విక్రమార్కుడు ఉజ్జయినిని పరిపాలిస్తున్న సమయంలో ఆయన రాజ్యంలోనే మంత్రగాడు ఒకడు ఉండేవాడు. అతను తపస్సు చేసి గొప్ప శక్తులు సంపాదించాడు. కానీ ఏమిటో, అతనికి ఉన్నంత కోపం, అసహనం వేరే ఎవ్వరికీ ఉండవు.

ఒకసారి అతను నిద్రపోతూంటే పిల్లి ఒకటి ఆ వైపుకి రాబోయింది. వస్తూ వస్తూ అది అక్కడే ఉన్న ఒక కుండను తన్నింది. వెంటనే కుండ కాస్తా క్రింద పడి ఢమాలున పగిలిపోయింది.

ఆ శబ్దానికి తటాలున నిద్ర లేచాడు మంత్రగాడు. "తన నిద్రను చెడగొట్టిన పిల్లే, తన కుండను కూడా పగల గొట్టింది!" 'నా నిద్రను చెడగొడతావా, నువ్వొక కట్టెలా మారిపో!' అని పిల్లిని శపించి తన కమండలంలోని నీళ్ళు చల్లాడు అతను. అంతే- మరుక్షణం ఆ పిల్లి కాస్తా కట్టెలాగా మారిపోయింది.

తర్వాత మంత్రగాడు బయటకు వెళ్ళి సూర్య నమస్కారాలు చేస్తుండగా కాకి ఒకటి ఆ పై కొమ్మ మీదే కూర్చొని రెట్ట వేసింది. మంత్రగాడికి చాలా కోపం వచ్చేసింది. కాకివైపుకు కమండలంలోని నీళ్ళు చల్లుతూ "నామీదే రెట్ట వేస్తావా? నువ్వొక బండరాయిగా మారిపో" అన్నాడు గట్టిగా. మరుక్షణం ఆ కాకి కాస్తా బండరాయిలా మారిపోయింది.

కాకి రెట్ట మంత్రగాడిని చాలా బాధించింది. మళ్ళీ స్నానం చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగాడతను. సరిగ్గా అదే సమయానికి అటు వచ్చిన చేప ఒకటి అతని వేలును చటుక్కున కొరికింది. "నా వేలునే కొరుకుతావా? నువ్వొక మ్రానువైపో!" అని చేపను శపించాడు అతను, చేతిలోని నీళ్ళను నదిలోకే వదిలేస్తూ. మరుక్షణం ఆ చేపకాస్తా మెరిసే ఒక చెట్టులా మారిపోయింది.

అదే సమయానికి అక్కడికి చేరుకున్నాడు విక్రమార్కుడు. రాజ్య పర్యటనకోసం మారువేషంలో ఉన్నాడాయన. నదీ స్నానం చేసి బయటికి వస్తూండగా ఎటో చూసుకుంటూ వచ్చిన మంత్రగాడు రాజుని గుద్ది క్రింద పడ్డాడు. తప్పు అతనిదే, అయినా అతను మాత్రం రాజు మీద మండి పడ్డాడు. "ఏమిరా, కళ్ళు కనబడవా? ఎవరనుకున్నావురా, నన్ను?!" అని గర్జించాడు మంత్రగాడు.

"చూసుకోలేదు, క్షమించండి స్వామీ!" అని దూరంగా నడవటం మొదలు పెట్టాడు విక్రమార్కుడు.

"ఏమిరా, అంత అలక్ష్యం?! ఎంత పొగరు, నీకు?! నువ్వు పిల్లిలా మారిపో!" అని శపించి, మంత్రించిన నీళ్ళు అటువైపుగా చల్లాడు మంత్రగాడు.

విక్రమార్కుడు మామూలు రాజు కాదు కదా, అందుకని అతను గబుక్కున క్రిందకు వంగి తనకు అందిన కట్టెను ఆ మంత్ర జలానికి అడ్డం పెట్టాడు. ఆ కట్టె వేరేదేదో కాదు; అంతకు ముందు మంత్రగాడి కారణంగా కట్టెగా మారిన పిల్లే అది! ఇప్పుడు మంత్రజలం తగలగానే కట్టెకాస్తా తిరిగి పిల్లిగా మారిపోయింది. గబగబా తన్నుకొని విక్రమార్కుడి చేతిలోంచి తప్పించుకొని పారిపోయిందది!

చేతిలోని కట్టె కాస్తా తటాలున పిల్లిగా మారటం చూసిన విక్రమార్కుడికి నవ్వు ఆగలేదు. కానీ అతని నవ్వుని చూసిన మంత్రగాడికి మటుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం కొద్దీ అతను రాజు వెంట పడటం, అతన్ని ఉడికించటంకోసం రాజు పారిపోవటం జరిగాయి. కొంత దూరం పరుగు పెట్టాక విక్రమార్కుడికి అలసట వచ్చింది. దారిలోనే ఉన్న ఒక బండరాయి మీద కూర్చున్నాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న మంత్రగాడు గట్టిగా అరుస్తూ "ఇక్కడ కూర్చున్నావా, దుండగీడా! కాకిలా మారిపో!" అని మంత్రజలం చల్లాడు విక్రమార్కుడి వైపుకు. మరుక్షణంలో విక్రమార్కుడు అక్కడినుండి లేచి ముందుకు దూకటం, మంత్ర మహిమ వల్ల బండరాయి కాస్తా కాకిలా మారి కావు కావు మంటూ ఎగిరిపోవటం జరిగిపోయినాయి!

మరి ఆ బండరాయి అంతకు ముందు ఎగిరి రెట్టవేసిన కాకే కద!

మంత్రగాడికి ఇంకా చాలా కోపం వచ్చింది. మళ్ళీ రాజు వెంట పడ్డాడు. విక్రమార్కుడు పరుగెత్తి ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. మీకు అర్థమైందిగా, ఆ చెట్టు ఏంటో? అంతకు ముందు చేపలా ఉండి మంత్రగాడిని కొరికిన చేపే, ఆ చెట్టు. ఈసారి మంత్రజలం తగలగానే ఆ చెట్టుకాస్తా చేపలాగా మారి నవ్వుకుంటూ నీళ్ళలోకి జారిపోయింది.

విక్రమార్కుడు బిగ్గరగా నవ్వేసరికి సన్యాసికి చాలా కోపం వచ్చేసింది. "తన మంత్రాలు ఏవీ వీడి మీద ఫలించటం లేదేమి?" అని ఉడుక్కున్నాడతను. "నువ్వు ఎలుకలు ఉండే గోతిలో పడిపోదువుగాక" అని మంత్రం చదివి నీళ్ళని విక్రమార్కుడి వైపుకు చల్లాడతను. విక్రమార్కుడు చటుక్కున క్రిందికి వంగే సరికి, అక్కడొక అద్దం ముక్క కనబడింది. ఏదో ఒకటి కానిమ్మని ఆయన ఆ అద్దాన్నే అడ్డం పెట్టాడు నీళ్ళకు. ఇంకేముంది, కాంతి లాగానే పరావర్తనం చెందిన ఆ శాపంకాస్తా మంత్రగాడి మీదే పడింది! అతనే పోయి ఎలుకలున్న గోతిలో పడ్డాడు!

ఎలుకలన్నీ తనని కొరుకుతుంటే "రక్షించండి-రక్షించండి" అని మొత్తుకుంటున్న మంత్రగాడిని విక్రమార్కుడే కాపాడాడు. "నీకేమన్నా శక్తి ఉంటే దాన్ని సమాజానికి మేలు చేయటం కోసం ఉపయోగించు.

కోపంతో అందరినీ కష్టాలపాలు చేస్తావెందుకు?" అని మందలించాడు మంత్రగాడిని.

తనను కాపాడింది విక్రమార్క మహారాజేనని తెలిసాక మంత్రగాడు సిగ్గుతో కుంచించుకు-పోయాడు.

అటుపైన తన శక్తిని సమాజ హితం కోసమే వినియోగిస్తానని మాట ఇచ్చి, ఆ ప్రకారమే నడచుకున్నాడు!