీకు ధర్మాలు ఉపదేశిం-చవలసిన పనిలేదు.

బాగా ప్రొద్దు పోయింది. ఇక ఆలస్యం దేనికి? మీ మీ సైన్యాలను సిద్ధం చేసుకొని రండి. పొండి! యుద్ధం చేసి, మనం ఆ శత్రువు సంపదల్ని మొత్తాన్నీ దోచుకొని వద్దాం. బలం ఉన్నవాడివే సంపదలు!" అన్నాడు.

అప్పుడు మంత్రి దూరదర్శి లేచి నిలబడి - "ప్రభూ! ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అని చెబుతారు. ముందు మన సంగతి మనం ఆలోచించుకుందాం. అరుణముఖుడు చెప్పిన ప్రకారం చూస్తే 'యుద్ధం సరైనది' అని అనిపించటంలేదు. మన మిత్రులు, మంత్రులు, సేవకులు నిశ్చయంగా నమ్మ-దగిన వాళ్ళూ, మన మాట జవదాటని వాళ్ళు అయి ఉండి, శత్రుపక్షంలోని వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, అప్పుడు కదా, యుద్ధం చేయవలసింది?! అంతేకాదు- యుద్ధానికి దిగేముందు 'భూమి , ధనం 'అనే రెండింటినీ ముఖ్యంగా సమకూర్చుకోవాలి. అవి సమకూరిన తర్వాతనే కదా, యుద్ధం మొదలు పెట్టాల్సింది? తొందరపడి'ఏదో ఒకటి కానివ్వు' అని ముందుకు ఉరికేందుకు, ఆ హిరణ్యగర్భుడు అంత చేతకానివాడేమీ కాదు కూడాను.

మనం అనుకుంటున్నట్లు అతడు అంత సులభంగా లొంగేవాడుకాదు. అతను బల-వంతుడేకాదు, ప్రజలవిశ్వాసం చూరగొన్న-వాడు. అతని సైనికులు కూడా చాలా పరాక్రమవంతులు. శత్రువుల బలాన్ని అంచనా వేయకనే సాహసం చేసే వాళ్ళు సింహం బారిన పడే జింకలలాగా మరణిస్తారు. కాబట్టి మనం యీ సాహసాన్నించి వెనక్కి తగ్గితే మేలు" అన్నది.

ఆ మాటలతో ముఖం జేవురించగా చిత్రవర్ణుడు మంత్రి మాటల్ని తేలికగా కొట్టివేస్తూ "నీ మాటలేవో చాలా విచిత్రంగా ఉన్నాయే? చూడగా నువ్వు బాగా ముసలివాడివి ఐపోయినట్లున్నావు. తల నెరిసినంత మాత్రాన జ్ఞానం వచ్చేస్తుందా ఏమిటి? ముసలివాళ్ళు తమకు అనుకూలం-గా ఉన్నవాటినే చూస్తారు తప్పిస్తే, ఇక వేటినీ కానరట! జ్ఞానంతో ముసలివారైతే గద, వాళ్ళ మాటల్ని సభికులు పట్టించుకునేది?

నేను పరరాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు ఎట్లాగూ నిశ్చయించుకొని ఉన్నాను. ఇక మా ఉత్సాహాన్ని నీరుగార్చేటట్లు, నువ్వు నేర్చిన నీతులన్నీ మాముందు వల్లించే సాహసం చెయ్యకు.

నీకు ఓపిక ఉన్నట్లైతే, గెలుపుకు తగినవీ, ఉల్లాసాన్ని కలిగించేవీ ఏమైనా మాట్లాడు. ఆ మాత్రం చేసినా నువ్వు మాకు మహోపకారం చేసినట్లు భావిస్తాం, మేము" అని చాలా కరకుగా మాట్లాడాడు.

దాంతో మనసు ఎంత నొచ్చుకున్నా నొచ్చుకోనట్లు, పై పెచ్చు చాలా సంతోషం కలిగినట్లు, భరింపరాని అవమానం తనకు చేసిన గాయం పిసరంత కూడా బయటికి కనిపించకుండా నవ్వు ముసుగు వేసుకొని, లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని నటిస్తూ, ఆ గ్రద్దమంత్రి "మాకందరికీ ప్రభువులవారంటే ఉన్న ప్రేమాభిమానాలకొద్దీ, కపటం లేకుండా నా మనసులోని మాట చెప్పాను. చెవికి చేదుగా ఉన్నాకూడా, సేవకుడన్నవాడు తన ప్రభువు మేలుని దృష్టిలో ఉంచుకొని తన మనసులోని మాటను చెబుతుండాలి. అట్లా కాకుండా కొందరు మూర్ఖులు యజమాని మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని, తమకు తెలిసినదాన్ని కూడా దాచిపెట్టి, కక్కుర్తి కొద్దీ నోరు తెరవకుండా ఊరుకుంటారు. అట్లాంటి వారినే 'స్వామి ద్రోహులు' అంటారు. వాళ్ళకి ఈ లోకంలోనూ, పరలోకంలో కూడాను శాంతి ఉండదు. అన్ని ధర్మాలూ ఎరిగినవారు- తమకు తెలియదా, నీతిమంతులెవరో, అవినీతి పరులెవరో? మేమందరం తమ సుఖదు:ఖాలను మావిగా భావించుకొని, తమరి అనుజ్ఞ కొద్దీ మెలిగే సేవకులం. తమరి ఆజ్ఞ ఏదైనా మేం మీరం. తమరు సత్య సంకల్పులు- తమరు అలా ఆనతి ఇవ్వగానే సేనా సమూహాలన్నీ‌యుద్ధోత్సాహంతో బారులు తీరి ఇలా తరలి వచ్చేశాయి. దండయాత్రకు ఇది మంచి సమయం. 'శత్రువు చిన్నవాడు కదా' అని ఆలక్ష్యం పనికిరాదు. చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. కాబట్టి సైన్యం మొత్తాన్నీ తీసుకు వెళ్ళి, అకస్మాత్తుగా దాడిచేసి మీద పడ్డామంటే శత్రుసైన్యాలను మట్టి కరిపించటం మనకు తేలిక అవుతుంది. కాలయాపన చేశామంటే వాళ్ళందరూ సన్నద్ధులవ్వటమే కాదు, తమ స్నేహితులను కూడా‌ సాయానికి తెచ్చుకుంటారు. అప్పుడిక వాళ్ళను ఓడించటం కష్టమౌతుంది.

కాబట్టి వెంటనే శత్రు భయంకరంగాను, మిత్రులకు సంతోషం కలిగేటట్లుగాను యుద్ధానికి బయలుదేరదాం. పనిని ఎప్పుడైనా సమయం అయిపోకముందే చేయటం సరైన పని. "ఆలస్యం అమృతం విషం" అని చెబుతారు కదా, పెద్దలు?!" అన్నది.

గ్రద్ద పలికిన ఆ మాటలకు నెమలి రాజు సంతోషించి, సైనికదళాలను ముందుకు నడుపమని తన సేనానులకు ఆజ్ఞనిచ్చి, దాడికి బయలుదేరింది. అటుపైన ఆ సైన్యం ఇక ఎక్కడా ఆగకుండా ప్రయాణించి, త్వరలోనే హంసరాజ్యానికి ఆవలనున్న కొండను చేరుకొని, అక్కడ విడిది ఏర్పాట్లలో మునిగాయి.

ఇక అక్కడ, హంసరాజు హిరణ్య గర్భుడు కొలువై ఉండగా, అంతకు ముందు చిత్రవర్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన కొంగ-దీర్ఘముఖుడు వచ్చి నిలబడ్డాడు. పరుగున వచ్చినందువల్ల ఆయాసంతో క్రొద్ది సేపు నిలబడి అటుపైన ప్రభువుకు నమస్కరించి, ఆయన అనుమతితో దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఏదో చెప్పదలచినవాడు కాస్తా కొంచెం సంకోచించి, అక్కడ నిల్చున్న వారందరినీ చూసేసరికి, అతని మనసెరిగిన మేఘవర్ణుడు, ఇతరులు అవతలికి పోయారు.

అప్పుడు దీర్ఘముఖుడు ప్రభువుకు మరింత దగ్గరగా జరిగి, గొంతు తగ్గించి, మెల్లగా అన్నాడు- "మహారాజా! చిత్రవర్ణుడి సభలోని సంగతులు చెబుతాను- సావధానంగా వినండి. 'యుద్ధమే నిశ్చయం' అని బయలుదేరిన చిత్రవర్ణుడు తన సైన్యంతోపాటు మలయపర్వతానికి ఆవల విడిది చేసి ఉన్నాడు. ఇక నుండీ ప్రతిక్షణం ఏమారక కోటను కాపాడుకోవలసి ఉన్నది.

మరొక్క ముఖ్యవిషయం మనవి చేస్తాను. గతంలో ఆ రాజు చేత అవమానింపబడిన పావురం ఒకదానితో స్నేహం చేసి, ఆ రాజు అనుసరించే వ్యూహాన్ని మొత్తాన్నీ‌ఆకళింపు చేసుకున్నాను. చెప్తే నమ్ముతారో నమ్మరో కాని, చిత్రవర్ణుడు పంపించిన గూఢచారి ఒకడెవరో‌మన కొలువులో చేరి ఉన్నాడని తెలియవచ్చింది. అయితే నాకు ఎక్కువ సమాచారం సేకరించేందుకు అవకాశం లేకపోయింది- ఆ చారుడెలా ఉంటాడో‌ తెలియరాలేదు.

మాటల సందర్భంలో మరొక సంగతి కూడా తెలియవచ్చింది- ఆ రాజ్యపు మంత్రి సూచనలను రాజు చిత్రవర్ణుడు పట్టించుకోలేదట- అందువల్ల అతని మనసు నొచ్చుకున్నదట- అలుకపూని ఉన్నాడట. ఇది కూడా మన ఆశయం‌ నెరవేరేందుకు కొంత అనుకూలంగానే‌ ఉన్నదని తోస్తున్నది. ఈ సంగతులలో ప్రభువులవారికి ఏది ముఖ్యమనిపిస్తే దాన్ని స్వీకరించగలరు. మొన్న రాత్రి చీకటిపడుతున్నదనగా చిత్రవర్ణుడి అనుచరులు కొందరు నాకు ఎదురుపడ్డారు. పూర్వ పరిచయం కొద్దీ వాళ్ళు నన్ను గుర్తు పట్టినట్లున్నారు- నా మాటతీరును, ముక్కు ముఖాన్ని చూసి- "ఇతను ఆనాటి దీర్ఘముఖుడే కావచ్చు" అని అనుమానంతో తబ్బిబ్బయి, తడబడిపోయి, దగ్గరికి రాబోయారు. వాళ్ళ వాలకం చూసి నా వెంట్రుకలు నిక్క బొడుచుకున్నాయి. ఆలస్యం చేస్తే పని చెడుతుందని గబగబా లేచి వచ్చేశాను. ఆ నా తడబాటుని చూసి నాతోబాటు ఉన్న పక్షులన్నీ కలవరపడి, "ఏమైంది, ఏమైంది?" అని అడగటం మొదలుపెట్టాయి. నేను వాటితో- "ఏమీలేదు- ఏమీ లేదు- ఇప్పుడే వచ్చేస్తాను" అని తేలికగా మాట్లాడి కొన్నిటిని, మోసపుచ్చి కొన్నిటిని- ఇక్కడికి పరుగెత్తి వచ్చాను. మన ధవళాంగుడు ఇంకా అక్కడే ఉన్నాడు" అని తను విన్నది, చూసింది పూర్తిగా వివరించి ఊరుకున్నాడు.

ఇది విన్న మంత్రి కళ్ళు మూసుకొని కొద్ది సేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తెలివైనవాడు కాబట్టి, శత్రువు పధకాన్ని ఊహించి, రాజుతో "ప్రభూ! విన్నారా?! ఇక్కడ మనల్ని మోసగించి స్నేహితుడిగా నటిస్తూ ఉన్న వాడెవరో ఉన్నారని మన దీర్ఘముఖుడి మాటలనుండి తెలుస్తున్నది. ఒక విధంగా చూస్తే ఆ గూఢచారి నీలవర్ణుడే కావచ్చును. ఆకారం చేత తప్ప మరేవిధంగాను గౌరవించటానికి పనికిరాదు, ఆ కాకి. అది ఇక్కడికి రావటం వెనుక చాలా కథ ఉండి ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు పట్టించుకోలేదంటే, శరీరంలో నిలవ ఉంచుకొన్న విషం మాదిరి, ఇది మన ప్రాణాలమీదికి తెస్తుంది. వేరే ఆలోచన మాని, నా మాటను ఆలకించండి- ఇతరులను చెడగొట్టటంకోసం దుర్మార్గులైన వాళ్ళు పలు పోకడలు పోతారు. వాళ్లకు ఎల్లప్పుడూ తమ పని ధ్యాస తప్ప వేరేది ఏదీ ఉండదు. గొప్ప మాయగాళ్ళు వీళ్ళు. వాళ్లని నమ్మామంటే కీడు తప్పదు. ఈ‌ కాకి ఒట్టి గయ్యాళిది- దీని మాటలు నిజమనుకోకండి. ఖచ్చితంగా ఇది సింహళద్వీపం నుండి వచ్చినది కాదు.

నిప్పును ఒడిలో‌మూట కట్టుకున్నట్లు, ఇతన్ని దగ్గర పెట్టుకునేదెందుకు? స్వార్థం కోసం శత్రువు ముచ్చటగా, ఇష్టం అయ్యేట్లు మాట్లాడి, మంచి చేసుకొని నమ్మించి, చివరికి మోసం చేసి చంపేస్తాడు. అట్లాంటివాడితో సావాసానికి ఒప్పుకోవటం అన్నది, నేరుగా ఆ యముడితో పొత్తు పెట్టుకోవటమే తప్ప వేరుకాదు. దుర్మార్గుడైన శత్రువు ఆవు ముఖం పెట్టుకున్న పులిలాగా అన్నింటా సాధు పుంగవుడి మాదిరి ప్రవర్తిస్తుంటాడు.

అలాంటివాడితో సావాసాన్ని వదలకపోతే మంచివాడికి ఇక మనుగడ అన్నదే లేదు. 'చిరంజీవి' అనే కాకిని నమ్మి చచ్చిపోయిన గుడ్లగూబల కథ వినలేదా?

ప్రభువులవారికి ఆ కథ చెబుతాను వినండి" అంటూ కాకి గుడ్ల గూబల కథ చెప్పసాగింది-

(ఆకథ మళ్ళీ చెప్పుకుందాం..)