శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే ఊరు ఒకటి ఉన్నది. ఆ ఊళ్ళో ఒక బడి ఉంది.

ఏనాడో అక్కడి రాజుగారు మొదలుపెట్టించారు దాన్ని- దానికి కావలసిన నిధులు వగైరాలు సమకూర్చి, అధ్యాపకుల్ని నియమించి, చాలామందికి చదువు చెప్పించారు.

ఆ తర్వాత రాజుగారి వారసులు నడిపించి ఉంటారు దాన్ని- అది నిరంతరంగా, ఆగకుండా నడిచేట్లు చూసేందుకు ఎవరు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారో, మరి- అట్లా ఆ బళ్ళో ఇంకా చాలామంది చదువుకున్నారు.

ఆ తర్వాత చాలా ఏళ్ళకి, మనకి స్వాతంత్ర్యం వచ్చాక, దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నది. రాజుగారి బడి "ప్రభుత్వ ఉన్నత పాఠశాల" అయ్యింది. అట్లా ఇంకా చాలా మందికి బడి అందుబాటులోకి వచ్చింది. వేలాది మంది పిల్లలు ఆ బళ్ళో చదువుకొని పెద్దవాళ్లయ్యారు. వందలాది మంది ఆ బళ్ళో పాఠాలు చెప్పారు.

150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ బడి ఈనాటికీ చిన్నబోలేదు! అక్కడి టీచర్లు పాఠాలు చెప్పీ చెప్పీ అలసిపోలేదు. "మాకెందుకులే, ఈ‌ చదువుల సంగతి- మా జీతాలు మాకు అందుతున్నాయి" అనుకోలేదు. "పిల్లలకి ఇంకా బాగా నేర్పించేదెలాగ?" అని వెతుకుతూనే పోయారు. వాళ్ళకి ఆటలు నేర్పించారు, పాటలు నేర్పించారు, కథలు చెప్పారు, కొత్తపల్లినీ పరిచయం చేశారు, వాళ్ళ చేత కథలు రాయించారు- అలా పిల్లలకి చదువు పట్ల, భాషపట్ల ఇష్టం పెంచారు. "మా పిల్లల కథలు, మేం‌ రాసిన కథలు, పిల్లలు వేసిన బొమ్మలు అన్నీ ఎంపిక చేసి అన్నీ ఒక సంచికకు సరిపడా పంపిస్తాం- ఒక్కసారిగా అచ్చువేస్తారా?" అని అడిగారు.

కొత్తపల్లికి ఇది కొత్త. కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అయినా నూట యాభై సంవత్సరాల టెక్కలి బడి ఇంకా శైశవ గీతులు పాడుతూనే ఉందని సంతోషం వేసింది. ఆ బడిని అందరికీ పరిచయం చేయాలనిపించింది. అలా ఈ జూన్ మాసపు కొత్తపల్లి "టెక్కలి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రత్యేక సంచిక"గా మీ ముందుకొచ్చింది.

ఈ సంచికలో కథలన్నీ‌ టెక్కలి సొంతమే. బొమ్మలు కూడా టెక్కలి కళాకారులవే. జోకులు, కవితలు, పొడుపు కథలు కూడా టెక్కలివే. వీటికి స్థానం కల్పించటం కోసం ప్రతిసారీ‌ కొత్తపల్లిలో మామూలుగా ఉండే అంశాలు కొన్నిటిని తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితేనేమి, ఇవన్నీ మాకు నచ్చాయి; మీకూ నచ్చుతాయని మా నమ్మకం.

టెక్కలి బడికి నూటయాభై వసంత సుమమాలలు! అధ్యాపక వర్గానికి జోహార్లు! బాల రచయితలకు అభినందనలు! ఇంత అందమైన బొమ్మలు వేసి ఇచ్చిన చిత్రకారులు శ్రీ డబ్బీరు ధర్మారావు గారికి, వి.అప్పలనాయుడు గారికి, బాల చిత్రకారులు సోమేశ్వరరావు, శాతవాహన, చందూ చరణ్‌లకు మప్పితాలు! మరి మీరంతా చాలామంది ఈ నెలలోనే పై తరగతులకు వెళ్తారుగా, అందుకని మీకూ శుభాకాంక్షలు! -కొత్తపల్లి బృందం.