రాజ్యానికి ఓ దివాన్ కావాలని ప్రకటన ఇచ్చాడు, చంద్రగిరిని పాలించే విజయసేనుడు .

ప్రకటన విని తన దగ్గరకు వచ్చే వారికి ఆయన మూడు బొమ్మలు చూపించి వాటి మధ్య తేడా చెప్పమనేవాడు.

'మూడూ ఒకేలా ఉన్నాయి . తేడాలేదు' అనే సమాధానమే అందరి నుంచీ వచ్చేది.

అది వినగానే "అవునా! అయితే మీరిక వెళ్ళొచ్చు. మీ చిరునామా బయట వ్రాసి వెళ్ళండి" అని ఇంటికి పంపించేసేవాడు రాజు. ఇట్లా చాలామంది రావటం, పోవటం జరిగింది.

అట్లా ఇట్లా ఈ సంగతి చంద్రగిరి గురుకులంలో పాఠాలు చెప్పే గురుప్రసాదుకు తెలిసింది. సునిశిత దృష్టి, పరిశీలనా శక్తి ఉన్న గురుప్రసాదు సభకు వెళ్ళి రాజుగారిని కలిసాడు. "పరీక్షకు నేను సిద్ధం మహారాజా" అన్నాడు.

రాజుగారు బొమ్మల్ని చూపించారు. గురుప్రసాద్ బొమ్మల్ని కాసేపు పరిశీలించి "ప్రభువులు అనుమతిస్తే, నేను గదిలో ఆమూలన ఉన్న చీపురు పుల్లనొకదాన్ని వాడుకుంటాను" అన్నాడు.

"ఓఁ ! ఎంచక్కా వాడుకోండి" అన్నాడు రాజు చిరునవ్వు నవ్వుతూ.

గురుప్రసాదు మొదటి బొమ్మను చేతులోకి తీసుకొని, దాని చెవిలో చీపురుపుల్ల దూర్చాడు. అది మరో చెవిలోంచి బయటకు వచ్చింది.

అతను నవ్వి, రెండో బొమ్మ చెవిలోకి దూర్చాడు పుల్లని. అది దాని నోట్లోంచి బయటికి వచ్చింది.

అతను మళ్ళీ నవ్వి, ఈసారి మరింత ఉత్సాహంగా మూడో‌బొమ్మను పట్టుకొని దాని చెవిలోకి పుల్లను దూర్చాడు- ఈసారి పుల్ల అసలు బయటికే రాలేదు!

"తేడా గమనించారుగా, ప్రభువులవారు?!" అన్నాడు గురుప్రసాదు నవ్వుతూ.

"బాగానే ఉంది లెండి, మరి దీని అర్థం ఏంటంటారు?" అడిగాడు విజయసేనుడు, తనూ నవ్వుతూ.

"ఈ మొదటి బొమ్మలాంటి వారు చాలా మంది ఉంటారు మహారాజా! వీళ్ళంతా విషయాలను ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు. దేన్నీ సొంతం చేసుకోలేరు.

ఇక రెండో‌ బొమ్మ లాంటి వాళ్ళు వేరే రకం. ఇట్లాంటి వాళ్ళు దేన్నీ దాచుకొని ఉండలేరు. తాము విన్నది విన్నట్లే అందరికీ చెబుతుంటారు. పుకార్లకు పట్టుగొమ్మలు వీళ్ళు.

ఇక ఈ‌ మూడో‌బొమ్మలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు విషయాలు అన్నిటినీ జాగ్రత్తగా వింటారు- బాగా ఆకళించుకొని, ఏది మంచో-ఏది చెడో చూసుకొని సరైన నిర్ణయం తీసుకుంటారు.

చూసేందుకు ఒకేలాగా ఉండే బొమ్మల్లో‌ ఎంత తేడా ఉందో చూడండి, అచ్చం మనుషుల్లో లాగానే!" వివరించాడు గురుప్రసాదు.

అతడి వివరణ విన్న విజయసేనుడు "నేను ఇన్నాళ్లుగా వెతుకుతున్నది మీలాంటి వ్యక్తి కోసమే! మీరు నా దగ్గరే ఉండి దివానుగా రాజ్య పాలనలో సహకరించండి" అని వినమ్రంగా చెప్పాడు.