వనపర్తి అనే గ్రామంలో నగల వ్యాపారం చేసే రంగయ్యకు అత్యవసరంగా నమ్మకస్తుడైన, తెలివైన సహాయకుడు ఒకడు కావలసి వచ్చాడు. వ్యాపారంలో భాగంగా ప్రతిరోజూ బంగారం కొనుక్కురావడమో, అమ్ముకు రావడమో- మొత్తానికి లక్షల్లో సొత్తు చేతులు మారడం- జరుగుతూ ఉండేది. ఈ లావాదేవీల నిర్వహణకు తగిన సహాయకుడిని చూసి పెట్టమని రంగయ్య తన మిత్రుడైన లక్ష్మయ్యను కోరాడు.

గ్రామానికి దూరంగా గురుకులం నడుపుతున్నాడు లక్ష్మయ్య. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులందరూ మంచి మంచి ఉద్యోగాలలో కుదురుకుని ఉన్నారు. తన వద్ద వ్యాపార విద్యను

నేర్చుకుంటున్న శిష్యులలో వినయ్, వరుణ్, వంశీ అనే ముగ్గుర్ని రంగయ్య వద్దకు పంపాడు లక్ష్మయ్య.

వారిలో ఒకరిని ఎంపిక చేసుకోమని సూచించాడు.

ఆ యువకులను ఆహ్వానించిన రంగయ్య "ముందుగా మీకు ఒక పని చెబుతాను- ఎందుకో, ఏమిటో అడగకుండా పూర్తి చేయండి " అంటూ ముగ్గురి చేతుల్లోనూ మూడు మూటలను ఉంచాడు. "ఒక్కో మూటలోను వందేసి రూపాయి నాణాలు ఉంచాను. చూసుకోండి. మీరు ఎవరికి వాళ్ళు వెళ్ళి, వాటిని ఊరి చివరి చెరువులో విసిరి రండి" అన్నాడు.

'డబ్బును చెరువులోకి విసిరెయ్య మంటున్నాడు ఎందుకో?' అని తటపటా యించారు యువకులు ముగ్గురూ.

అయినా మారు మాట్లాడకుండా వెళ్ళి పని పూర్తి చేసుకొని వచ్చారు.

"తమరు చెప్పిన పనిని ముందుగా నేనే పూర్తిచేసాను- డబ్బు మూటను విప్పనైనా విప్పకుండా చెరువు మధ్యకు విసిరి వేసాను" అని వినయంగా చెప్పాడు వినయ్.

"నేను మూటను విప్పిచూశాను, సరిగ్గా వందరూపాయి నాణేలు ఉన్నాయి. మీరు చెప్పినట్టే వాటిని చెరువులోకి విసిరేసి వచ్చాను" అన్నాడు వరుణ్.

"మీరు కొద్దిగా పొరబడినట్టున్నారు. నాకిచ్చిన మూటలో నూటొక్క నాణేలు ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా నేను నూరునాణాలను మాత్రం చెరువులోకి విసిరేసి, ఒక నాణాన్ని వెనక్కి తెచ్చాను- ఇదిగోండి" అంటూ ఒక నాణాన్ని అందించాడు వంశీ.

రంగయ్య చిరునవ్వు నవ్వి "ఇది నేను మీకు పెట్టిన పరీక్ష ! ఇందులో నెగ్గిన వంశీనే నా సహాయకుడుగా ఎంపిక చేసుకుంటున్నాను" అన్నాడు.

"ఇదేం న్యాయం? ఇదేం పరీక్ష?" అడిగారు వినయ్, వరుణ్.

"నిజానికి నేను మూడు మాటల్లోనూ నూటొక్క నాణేలు ఉంచాను. అయితే వినయ్ ఏ మాత్రం తెలివిని ఉపయోగించలేదు. పని తొందరగా కావాలని మాత్రం ఆత్రపడ్డాడు. మూటలోని డబ్బును కనీసం లెక్కకూడా పెట్టకుండా విసిరి వేశాడు. ఇది అతని బద్ధకాన్నీ, ఇతరుల డబ్బు పట్ల అతనికున్న అలక్ష్యాన్నీ సూచిస్తుంది.

ఇక వరుణ్- డబ్బును లెక్కఅయితే పెట్టాడు- కానీ మిగిలిన ఒక రూపాయినీ జేబులో వేసుకోకుండాఉండలేకపోయాడు. తనకు డబ్బు పట్ల ఉన్న వ్యామోహాన్ని అతను ఇలా బయట పెట్టుకున్నాడు.

ఒక్క వంశీ మాత్రమే తన నిజాయితీని నిరూపించుకోగలిగాడు. నాకు కావలసిన వ్యక్తి నాకు అవిధేయుడు ఎట్లానూ కాకూడదు. దానితోబాటు అతను తొందరపాటు మనిషి కాకూడదు, నా సొమ్మును మింగేసే అవినీతిపరుడు కాకూడదు- నా సొమ్మును తనదిగా భావించి, చెప్పిన పనిని జాగ్రత్తగా ఆలోచించి చేసే నమకస్తుడే కావాలి. అందుకు తగిన వాడు వంశీనే అని నాకు అనిపించింది" వివరించాడు రంగయ్య.

ఆయన సమాధానంతో సంతృప్తులైన వినయ్, వరుణ్‌ ఇద్దరూ రంగయ్యకు నమస్కరించి, 'తమలోని అవగుణాలను అధిగమించటం ఎలాగా' అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టారు.