అనగనగా ఒక ఊరిలో ఒక ఎలుక ఉండేది. దాని పేరు చిట్టి.

చిట్టి ఒక రోజున ఒక పాములవాడి ఇంటికి వెళ్ళింది. పాము ఎలుకను పట్టుకోబోయింది. "నాకు ఇక్కడ నచ్చలేదు" అని చిట్టి బయలుదేరి, పిల్లి వాళ్ల ఇంటికి వెళ్ళింది.

అక్కడ పిల్లి గభాలున దూకి ఎలుకను మింగబోయింది. "నాకు ఇక్కడ నచ్చలేదు" అని బయటికొచ్చి ఏనుగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిట్టి.

అక్కడికి వెళ్ళేసరికి, ఏనుగులన్నీ ఎలుక మీదికి వచ్చాయి. "నాకు ఇక్కడా నచ్చలేదు- రాజు గారి ఇంటికి వెళ్తే ఎంతో బాగుంటుంది" అనుకున్నది చిట్టి. ఇక దానికి అడ్డు ఏమున్నది?

-అట్లా అది రాజుగారి ఇంటికి వెళ్ళింది. నేరుగా రాజు గారి గదిలోనికే చేరుకున్నది. తన పళ్లతో రాజుగారి మంచపు నవారును కరకరా కొరికేసింది. తెల్లవారాక చూస్తే మంచం మీద పడుకొని ఉండాల్సిన రాజుగారు గచ్చు మీద ఉన్నారు!

రాజుగారు ఆశ్చర్యపోయారు. "నేను మంచం మీద కదా, పడుకున్నది? మరి గచ్చు మీద ఎందుకు వున్నానబ్బా?" అని ఆలోచించారు. ఆ విషయం మీద మంత్రులందరితోటీ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ ఆలోచించారు; కానీ నిజంగా ఏం జరిగిందో మటుకు తెలుసుకోలేక పోయారు.

ఆ రోజునే రాజుగారు, ఆయన పరివారం అందరూ సినిమాకు వెళ్ళారు. వాళ్ళంతా వచ్చేలోగా రాజుగారి గది నుంచి భవనం అంతా సొరంగ మార్గం తయారు చేసింది చిట్టి. తిరిగి రాగానే రాజు గారు ఈ సొరంగం చూసారు. మళ్ళీ ఓసారి అందరితో సమావేశం అయ్యారు. అందరూ ఆలోచించారు.

'ఇది ఎలుకల పనే' అని తేల్చారు.

దాంతో రాజుగారు ఎలుకలన్నిటినీ చంపెయ్యమన్నారు. అంతే! భటులు రాజభవనం అంతా వెతికి, చేతికి చిక్కిన ఎలుకలన్నిటినీ చంపేసారు.

-కానీ చిట్టిని మాత్రం ఏమీ చెయ్యలేక పోయారు.

ఆరోజు రాత్రి రాజుగారు నిద్రపోతుండగా చిట్టి రాజుగారి కిరీటం మీదికకి ఎక్కి, గెంతుతూ పాడింది: నేనే నేనే ఎలుకను- బుడి బుడి అడుగులు వేస్తాను, చిట పటా-చిట పటా తిరుగుతాను, నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు- నల్ల పిల్లి అయినా పట్టుకోలేదు! నేను గోతులు తీస్తాను, నేను నల్లగా ఉంటాను, నేనే నేనే ఎలుకను.

ఆ పాట పాడి హాయిగా నిద్రపోయింది అది.

కళ్ళు తెరిచి చూసేసరికి, ఎలా వచ్చిందో మరి- అది ఒక చిన్న బోనులో ఉంది! చూస్తూండగానే రాజుగారి మనుషులు దాన్ని అడవికి తీసుకెళ్ళి, ఒక కొలనులో పడేసారు.

చిట్టికి ఒక క్షణంపాటు ఊపిరాడనట్లు అయ్యింది. ప్రాణం పోతుందనిపించింది- అయితే అంతలోనే అక్కడికి వచ్చిన సింహం ఒకటి నీళ్ళలోకి దూకింది; చిట్టిని పంజాతో‌ పట్టుకున్నది; బయటికి తెచ్చి నేలమీద పడేసింది. "చిన్న ఎలుకను తినేదెందుకులే" అనుకున్నది. అట్లా సింహం, చిట్టి మిత్రులయ్యారు.

అటు పైన వాళ్ళిద్దరూ ఎన్నెన్నో ప్రదేశాల్లో కలిసి తిరిగారు. సింహమేమో రాత్రిపూట జింక చర్మం పైన నిద్రపోయేది. ఎలుకేమో నేలలో ఒక గొయ్యి తీసి నిద్రపోయేది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా కవితలు చెప్పుకున్నారు:

సింహం‌ చెప్పిన కవిత- అడవిలో అన్న ఇంటిలో వెన్న జోబులో పేనా! అప్పుడు ఎలుక చెప్పిన కవిత: మొగ్గ చూసేది పువ్వుకోసం పువ్వు చూసేది పరిమళం కోసం.

పేపరు చదివేటప్పుడు కూడా అవి కవితలు చెప్పుకునేవి: చదవాలి చదవాలి చదవాలి చదివి నీవు పై మెట్టు ఎదగాలి చదువుతూ ఆనందంగా ఉండాలి. చదివి వెలుగు మా అయ్య తెలుగు బిడ్డ!

అట్లా పాటలు, పద్యాలు, కవితలు వాళ్ళిద్దరినీ బాగా కలిపాయి. ఇద్దరూ ఎంత మంచి స్నేహితులయ్యారంటే, ఇక ఎన్నడూ విడిపోలేదు!