ఒక యువకుడు చనిపోయాడు. అతన్ని తీసుకెళ్ళడానికి యమ భటులు, స్వర్గ పాలకులు వచ్చారు.









నువ్వు స్వర్గానికి వస్తావా? నరకానికి వస్తావా?” అని అడిగారు అతనిని. యువకుడు అయోమయంలో పడ్డాడు.

"స్వర్గం ఎలా ఉంటుంది? నరకం ఎలా వుంటుంది? అని అడిగాడు వాళ్లని.

స్వర్గ పాలకుల చేతిలో‌ ఒక టచ్‌ప్యాడ్ ప్రత్యక్షం అయ్యింది.






'స్వర్గం అనేది ఇలా ఉంటుంది' అని టచ్‌ప్యాడ్‌లో చూపెట్టారు వాళ్ళు. స్వర్గంలో దేవుడు, భక్తి, నాట్యం ఉన్నాయి.

“మరి నరకం ఎలా ఉంటుందో‌ చూపించండి" అడిగాడు యమ భటుల్ని.






“నువ్వెప్పుడైనా సారాయి దుకాణానికి వెళ్ళావా? నరకం ఖచ్చితంగా ఆ దుకాణం లాగే ఉంటుంది" అన్నారు యమ భటులు.

సారాయి దుకాణం లాగా ఉంటుందనేసరికి యువకుడికి ఆశ పుట్టింది. నరకంవైపే మొగ్గు చూపాడు.

"వెంటనే తీసుకుపోండి; నరకం వచ్చేస్తా" అని తొందరపెట్టాడు.

"సరేలే! నువ్వు ఎట్లా అంటే అట్లా కానిస్తాం" అని యమభటులు అతన్ని నరకానికి తీసుకెళ్ళారు.

తీరా చూస్తే అక్కడ పరిస్థితి వేరుగా ఉంది! యువకుడు నిర్ఘాంత-పోయాడు. "ఇదేంటి, ఇది వేరేలాగా ఉంటుందన్నారుగా?” అన్నాడు.



యమ భటులు నవ్వారు: "అక్కడ మేం నీకు చూపించింది మా అడ్వర్‌టైజ్‌ మెంటు! దానికీ అసలు వస్తువుకూ తేడా ఉంటుంది మరి!” అన్నారు పళ్ళు నూరుతూ.