రెండు తలనొప్పులు!
డాక్టర్: తలనొప్పా ? అయితే రెండు మాత్రలు వేసుకో
వెంగళప్ప: రెండెందుకండీ, ఒకటి చాలు. నాకున్నది ఒక్కటే తలకాయ...!
భార్య: బీరకాయలు తెమ్మంటే టెంకాయలు తెచ్చారేంటండీ?
వెంగళప్ప: నిన్న డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు పీచు బాగా ఉన్న కూరలు తినమన్నాడుగా...!
అర్థ సత్యం!
వినయ్: నాన్నా! పౌష్ఠికాహారం, సంపూర్ణాహారం అంటే ఏమిటి?
బేరర్ సుబ్బారావు: పౌష్ఠికాహారం అంటే ప్లేట్‌మీల్స్, సంపూర్ణ ఆహారం అంటే పుల్‌మీల్సురా!
పని లేని పని!
గిరి: మనకెప్పుడూ ఓటమి రాకూడదంటే ఏం చేయాలి?
హరి: ఏమీ చేయకుండా ఉంటే సరి! అసలు ప్రయత్నమే చేయొద్దు...!
షుగర్!
భర్త: ఒక కప్పు కాఫీ తీసురా,కామేశ్వరీ!
భార్య: ఇదిగో, తెస్తున్నా నండీ.
భర్త: ఇదేంటి?! కాఫీలో చక్కెర బదులు ఉప్పువేశావ్?
భార్య: ఏం పర్లేదులెండి. మీకు షుగర్ ఉందని, చక్కెర బదులు నేనే ఉప్పు వేశాను తాగండి!
జ్ఞాపక శక్తి!
తండ్రి: ఒరేయ్, స్కూల్లో నీ జ్ఞాపకశక్తికిగాను ఏదో బహుమతి ఇచ్చారటగా? ఏదీ చూపించు!
కొడుకు: ఇచ్చారుగానీ, దాన్ని ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు నాన్నా!
చల్లని పిల్లోడు!
సతీష్: నాన్నా! మా బళ్ళో అందరూ చందమామ మీదకు వెళ్తామన్నారు. కానీ నేను మాత్రం సూర్యుని పైకి వెళ్తానని చెప్పాను.
తండ్రి: ఎట్లా పోతావురా? అక్కడికి వెళితే కాలిపోతావ్!
సతీష్ : ఏమీ పర్వాలేదు. రాత్రి పూటే వెళతానులే నాన్నా, సూర్యుడి పైకి!
ఏంతెలివి!
బంటి: '35మార్కులు వస్తే పాస్' అన్నారు కద టీచర్? మరి నాకు 36 మార్కులు వచ్చాయిగా, అయినా ఫెయిల్ చేసారేం?
టీచర్: ప్రతి సబ్జెక్టులో 35రావాలి బంటీ, అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపికాదు...!
చిన్న తాడే!
జడ్జి: నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?
ముద్దాయి: నేను రెండు మీటర్ల తాడును దొంగిలించాను సార్.
జడ్జి: అంతేనా! తాడు దొంగిలించినందుకే నిన్ను అరెస్ట్ చేశారా?
ముద్దాయి: క్షమించండి సార్. ఆ తాడు వెనక ఒక గేదె కూడా ఉందండి.
తొందర!
మాస్టారు: ఒరేయ్ గోపీ, నువ్వు పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలి.
గీపీ: అప్పటిదాకా ఎందుకు సార్, మీరే ఒక మంచిపేరు ఆలోచించి చెప్పండి ఇప్పుడే.
నలుగురు మిత్రులు!
టీచర్: రాజా రామ్ మోహన్ రాయ్ గురించి నీకు ఏం తెలుసో చెప్పు, రామూ?!
రాము: వాళ్లు నలుగురు మంచి స్నేహితులు టిచర్.
భీమ బలుడు!
రాజు: వారం క్రితం నేను ఒక సింహం కాలు, ఓ ఏనుగు తొండం, ఒక గాడిద ముక్కు విరగ్గొట్టాను.
ఆనంద్: అవునా! అవేమీ చెయ్యలేదా నిన్ను? ఏమైంది అప్పుడు?
రాజు: ఏమవుతుంది? షాపులో బొమ్మలు అన్యాయంగా విరగ్గొట్టానని షాపతను నన్ను ఎట్లా కొట్టాడంటే, ఇప్పటివరకు ఆ నొప్పి తగ్గలేదు...!
ఆగుము-చూడుము-వెళ్ళుము
టీచర్: రేవంత్ ఇవాళ స్కూలికి ఆలస్యంగా వచ్చా వేంటి?
రేవంత్: చాలా నెమ్మదిగా నడుచు కుంటూ వచ్చాను.
టీచర్: నెమ్మదిగా నడవమని నీకెవరు చెప్పారు?
రేవంత్: సార్, బయట రోడ్డు మీద ఒక బోర్డు పెట్టారు. అందులో "దయచేసి నెమ్మదిగా వెళ్ళండి" అని రాసిఉంది మరి!
నేర్చుకో
కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి?
కాకి చేసుకొన్న ఖర్మమేమి?
మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
కాకి ఏం తప్పు చేసిందని దానికా అపనిందలు?, కోకిల ఏం పుణ్యం చేసుకున్నదని, దానికా మెప్పుకోలులు? చక్కటి మాటతీరు వల్లనే మర్యాద లభిస్తుంటుంది.
ఇనుడు వెలుగునిచ్చు; ఘనుడు వర్షమునిచ్చు
గాలి వీచు; చెట్లు పూలు పూచు
సాధుపుంగవులకు సహజలక్షణమిది
లలిత సుగుణజాల! తెలుగుబాల!
సూర్యుడు వెలుతురును ఇస్తూ ఉంటాడు; మేఘుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు; గాలి వీస్తూ ఉంటుంది; చెట్లు పూలు పూస్తూ ఉంటాయి. మంచివాళ్ళకు ఇట్లా 'ఇస్తూ ఉండటం' అనేది సహజ లక్షణం.
ముందు వెనుక గనుము, తొందర పడకుము
ఆపదలకు మౌఢ్యమాస్పదంబు
అరసి చేయువాని వరియించు సంపదల్
లలిత సుగుణజాల! తెలుగుబాల!
ముందు వెనకలు ఆలోచించు. తొందర పడకు. మూర్ఖత్వం అన్ని ఆపదలకూ మూలం. ఏ పనియినా అర్థం చేసుకొని చేస్తూండు.