అనగనగాఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. ఒక రోజున దానికి ఒక కుక్క కనిపించింది. పిల్లికి చాలా భయం వేసింది. ఒకటే పరుగు పెట్టింది. అయినా కుక్క దాన్ని వదలలేదు. వెంటపడి, ఇంక ఎటూ పోకుండా అడ్డుపడ్డది. "ఇప్పుడెలా తప్పించుకుంటావు? ఇంక నిన్ను వదిలి పెట్టేది లేదు" అంది. పిల్లి గజగజ వణికింది.
"నన్ను వదిలి పెట్టండి కుక్కగారూ! నేను చాలా తెలివైన పిల్లిని" అని వేడుకున్నది కుక్కని.
కుక్క కొంచెం ఆలోచించింది. "తెలివి గల పిల్లివా? అయితే నేనడిగే పొడుపుకథలకు సరైన జవాబులు చెప్పు- వదిలి పెడతాను. లేకుంటే ఈ పూటకు నువ్వే నా ఆహారం! అసలు నాకు తెలివైన పిల్లులంటే చాలా ఇష్టం!" అంది.
పిల్లికి కొంచెం భయం వేసింది. అయినా చేసేదేముంది? వణుకుతూనే 'సరే, కానివ్వు, అడుగు' అన్నది. కుక్క అడగటం మొదలుపెట్టింది:
కుక్క:- నాలుగుకాళ్ళుండు నడయాడలేదు, చేతులు రెండుండు పనిచేయలేవు- అయినా వచ్చిన అతిథులకు మర్యాద చేస్తుంది, కూర్చుండ బెడుతుంది గౌరవిస్తుంది- ఏంటది?
పిల్లి:- కుర్చీ!
కుక్క:- సరే, ఇది చెప్పు- "తోక ఉంటుంది కానీ జంతువుకాదు, ఆకాశంలో ఎగురుతుంది కానీ విమానంకాదు- ఏమిటో చెఫ్ఫు?"
పిల్లి:- గాలిపటం!
కుక్క:-ఊఁ..కొంచెం తెలివి ఉంది, నీకు. ఇది చెప్పు- "అమ్మా అంటే కలుస్తాయి, నాన్న అంటే విడిపోతాయి- ఏంటవి?"
పిల్లి:- పెదాలు!
కుక్క:- బాగుందోయ్! ఇంకోటి అడుగుతాను చూడు- "ఒంటినిండ కన్నులుండు ఇంద్రుడుకాదు, కంఠమందు నలుపు కాడు శివుడు, ఫణుల పట్టి చంపు-పక్షీంద్రుడా? కాడు! మరి యెవరంటావు అది?"
పిల్లి:- నెమలి !
కుక్క:- ఓహో! అన్నీ చెప్పేస్తున్నావే! ఇది చూడు- "చెయ్యనికుండ , పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం, తియ్యగనుండు-అదేమిటి?"
పిల్లి:- కొబ్బరికాయ!
కుక్క:- అబ్బ ఏం తెలివి! "రాజుగారి టవల్- ఎంత ఎండ ఉన్నా ఎండదు! ఏంటా టవల్, ఏమా కథ?"
పిల్లి:- నాలుక!
కుక్క:- "అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మకొమ్మకూ కోటి పువ్వులు. అయినా ఉన్నవి రెండే రెండు కాయలు.. ఏంటి, ఈ వివరం?"
పిల్లి:- ఆకాశం, నక్షత్రాలు, సూర్య-చంద్రులు!
కుక్క:- "బానే చెబుతున్నావు పిల్లీ! "గూటిలో ఉంటాము గువ్వలంకాదు. చుట్టూ కాపలా ఉంటుంది కానీ రాజులంకాదు. న్యాయ ధర్మాలు తెలుసు కానీ న్యాయమూర్తులంకాదు- ఎవరం? మేం ఎవరం?
పిల్లి:- కళ్ళు!
కుక్క:- వావ్! బాగా చెప్పావు. ఇది ట్రై చెయ్యి. "నూతికి నూరుకన్నాలు- ఏంటది?"
పిల్లి:- జల్లెడ!
కుక్క:- సరే, సరే, ఇది కూడా చెప్పేస్తావేమో మరి, చూడు- "తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు ఏమిటది?"
పిల్లి:- పనసపండు !
కుక్క: వావ్! చిన్నదానివైనా తెలివిగా జవాబులుచెప్పావు. నీలాంటి తెలివిగల-వాళ్ళంటే నాకు చాలా ఇష్టం! ఇకనుండీ మనిద్దరం స్నేహితులం .
కుక్క పిల్లిని చాలా మెచ్చుకున్నది. వదిలి పెట్టేసింది. పిల్లి సంతోషంగా బయటికి పరుగు తీసింది.