తిమ్మాపురంలో గోపన్నకు పొలం వుంది. కానీ వరుసగా మూడేళ్ళు సరిగా వర్షాలు కురియక పంటలు పండలేదు. ఆ కరువులోనే తల్లిదండ్రులు ఇద్దరూ జబ్బులతో చనిపోవటంతో గోపన్న ఒంటరివాడై పోయాడు.

ఉన్న ఊళ్ళో బ్రతకటం కష్టమైంది. రాజధాని- విజయనగరానికి వెళ్ళాడు, ఏదైనా పని దొరికితే చేసుకుందామని. పొట్ట చేత్తో పట్టుకుని నగరానికి రానైతే వచ్చాడుగానీ అతనికి ఏ పనీ దొరకడం లేదు.

నగరానికి కొత్త. తెలిసిన వాళ్ళెవరూ లేరు. 'తెలిసినవాళ్ళు ఎవరైనా పరిచయం చేస్తే తప్ప పనిలో పెట్టుకోలేం' అని వ్యాపారస్తులు నిర్మొహమాటంగా చెప్పారు. గుడిలో పెట్టే ప్రసాదాలు, అన్నదానాలతో కడుపు నింపుకుంటున్నాడు గోపన్న.

ఆరోజున అతనికి తినడానికి ఏమీ దొరకలేదు. "ఇక లాభం లేదు. మంచిగా బ్రతుకుదామంటే ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. దొంగతనం చేసైనా బతకాలి" అనుకున్నాడు . ఊరి చివరన ఒక ఇంట్లో ముసలమ్మ ఒంటరిగా ఉండటం గమనించాడు. చీకటి పడే వరకూ వేచిఉన్నాడు. వీధంతా సద్దుమణిగాక తలుపు తట్టాడు.

ముసలమ్మ తలుపు తెరవగానే "చంపుతా! మర్యాదగా నగలు, నగదు ఇవ్వు!" అని కత్తితో బెదిరిద్దామనునుకున్నాడు.

అంతలోనే తలుపు తీసింది- ఆ ఇంట్లో ఉండే శాంతమ్మ. తలుపు తీసీ తీయగానే గోపన్నను చూసి నవ్వింది.

"రా నాయనా! నీ కోసమే ఎదురు చూస్తున్నాను" అన్నది.

గోపన్న ఆశ్చర్యపోయాడు. "నేను వస్తున్నట్లు నీకు ఎట్లా తెలుసు?" అని అడిగాడు.

"ఇవాళ్ళ మా ఆయన చనిపోయిన రోజు. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టాలని ఆచారం పెట్టుకున్నాను.

ఈ వీధిలో అంతా ధనవంతులు. 'ఇవాళ్ళ ఇంతవరకూ ఎవరూ రాలేదు. చీకటి పడిపోతున్నదే' అనుకున్నాను. అంతలోనే నువ్వు వచ్చి తలుపు తట్టావు. మా ఆయనే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు. మా కొడుకంత వయసు నీది. రా, కాళ్ళు కడుక్కో. ముందు కాస్తంత అన్నం తిందువు" అన్నది.

గోపన్న తను వచ్చిన పని మర్చిపోయాడు. కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. శాంతమ్మ అతనికి కడుపు నిండా భోజనం పెట్టింది.

ఆమె గురించిన వివరాలు అడిగాడు గోపన్న. శాంతమ్మ భర్త, కొడుకు కూడా యుద్ధంలో చనిపోయారు.

తను ఒంటరిగా జీవిస్తున్నది.

ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చెయ్యకూడదని నిర్ణయించుకున్న గోపన్న భోజనం చెయ్యగానే వెళ్లిపోయేందుకు సిద్ధ పడ్డాడు. కానీ శాంతమ్మ ససేమిరా పోనివ్వలేదు. "ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? ఇవాల్టికి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్దువులే" అన్నది.

గోపన్న నిద్రపోతుండగా తలుపు చప్పుడైంది. రాజభటులు వచ్చారు. శాంతమ్మ తలుపు తీసి మాట్లాడింది- "అమ్మా! నగరంలోకి దొంగలు ప్రవేశించారని సమాచారం వచ్చింది. జాగ్రత్తగా ఉండు" అంటున్నారు వాళ్ళు. ఇంట్లో పడుకుని వున్న గోపన్నను చూసి "ఎవరు, ఇతను?" అని అడిగారు.

"పరాయివాడు కాదు, వీడు నా కొడుకే" చెప్పింది శాంతమ్మ.

రాజభటులు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు.

గోపన్నకు ఏడుపు వచ్చేసింది. శాంతమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ 'నేను దొంగతనం కోసమే వచ్చానమ్మా' అని నిజం చెప్పేశాడు.

శాంతమ్మ నవ్వింది. "పర్వాలేదులే బాబూ. పరిస్థితుల ప్రభావం వల్ల మంచి మనిషే అలా దొంగలా ప్రవర్తిస్తాడు. ఇందులో నీ తప్పేం లేదులే" అని ఓదార్చింది.

"అమ్మా! నీకు ఎవరూ లేరు; నేను దిక్కులేని వాడిని. నువ్వు సరేనంటే నీ దగ్గరే పని పాటలు చేసుకుంటూ నిజాయితీగా బ్రతుకుతా" వేడుకున్నాడు గోపన్న.

"అంతకంటేనా! నిన్ను దేవుడిచ్చిన కొడుకు అనుకుంటాను, నా దగ్గరే వుండిపో" అన్నది శాంతమ్మ.