అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు సుభాష్, ద్విజేంద్ర. ప్రతిరోజూ సాయంత్రం వాళ్ళిద్దరూ వాళ్ళ స్నేహితులతో క్రికెట్ ఆడుకునేందుకు పోయేవాళ్ళు. ఆ ఆట స్థలం అడవిని ఆనుకొని ఉండేది. ఆ అడవిలో దయ్యాలు ఉంటాయని అందరికీ అనుమానం. "ఎందుకురా, పిల్లలూ? అక్కడికెందుకు వెళ్తారు?" అని అడిగేవాళ్ళు చాలామంది. అయినా పిల్లలకు ఆ స్థలం అంటే చాలా ఇష్టంగా ఉండేది. క్రికెట్ ఆడుకునేందుకు అది అంత అనువుగా ఉండేది మరి.
ఒకసారి పిల్లలందరూ అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు, సుభాష్ బంతిని ఎంత గట్టిగా కొట్టాడంటే -ఆ బంతి ఎగ్గిరి- నేరుగా అడవిలోనే పడింది! అడవిలోకి వెళ్ళటం ఎవ్వరికీ ఇష్టంలేదు! దాంతో "నువ్వే కద, బంతిని కొట్టింది? అందుకని బంతిని నువ్వే తేవాలి" అని పట్టుపట్టారు మిగిలిన పిల్లలు.
సుభాష్‌కి మామూలుగానే దయ్యాలంటే భయం. ఇప్పుడేమో సాయంత్రం అయిపోయింది- చీకటి పడబోతున్నది. ఈ సమయంలో అడవిలోకి వెళ్ళి బంతిని వెతుక్కురావాలంటే ఎలాగ? వాడు కొంచెంసేపు తటపటాయించాక, స్నేహితుడు ద్విజేంద్రవైపు చూస్తూ "సరేలేరా, తెద్దాం. నాకు తోడుగా నువ్వూ వస్తావా, మరి?" అన్నాడు. "సరేలేరా, నేను వస్తానులే!" అని సుభాష్‌కి తోడుగా వచ్చాడు ద్విజేంద్ర.
వీళ్ళు సగం దూరం వెళ్ళాక, ఒక మర్రి చెట్టు దగ్గర కనబడింది బంతి. బంతిని చూడగానే వాళ్ల ప్రాణం లేచివచ్చినట్లయింది. సుభాష్ ముందుకెళ్ళి బంతి వైపుకు చెయ్యి చాచాడో లేదో, విపరీతమైన గాలి వీచింది.
కొద్దిదూరంలోనే గాలి సుడి తిరిగింది కూడాను. పిల్లలిద్దరికీ చాలా భయం వేసింది. అంతలోనే ద్విజేంద్ర ముందుకు దూకి, బంతిని చేతులోకి తీసుకొన్నాడు. ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగు మొదలు పెట్టారు.
వాళ్ళు ఇంకొన్ని అడుగులు వేస్తే చాలు- అడవిని దాటేస్తారు. అంతలోనే వాళ్ళకు రెండు పిల్ల దయ్యాలు ఎదురుపడ్డాయి. రెండూ తెల్లటి అంగీలు వేసుకొని, ఇకిలిస్తూ దారికి అడ్డంగా నిలబడి ఉన్నాయి! వాటి నీడలు పొడుగ్గా దారి వెంబటి పరచుకొని ఉన్నాయి. రెండూ "ఊ.. ఊ.." అంటున్నాయి.
దయ్యాలను చూడగానే సుభాష్‌కి కళ్ళు తిరిగినట్లయింది. వాడు తటాలున క్రింద పడి మూర్ఛపోయాడు.
ద్విజేంద్ర మటుకు ధైర్యంగా నిలబడి చూశాడు దయ్యాలని. అవి ఇకిలిస్తూ ఉన్నాయి, కానీ వాటి పెదవులు కదలటం లేదు.. వాటి గొంతులు కూడా ఎక్కడో పరిచయం ఉన్నట్లుగానే అనిపిస్తున్నాయి. అంతలో మళ్ళీ గాలి వీచింది. గాలికి దయ్యం వేసుకున్న తెల్ల అంగీ కొంచెం కదిలింది. ఒక్క అర్థనిముషం పాటు దాని వెనక ఉన్న గీతల చొక్కా బయట-పడింది. ద్విజేంద్ర మెదడు చురుకుగా పని చేసింది..ఇవి దయ్యాలు కావు- వీడు-..
సతీష్ గాడు!
వెంటనే ద్విజేంద్ర "ఒరేయ్! సతీష్! మాస్కు వేసుకుంటే నువ్వు దయ్యం అయిపోతావ-నుకున్నావురా? పిచ్చి పిచ్చి వేషాలు మాను. సుభాష్గాడికి అసలే భయం ఎక్కువ" అని అరిచాడు.
అది వినగానే సతీష్, వాడితోబాటు దయ్యం వేషం వేసుకొని ఉన్న చంద్ర ఇద్దరూ మాస్కులు తీసేసి నవ్వారు.
అంతలోనే క్రింద పడి ఉన్న సుభాష్‌ని చూసి వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి . "ఒరేయ్! పాపం వీడు నిజంగానే చాలా భయపడ్డట్లున్నాడురా!" అని ఇద్దరూ ఏడుపు ముఖం పెట్టారు.
"ఏం కాలేదులే, కొంచెం నీళ్ళు తెచ్చి వీడి ముఖం మీద చల్లండి. ముందు ఆ మాస్కులు తీసి దాచి పెట్టండి, మళ్ళీ బెదురుకుంటాడు వీడు" అన్నాడు ద్విజేంద్ర.
ముఖంమీద నీళ్ళు పడగానే లేచి కూర్చున్నాడు సుభాష్- "దయ్యాలు నన్ను ఎత్తుకెళ్ళాయా?" అంటూ.
"దయ్యాలు కాదు, గియ్యాలు కాదు- అవి వీళ్ళిద్దరే! అయినా నువ్వు ఊరికే అట్లా బెదురుకోకూడదు.
ప్రమాదాలు ఎదురైన-ప్పుడు ధైర్యంగా నిలబడాలిగాని ఇట్లా మూర్ఛపోతే ఎలారా?" స్నేహితుడు సున్నితంగా మందలిస్తుంటే సిగ్గుగా నవ్వాడు సుభాష్.