నేను 6వతరగతిలో ఉన్నప్పుడు, మా ఇంట్లో చాలా సమస్యలుండేవి. మా నాన్న గారికి నెలకి వెయ్యి రూపాయల జీతం వచ్చేది. మా అమ్మ కూలికి వెళ్ళి కష్టపడి రోజుకి నలభై, యాభై రూపాయల వరకు తెచ్చేది. కానీ వాళ్ళ సంపాదన మా అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. నేను మా అమ్మతో అనేవాడిని- "అమ్మా! మనం ఇంత కష్టాలలో ఉన్నాం కదా- నువ్వు కూడా అంతగా పని చేయలేకపోతున్నావు; నాన్న జీతం చూస్తే- ఎంత పని చేసినా వచ్చేది ఆ వెయ్యి రూపాయలు మాత్రమే. అందుకని నేను చదువు మానేస్తానులేమ్మా! ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తానమ్మా!" అని.

మా అమ్మ ఒప్పుకునేది కాదు- "నీకు పనిచేసే వయసు ఇంకా వుందిలేరా! ఇప్పుడు చదువుకో" అనేది.

అట్లా రోజులు గడిచాయి. ఒకసారి అక్టోబరు నెలలో ఎందుకనో నేను ఉదయం నాలుగు గంటలప్పుడు లేచాను. ఇంటి వాకిలి నుండి బయటకు వచ్చేసరికి ఒక అబ్బాయి పేపరు వేస్తూ కనబడ్డాడు. నేను అతన్నే గమనిస్తూ నిల్చున్నాను చాలా సేపు. అతను ఇల్లిల్లూ తిరిగి పేపర్ వేస్తుంటే నా మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. కొంతసేపటికి నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి "అన్నయ్యా, నేనూ పేపరు వేస్తాను. నన్ను కూడా పేపర్‌లో చేరిపించవా" అని అడిగాను. "సరే, రా తమ్ముడూ! రేపు ఉదయం నాలుగు గంటలకు రా. నిన్ను నేను పేపరులో చేర్పిస్తాను" అన్నాడు అతను. అయితే మరునాడు ఉదయం నేను అతన్ని కలిస్తే "ఇప్పుడేమీ పని లేదు- నువ్వు నన్ను నవంబర్‌లో కలువురా తమ్ముడూ" అన్నాడు.

నేను వెళ్ళి మా అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్పాను. మా నాన్న ఏమీ అనలేదు- కానీ మా అమ్మ మటుకు "ఒద్దులేరా, వేకువ జామున లేవాలి, చలిలో తిరగాలి- కాబట్టి నువ్వు వెళ్ళొద్దులేరా" అన్నది. అయితే నేను మా అమ్మను ఎలాగో ఒప్పించాను. నవంబర్‌లో పేపర్‌లో చేరాను.

ఇక నేను పేపర్ వేసిన కథ మొదలు.

చలికాలం: నేను ముందే చెప్పాను కదా, అది నవంబరు నెల అని?! మీ కందరికీ తెలిసే ఉంటుంది- నవంబరంటే చలికాలం. నేను ముందు పేపర్‌లో చేరినప్పుడు నాకు ఎంతో సరదాగా వుండేది. కాని కొన్ని రోజులు గడిచాక, డిసెంబర్ వచ్చేటప్పటికి నాకు కష్టమంటే ఏమిటో తెలిసింది. ఎలాగంటే- ఆ చలిలో- తెల్లవారు జామున నాలుగు గంటలప్పుడు వెళ్తుంటే నా ఒంటికి ఎంత చలి తగిలేదో చెప్పలేను. ఒక్కొక్కసారి పేపర్లను సైకిల్ వెనక కట్టేటప్పుడు అవి జారి పడిపోయేవి- చలి రోజులు కదా, చేతులు-వేళ్ళు సహకరించేవి కావు. ఆ పేపర్‌లను ఎత్తి తీసి ఇంకొంత దూరం వెళ్ళేటప్పటికి సైకిల్‌చైన్ జారిపోయేది. మళ్ళీ చైన్ వేసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయేది. అట్లా తంటాలు పడి ఎలాగో ఒకలాగా నేను పేపరును తీసుకు వెళ్ళేసరికి బాగా ఆలస్యం అయిపోయేది. కొంతమంది నా ముఖం చూసి జాలిపడి నన్ను ఏమీ అనేవాళ్ళు కాదు. కానీ కొంతమంది ఎంతచెప్పినా వినకుండా నన్ను నానా రకాలుగా తిట్టేవాళ్ళు. కానీ వాటన్నిటిని భరించుకొని పేపరు వేస్తూనే ఉండేవాడిని.

ఒక్కొక్కసారి పేపరు జీపు ఆలస్యంగా వచ్చేది. అందులో నా ప్రమేయం ఏముంటుంది? ఇక నేను హడావిడిగా ఆ పేపర్‌లన్నీ సర్ది తీసుకొని వెళ్ళేటప్పటికి కొంతమంది నా మీదికే వచ్చేవాళ్ళు- కొట్టేందుకు! అందులోనూ పల్లెటూరు వాళ్ళు ప్రొద్దునే తొందరగా లేస్తారు కదా; పల్లెటూరు వాళ్ళకి పేపర్ ఆలస్యంగా తీసుకు వెళ్ళామంటే వాళ్ళు పట్టణాల వాళ్ళ కంటే ఘోరంగా తిడతారు.

ఎండాకాలం: చలికాలం తరువాత ఎండాకాలం వస్తుంది గదా. చలికాలం చలి సమస్య అయితే, ఇప్పుడు వేరే సమస్య.. ఎండాకాలం తొందరగా తెల్లవారి పోయే సమస్య. 5గంటలకే తెల్లవారిపోయేది; అందరూ వేగంగా నిద్ర లేచిపోతారు. కానీ పేపరు జీపు ఎప్పటిలాగానే ఒకే టైం కు వస్తుంది కదా, నేను పేపరు వేసే సమయానికి ఇంట్లో అందరూ లేచేసి ఉండేవాళ్ళు. పేపరును నేను ఆలస్యంగా తీసుకొస్తున్నానని నన్ను తిట్టేవాళ్ళు. అయినా నేను భరించుకొని పేపరును వేయడం కొనసాగించే వాడిని.

వర్షాకాలం: ఎండాకాలం తరువాత వర్షాకాలం వస్తే చాలా సమస్య ఉండేది. రాత్రి కాని, పగలు కాని ఆగకుండా పడతాయి కదా, వర్షాలు 'ఉదయం, సాయంత్రం, తెల్లవారుజాము' అని చూసుకునేవి కావు. వర్షం వస్తే ఇల్లంతా కురిసేది. ఆ వర్షాలకు మా అమ్మ నాన్న "ఈ వర్షాకాలంలో అయినా ఆ పేపరును మానేయిరా" అనేవాళ్ళు. అయినా సరే, నేను మటుకు ఆగకుండా పేపరు వేయటం కొనసాగించాను. ఉదయం లేచేసరికి వర్షం పడుతున్నా, నేను మటుకు పేపరు వేయడానికి వెళ్ళిపోయేవాడిని. ఆ పేపర్లు తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కోసారి అవి వెనక ఉన్న కేరేజ్ నుంచి జారిపోయేవి- కొన్ని కొంచెం తడిసేవి; కొన్ని బాగానే నానిపోయేవి.

అలాగే వానాకాలపు బురదలో ముళ్ళు కనబడకుండా ఉండేవి. అప్పుడు నా సైకిల్ టైరుకు ముళ్ళు గుచ్చుకొని ఒకటే పంచర్ అయిపోయేవి. అయినా 'సరే, ఏంచేస్తాం' అని నడిచి వెళ్ళి పేపరు వేసి వచ్చేవాడిని. ఎప్పుడయ్యా పేపర్లు తడిసి పోయాయంటే మా పేపర్ ఏజెంట్ దానికి డబ్బులు కట్టమనేవాడు. లేకపోతే నా జీతంలో డబ్బులు తీసేసేవాడు- దీని వల్ల నా చదువు పోయేది.

ఒకసారైతే ఎప్పటిలాగే నేను వెళ్ళి పేపరు వేస్తున్నప్పుడు అనుకోకుండా కుక్క కరిచింది. చాలా ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వచ్చింది. కుక్క కరిచిన తరువాత మా ఇంట్లోవాళ్లు పేపరు వేయటం మానేయమన్నారు. అయితే అప్పటికి నాకు ఇంకో కుర్రాడు దొరకలేదు- 'ఏం చేస్తాం' అని అదే విధంగా పేపరు వేయటం కొనసాగించాను.

అలా రోజూ తొందరగా నిద్ర లేచిపోవటం వల్ల నాకు నీరసంగా ఉండేది. బడిలో క్లాసు జరుగుతున్నప్పుడు కూడా నీరసంతో పడుకొనేసేవాడిని. దాన్ని చూసి మా ఉపాధ్యాయులందరూ నన్ను తిట్టేవాళ్ళు. అప్పట్లో మాతరగతి మొత్తంలోకీ చదువులో మొదటిస్ధానం నాదే. కానీ రోజురోజుకీ నా చదువు తగ్గిపోవచ్చింది. చివరికి ఒకరోజు బడిలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత, మధ్యాహ్నం మొదటి పీరియడ్‌లో- నాకు కడుపులో నొప్పి మొదలైంది. మా అమ్మా,నాన్న వచ్చి నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. తెల్లవారే లేవటం, నిద్ర తక్కువవ్వటం వల్ల రక్తహీనత- దాంతో నీరసం- అట్లా మెల్లగా కడుపులో నొప్పి వస్తాయని డాక్టర్ చెప్పారు. అప్పటినుండి నేను పేపర్ కి వెళ్ళడం మానేశాను.

ఇవీ, పేపర్ బోయ్ గా నా అనుభవాలు.