యస్‌ఆర్‌కే పురంలో నివసించే రవి మంచివాడే, చాలా తెలివైనవాడు కూడా- కానీ మహ పెంకి. అతని పెంకితనం వల్ల ఇతరులకు చాలా కష్టం కలిగేది; అయినా సరే, వాడు 'నా దారి-నా యిష్టం'అన్నట్లు ఉండేవాడు. వాడిలో ఉన్న అహంకారం అందరికీ కనబడటం వల్లనేమో, మరి వాడంటే ఎవరికీ పెద్ద ఇష్టం ఉండేది కాదు. అయినా ఏం చేస్తారు? ఎవరికివాళ్ళు మనసులోనే వాడిని తిట్టుకొని ఊరుకునేవాళ్ళు.

మనసారా వాడిని ఇష్ట పడేవాళ్ళెవరైనా ఉన్నారంటే అది వాళ్ళ అమ్మ మాత్రమే. వాడు ఎంత మొరటుగా ప్రవర్తించినా, ఆవిడ సర్దుకుపోయేది. వాడిని పల్లెత్తు మాట అనేది కాదు. దాంతో‌ రవికి ఊరంటే ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడిపోయింది: 'తనూ-తన తల్లీ ఒక పక్షం. ఊళ్ళోవాళ్లంతా వేరే పక్షం. ప్రజలు తమను చాలా హీనంగా చూస్తుంటారు. అయినా ఎప్పుడూ తమను ఎట్లా దోచుకోవాలా అనే ఆలోచిస్తుంటారు..' ఇలా సాగేవి వాడి ఆలోచనలు. వాడి ఈ అభిప్రాయాన్ని కాదనేందుకు ఊళ్ళో ఎవరూ లేరు- ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, వీడి ఆలోచనలు పట్టించుకునేంత తీరిక ఎవరికుంటుంది?

ఒకరోజున రవి వాళ్ళ నాన్న మంచాన పడి ఇక లేవలేదు. పట్నంలో డాక్టర్లు అతన్ని చూసి పెదవి విరిచారు. ఆ సమయంలో రవి ఆరో తరగతిలో ఉండేవాడు. 'తల్లి ఒక్కతే ఇల్లు నడిపించటం కష్టం కదా' అని తనూ కూలి పని చేస్తానని బయలుదేరాడు వాడు. అప్పుడు వేసవి సెలవలు-పెద్దగా పనులు కూడా ఉండేవి కావు. "వేలెడంత లేవు-నువ్వేం పని చేస్తావురా" అని ఊళ్ళోవాళ్ళు నవ్వినప్పుడు వాడికి చాలా కోపం వచ్చేది. ప్రజలపట్ల వాడికున్న కోపం మరింత వేళ్ళు ఊనుకునేది.

అయితే వాడు కూలిపని చేయటం మొదలు పెట్టాక, ప్రజలంటే వాడికున్న అభిప్రాయం కొద్దిగా‌ మారింది- "పారను ఇలా కాదురా, ఇట్లా తిప్పి పట్టుకోవాలి- గొడ్డలి వేటు బలంగా వెయ్యాలి, ఒకసారి వేటు పడిన చోటే మళ్ళీ‌ పడాలి- పనిలో కూడా‌ తెలివిని ఉపయోగించాలి, వాటంగా పనిచెయ్యాలి .."అంటూ చాలా విషయాలు నేర్పారు అందరూ. "చిన్నవాడమ్మా, ఈ పని చెయ్యలేడు- మనమే ఎత్తుదాం రండి" అని వాడు చెయ్యాల్సిన బరువు పనుల్ని తమ మీద వేసుకునేవాళ్ళు కొందరు. కొందరు వాడికి తాము తెచ్చుకున్న పదార్థాలు పెట్టేవాళ్ళు. "మీ నాన్నకు ఈరోజు ఎలా ఉంది?" అని వాకబు చేసేవాళ్ళు. పొలపు కాపులు వీళ్ళ ఇంటికోసమని ప్రత్యేకంగా కూరగాయలు, ఆకు కూరలు కోసుకు పొమ్మనేవాళ్ళు.

ఇట్లా ఊళ్ళోవాళ్ళు తన పట్ల ప్రేమగా వ్యవహరించినప్పుడు రవి ఆశ్చర్య-పోయేవాడు. వాళ్ళు తమని పట్టించు-కుంటున్నప్పుడు 'వీళ్ళకు ఇట్లా ఉండాల్సిన అవసరం ఏమున్నది?' అనిపించేది వాడికి. బడులు తెరచేసరికి ఊళ్ళోవాళ్ళంతా చెప్పారు రవి వాళ్ల అమ్మకు- "వీడికి మంచి తెలివితేటలు ఉన్నాయమ్మా, బడి మాన్పించకు. కావాలంటే ఉదయం-సాయంత్రం మేమే ఏమన్నా పనులు చూపిస్తాం- అవి చేసుకుంటూ చదువుకొమ్మను" అని. వాళ్ళ ఆప్యాయతతో రవిలో ఉన్న కరకుదనం కొంతవరకు తగ్గింది.

అట్లా రవి ఒకవైపున చదువుకుంటూనే మరొకవైపున పనికి వెళ్ళటం మొదలైంది. బడికి వెళ్ళిన తర్వాత అతను ఒక్క నిముషం కూడా వృధా చేసేవాడు కాదు- ఖాళీ సమయంలో పని చేసి డబ్బులు సంపాదించేవాడు. కానీ రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని సొంతగా చదువుకునేవాడు.

ఇక తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా నిద్రలేచి, గంటసేపు చదువుకొని, బయట ఎక్కడైనా పని దొరికితే పని చేసి, బడికి వెళ్ళేవాడు. అతని శ్రమ ఫలితంగా ఏడోతరగతిలో అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. పెద్దసర్కాల బడిలో అతనికి సీటుకూడా వచ్చింది! కాని రవి తన పరిస్థితిని చెప్పి, "నేను లేకపోతే మా కుటుంబం గడవదు. కనుక నాకు ఈ సీటు వద్దు" అన్నాడు. కానీ పెద్దసర్కాల బడి మాస్టారు ఊరుకోలేదు. వచ్చి రవి వాళ్ల అమ్మతో మాట్లాడారు- 'మీకు మేమందరం తలా ఇంత సాయం చేస్తాం; మీవాడిని చదవనివ్వు' అని ఊరివాళ్లంతా చెప్పినమీదట, రవి వాళ్లమ్మ అందుకు ఒప్పుకున్నది.

అప్పుడు రవికి తెలిసివచ్చింది- 'కలిసి బ్రతకటంలో బలం ఉంది. కలిసి బ్రతికినప్పుడు, కష్ట సుఖాలను పంచుకున్నప్పుడు మనుషులు దగ్గరవుతారు. ఎవరికివాళ్ళు విడివిడిగా ఉంటే మనసుల్లో‌ దూరం పెరుగుతుంది'. ఆనాటినుండి రవికి ఊళ్ళోవాళ్లంటే ఇష్టం కలిగింది.

పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చినప్పుడు ఎదురైన సంఘటన ఒకటి రవిని పూర్తిగా మార్చివేసింది. ఎండాకాలపు సెలవల్లో ఒకరోజు అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరి ఇంట్లోంచో మంటలు లేచాయి. మంటకు గాలి తోడవ్వటంతో ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు అంటుకొనసాగింది.

ఊరంతటా హాహాకారాలు చెలరేగాయి. యువకులంతా బృందాలుగా ఏర్పడి మంటలను ఆర్పేందుకు పూనుకున్నారు. ఆ ఆపద సమయంలో మంటల్లో ఇరుక్కున్న చాలామంది చిన్నపిల్లలను రవి కాపాడాడు. అంతలో మంటలు రవి వాళ్ల ఇంటికి కూడా‌ వ్యాపించాయి. రవికి ఆ సంగతి తెలిసింది- అయినా అతను చేస్తున్న పనిని విడిచి అక్కడికి పరుగు పెట్టలేదు- ఊళ్ళోవాళ్ళే బాధ్యతగా నీళ్ళు తెచ్చి పోసి రవి వాళ్ళ ఇంటిని కాపాడారు. గాయాలైన రవి వాళ్ల అమ్మని వాళ్ళే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అటు తర్వాత చాలామంది రవి తమకు చేసిన మేలును ప్రశంసించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు కూడాను!

తల్లి ప్రేమతో పాటు ప్రజల ప్రేమకూడా గొప్పదని అప్పుడు అర్థమైంది రవికి. స్వార్థం కారణంగా ఉన్న ఊళ్ళోనే ఒంటరిగా బ్రతికిన రవి అలా సమాజంలో ఒకడయ్యాడు; పదిమందిచేతా 'మంచివాడు' అనిపించుకున్నాడు.