అది జనవరి ఒకటోతేదీ. దేశమంతా ఆనందోత్సహాలతో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకుంటోంది. పాశ్చాత్య సంప్రదాయాన్ని మనం ఎందుకు ఆచరించాలో తెలియని పిచ్చివాళ్ళ ఆనందం అంబరాన్నంటుతోంది. కానీ ఇవేమీ మోహన్‌కి పట్టడంలేదు- అతను పొందుతున్న సంతోషం అంతకంటే ఎక్కువే. తాము కొత్తగా కట్టిన గ్రంధాలయ భవనాన్ని అలంకరిస్తున్నాడు అతను.

"మోహన్! ఈ రోజే కదా, మన ఊళ్ళో గ్రంథాలయం ప్రారంభమయ్యేది?" అన్న మాటలకి మోహన్ అటు తిరిగి చూశాడు. ఎదురుగా గోవింద్, తన బాల్య స్నేహితుడు. వాడిలో ఏ మార్పూ లేదు- అదే ఎత్తు, అదే పలకరింపు!

"గోవింద్!" తన ఆలోచనల నుండి బయటపడి పలకరించాడు మోహన్. "బావున్నావా? ఏంచేస్తున్నావు? ఇన్నేళ్ళుగా కనబడనే లేదు! ఎట్లా ఉన్నావు, ఏమేం చేశావు?" అడిగాడు ఏకబిగిన.

గోవింద్ నవ్వాడు. "బాగున్నాను బాగున్నాను. సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ప్రభుత్వంలో అధికారినయ్యాను. మన ఊరి సంగతులు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇవాళ్ల గ్రంధాలయం మొదలు పెడుతున్నారని తెలిసి, మిమ్మల్నందరినీ చూసినట్లు ఉంటుందని వచ్చాను. మనలాంటి వారినెందరినో తీర్చి దిద్దిన వేణు మాష్టారి పేరుతో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయటం నాకు చాలా నచ్చింది. నావరకూ నేను ఆయన్ని తలచుకోని రోజే లేదు. నా వంతుగా, ఇదిగో- ఈ జీపునిండా పుస్తకాలు, వాటిని అమర్చిపెట్టేందుకు రెండు అలమారలు తీసుకొచ్చాను, మన గ్రంధాలయం కోసం" అంటూ గోవింద్ కూడా గ్రంథాలయ భవనపు అలంకరణలోకి దిగాడు.

'చక్కని బోధన, ఆచరణ, ఆలోచనారీతి, ప్రేమ, స్నేహం, ఓదార్పు, ప్రోత్సాహం'- అనే అమృతధారల్ని శిష్యకోటి పై కురిపించిన గొప్ప మనిషి వేణు మాస్టారు. తను నేర్పిన సంగతులను తన శిష్య బృందం కూడా పదిమందికీ పంచేట్లు మలచిన గొప్ప శిల్పి ఆయన. అక్షర జ్ఞానాన్ని మాత్రమే నేర్పే సగటు ఉపాధ్యాయుడు కాదు- సామాజిక చింతనను కూడా అందించి, సొంత లాభాన్ని ప్రక్కన పెట్టి తోటి వారికి తోడ్పడేట్లుగా దేశభక్తి వైపు నడిపించిన నిజమైన గురువు ఆయన.

వేణు మాస్టారు చాలా పుస్తకాలను చదివేవారు. అంతేకాదు, 'పుస్తకాలు చదవటం మంచిది' అని నమ్మేవారు. పిల్లలందరికీ పుస్తకాలు చదవటంలోని మాధుర్యాన్ని రుచి చూపించాలని శ్రమించేవారు. తన గ్రామానికి ఒక శాశ్వత గ్రంథాలయం కావాలని తపించి పోయేవారు ఆయన. కానీ కాలం కలిసిరాలేదు- పచ్చకామెర్ల వ్యాధికి గురయ్యారు వేణు మాష్టారు- అది చివరికి మాస్టారు గార్ని పొట్టన పెట్టుకుంది. ఇన్నాళ్లకు ఆయన కన్న కల నిజం కావస్తున్నది- గ్రామంలో శాశ్వత గ్రంధాలయం ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆయన శిష్యులు ..

"మన మాష్టారి కలల్ని విద్యార్థిగా నువ్వు నిజం చేశావన్నమాట" పనులు చేస్తూనే మాట కలిపాడు గోవింద్.

మోహన్, గోవింద్‌లు చిన్నతనంలో పుస్తకాల కోసం బాగా గొడవచేసుకునేవారు. అదే వారి స్నేహానికి దారితీసింది; ఇద్దర్నీ పుస్తక ప్రేమికుల్ని చేసింది; పుస్తకాలు చదివే అలవాటుని మరింత మందికి కలిగించే దిశగా కదిలించింది.

"ఏం లేదురా, మన తోటి విద్యార్థులందరి ఇష్టం, గ్రామస్తుల సహకారం కారణంగా ఈ గ్రంధాలయం ఏర్పడుతున్నది" అందరి సేవనూ గుర్తిస్తూ అన్నాడు మోహన్.

"ఏది ఏమైనా ఒకనాటి సంచార గ్రంథాలయం నేడు శాశ్వత గ్రంథాలయంగా మారింది. నీ కృషిని అభినందించకుండా ఉండలేక-పోతున్నాను" అంటూ మోహన్ భుజంపై చేయివేసి అభినందన పూర్వకంగా చూశాడు గోవింద్.

అంతలో వచ్చారు రాజు, రాము-"ఔను, మోహన్ తాను అనుకున్నది సాధిస్తాడు" అంటూ.

రాజు, రాము కూడా వేణు మాస్టారి శిష్యులే. రాజు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. రాము ప్రభుత్వ ఉద్యోగి.

వీళ్లంతా నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఒకటే పుస్తకాలు చదివేవాళ్ళు. వీళ్లతో పాటు ప్రక్కల గ్రామాల ప్రజలందరిచేతా విరివిగా పుస్తకాలు చదివాలని, వేణు మాస్టారు ఆ రోజుల్లో ఒక ప్రణాళికను రచించారు. అదే 'సంచార గ్రంధాలయం'.

మోహన్‌కి ఒక పాత అట్లాస్ సైకిల్ ఉండేది. సమయం చిక్కినప్పుడల్లా మిత్రులు నలుగురూ ఆ సైకిల్‌మీద పత్రికలు, పుస్తకాలను పెట్టుకొని తిరిగేవాళ్ళు. సాయంకాలం వేళల్లో రోజుకో గ్రామం చొప్పున తిరిగేవాళ్ళు. పాఠకుల నుండి నామ మాత్రపు అద్దె డబ్బుల్ని వసూలు చేసేవాళ్ళు. వాటితో మరిన్ని కొత్త పుస్తకాల్ని కొనేందుకు వీలయ్యేది. మోహన్‌కి ఉద్యోగం వచ్చాక ఆ పనికొంచెం కుంటుపడింది. వేణు మాస్టారు వెంటనే ఆ బాధ్యతల్ని వేరే పిల్లలకు ఇచ్చారు.

"భలే ఉండేవిరా, ఆ రోజులు! సైకిల్‌ మీద ఊరూరూ ఎట్లా తిరిగామోగానీ, ఇప్పుడు ఆ సంగతి తలచుకుంటే భలే అనిపిస్తుంది" అన్నాడు గోవింద్.

"అవునురా, దానివల్ల మనకు ఖర్చు లేకుండా పుస్తకాలు దొరికాయిగా, చదువుకు-నేందుకు? ఎంత లాభం జరిగిందో ఊహించలేం! పిల్లలందరికీ పుస్తకాలు దొరికేట్లు చేయటం గొప్ప పనిరా! నిజంగా 'పుణ్యం-పురుషార్థం అంటే ఇదే' అనిపిస్తుంది!" అన్నాడు రాజు.

"మనం నడిపిన సంచార గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవటం వల్లే వాసుదేవరావుకు 'మండల అభివృద్ధి అధికారి' ఉద్యోగం వచ్చిందట ! వాడికి కూడా మనకున్న పుస్తకాల పిచ్చి అంటిందని చాలా సంతోషంగా ఉంది నాకు" నవ్వుతూ చెప్పాడు గోవింద్.

"ఔను, ఈ రోజు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించటానికి వస్తున్నది కూడా తనే" పుస్తకాలను వరుస క్రమంలో సర్దుతూ చెప్పాడు రాము.

"అదిగో మాటల్లోనే వచ్చాడు వాసు" అందరి దృష్టినీ మరల్చుతూ చెప్పాడు మోహన్. అందరూ అటుగా చూశారు. కారు దిగి అందరినీ పలకరిస్తూ వచ్చి, గోవింద్‌ని చూడగానే చకితుడయ్యాడు వాసు- "కలెక్టరుగారు! ఈ సమయంలో మీరు ఇక్కడికి రావటం మా ఊరు చేసుకున్న భాగ్యం!" అన్నాడు.

గోవింద్ నవ్వాడు. "ఊరుకోరా, నేను ఇక్కడికి కలెక్టరుగా రాలేదు. ఒకప్పుడు సైకిలు మీద ఊరూరా తిరిగి, అందరితో బాటు నీకు కూడా పుస్తకాలు అద్దెకిచ్చిన గోవిందుగా వచ్చాను!" అన్నాడు.

తమ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టరు గోవిందేనని అప్పటివరకూ తెలియని మిత్రులంతా ఆశ్చర్యంతో వెర్రి మొఖాలు వేశారు.

ఆనాడు గ్రంధాలయ ప్రారంభోత్సవానికి ఊరు ఊరంతా తరలి వచ్చింది. " 'రైతులకు చదువెందుకు, కూలి పనికి పుస్తకాలెందుకు?' అనుకోకండి.

కత్తి చెయ్యలేని పనిని కలం చేస్తుందని మరువకండి. మేమందరం, పుస్తకాలు చదివి బాగుపడ్డాం. పుస్తకాలవల్ల మాకు కేవలం చదువే కాదు; ఉద్యోగాలే కాదు- ప్రపంచం దొరికింది. అందరికీ అలాంటి అవకాశం ఉండాలని, ఇదిగో- ఈ లైబ్రరీ మొదలవుతున్నది. దీన్ని బాగా ఉపయోగించుకోండి.

తరతరాలకీ మంచిపుస్తకాలను అందించండి" అని వక్తలంతా ఉద్బోధించారు.

మామూలు రైతు కుటుంబాల్లో పుట్టి, చదువుపట్ల శ్రద్ధవహించి, సంచార గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ప్రయోజకులైన ఆ పిల్లల్ని చూసిన గ్రామస్తులకు గ్రంథాలయం పట్ల, దాని ఉపయోగం పట్ల ఆసక్తి ఇనుమడించింది. గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. కొందరు పుస్తకాలను, మరికొందరు విరాళాలను అందజేశారు.

అందరి సహకారంతో ఆ ఊరి గ్రంధాలయం గొప్పగా నడిచింది. ఎందరెందరు ఆ లైబ్రరీలో చదువుకొని గొప్పవాళ్లయ్యారో లెక్కలేదు. వేణు మాస్టారి కల- ఆలస్యంగానైతేనేమి, ఫలించింది! సంచార గ్రంధాలయం‌ కాస్తా నడిచే గ్రంధాలయం అయ్యింది!