"గ్రేట్ సర్కస్ కంపెనీ"లో చాలా ఏనుగులు పనిచేస్తుండేవి. అందులో ఒక దాని పేరు కర్ణిక.
కర్ణిక చేసే విన్యాసాల్ని చూడటానికి చాలా మంది ఎగబడేవాళ్ళు. అయితే కొన్నాళ్ళకు దానికి ఏదో జబ్బు చేసింది. దాని వల్ల అక్కడ వున్న ఏనుగులకు కూడా జబ్బు సోకుతుందని సర్కస్ వాళ్ళకు అనుమానం వచ్చింది. దాంతో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు.
అయితే అడవిలోస్వేచ్ఛగా తిరుగుతూ, దానికి ఇష్టమైన ఆహారం తినటం వల్ల, కొన్నాళ్ళకు దాని జబ్బు నయం అయిపోయింది. అటుపైన కర్ణిక అడవంతా తానే అయి ఉల్లాసంగా బ్రతకటం మొదలు పెట్టింది. అయితే సర్కస్ కంపెనీలో అన్ని జంతువుల మధ్య స్నేహంగా మెసిలింది కదా, 'ఇప్పుడు తనకు ఒక్క మిత్రుడూ లేడే' అని దానికి ఏదో వెలితిగా ఉండేది.
అయితే ఒకసారి ఒక వేటగాడు అడవిలో ఒక గొయ్యి తీసి, దాని పైన కర్రలు, వాటి మీద ఆకులు వేసి వెళ్ళిపోయాడు. 'ఏనుగులో, పులులో- ఏవో ఒకటి ఆ గుంటలో పడక పోతాయా, వాటిని తను పట్నంలో అమ్ముకొని డబ్బు చేసుకోవచ్చుకదా' అని వాడి ఉపాయం. అయితే వాడు చేసిన పనిని గమనించింది ఒక జింక. వాడి ఉపాయం కూడా దానికి అర్థం అయ్యింది. అయితే కర్ణికకు తెలీదుగా, అటువైపు గొయ్యి ఉందని? అందుకని ఆరోజు సాయంత్రం అది అటువైపు వెళ్ళబోయింది. దాన్ని అడ్డుకున్నది జింక- "ఓయ్! నువ్వెవరో మరీ అమాయకపు ఏనుగులాగా ఉన్నావు. అక్కడ, ఆకుల మాటున ఓ పెద్ద గొయ్యి ఉంది. నువ్వు అటువైపు వెళ్ళావంటే అందులో పడిపోతావు- జాగ్రత్త!" అని చెప్పింది.
కర్ణికకు చాలా సంతోషం వేసింది. "నువ్వు నన్ను కాపాడావు జింకా! ఇంతకు ముందు కూడా ఒకసారి- నేను చిన్నగా ఉన్నప్పుడు- చూసుకోక ఒక గుంటలో పడిపోయాను. అట్లా సర్కస్ కంపెనీలో ఇరుక్కొని అన్ని సంవత్సరాలు ఊడిగం చేయాల్సి వచ్చింది. నన్ను కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నీపేరేమిటి?" అన్నది.
"నాపేరు గిసర" చెప్పింది జింక.
"నువ్వు నాతో స్నేహం చేస్తావా, నేను ఈ అడవికి కొత్త?" కర్ణిక అడిగింది.
"ఓఁ..ఎంచక్కా చేస్తా" అన్నది జింక. అలా కర్ణిక, గిసర చక్కని స్నేహితులయ్యారు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు; కలిసి మేతకు వెళ్ళేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచే సరికి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు ఐపోయారు.
అదే అడవిలో నివసిస్తూ ఉండేవి, ఒక నక్క-ఒక కుక్క. ఎలాగైనా సరే, గిసరను చంపి తినాలని వాటికి కోరికగా ఉండేది. అయితే ఇప్పుడు వాటికి అది సాధ్యం అయ్యేట్లు లేదు. ఎందుకంటే గిసర, కర్ణిక ఎప్పుడూ కలిసే తిరుగుతున్నాయి కదా, అందుకని.
అందుకని నక్క-కుక్క రెండూ కలిసి ఒక పధకం వేసాయి: ముందుగా జింక వెళ్ళే దారిలో ఒక గుంతను త్రవ్వి, దాని మీద కొమ్మలు ఆకులు కప్పాయి-
ఆ తర్వాత నక్క జింక దగ్గరికి వెళ్ళి అన్నది- "అటువైపుకు వెళ్లద్దు జింకా- నేను ఇప్పుడే చూశాను. ఒక వేటగాడు వచ్చాడు అడవికి. నిన్ను పట్టుకునేందుకే కావచ్చు- అక్కడో గుంత త్రవ్వి పెట్టాడు" అని ప్రేమ నటిస్తూ చెప్పింది. తన ప్రాణాలు కాపాడింది కదా, అందుకని గిసరకు నక్క అంటే అభిమానం ఏర్పడ్డది. "మరి నాతో స్నేహం చేస్తావా?" అని అడిగింది నక్క. "ఓఁ..దానిదేముంది. ఇవాల్టినుండీ మనం ముగ్గురు మిత్రులం" అన్నది అమాయకపు గిసర, దాన్ని పరిచయం చేసేందుకు కర్ణిక దగ్గరికి తీసుకెళ్తూ.
అయితే కర్ణికకు నక్కను చూడగానే అనుమానం వేసింది. ఆహారంకోసం నక్క ఎన్ని మాయలైనా చేస్తుందని తెలుసు, దానికి. అయినా అది తనకున్న అనుమానాలను గిసరతో పంచుకోలేదు. 'నక్కను గమనించి చూస్తాను' అని మాత్రం అనుకున్నది.
అయితే తన పధకంలో భాగంగా నక్క గిసరకు కర్ణిక గురించి రోజుకింత చెడ్డగా చెప్పటం మొదలు పెట్టింది. మొదట్లో గిసర దాని మాటలు నమ్మలేదు. కానీ నక్క ఎన్ని దొంగమాటలు చెప్పిందంటే, చివరికి గిసర దాని వలలో పడనే పడింది. అటుపైన అది కూడా కర్ణికను అనుమానించటం, అవమానించటం మొదలుపెట్టింది.
అయినా సరే, కర్ణిక అవేవీ పట్టించుకునేది కాదు. తన స్నేహితుడైన గిసరను నక్క నుండి కాపాడాలని అది ఎంతో ప్రయత్నించింది. అయినా జింక దాని మాటలేవీ వినలేదు. పెడచెవిన పెట్టింది.
కొన్నాళ్ళకు వాళ్ళకి దూరమైనట్లు నటించసాగింది కర్ణిక. అయినా ఎల్లప్పుడూ గిసరను తన కనసన్నలలోనే ఉండేట్లు చూసుకున్నది. నక్కకు ఆ సంగతి తెలీదు కదా, 'పీడ విరగడైంది' అని అది చాలా సంతోషించింది. "గిసరకు సమయం దగ్గరపడింది. రేపు దీన్ని గుంతలోకి నెట్టేద్దాం, గుంత తీసి సిద్ధంగా ఉంచు" అని కుక్కకు కబురు పంపింది.
అయితే నక్క కదలికలపైననే గట్టి నిఘా పెట్టిన కర్ణికకు, వాటి పథకం అంతా అర్థమైంది. గుంతను త్రవ్వేసి కుక్క అటు వెళ్ళిందో లేదో- కర్ణిక ఆ గొయ్యి దగ్గరికి చేరింది; నక్క ఊహించని విధంగా ఆ గొయ్యిని మరింత లోతుగాను, మరింత వెడల్పుగాను త్రవ్వి పెట్టింది !
మరునాడు నక్క గిసర దగ్గరికి వెళ్ళి- "మిత్రమా! అడవికి అటువైపుకు మనం ఎప్పుడూ వెళ్ళలేదు- ఆ ప్రక్కన మంచి గడ్డి ఉన్నదని కుక్క చెప్పింది నాకు. ఇవాళ్ల అటు పోదాం పద!" అని అటువైపుకు తీసుకుపోయింది.
ఇద్దరూ నడుస్తుండగా అకస్మాత్తుగా నక్క గిసరను ఆ గుంతలోకి తోసేసి, వికవికా నవ్వింది-"ఇప్పుడు దొరికావు,నువ్వు మాకు" అన్నది. అయితే అది కూడా గుంత మీదనే నిలబడి ఉన్నది కద! అలా అటు అది నవ్వటం, ఇటు దాని కాళ్లక్రింది నేల కదిలి అదికూడా 'దభాలు'న గుంతలో పడిపోవటం ఒకేసారి జరిగిపోయాయి!
దగ్గరలోనే నిలబడ్డ కర్ణిక గుంత దగ్గరకు వచ్చి, తన తొండాన్ని అందించి గిసరను బయటికి లాగింది. తన తప్పు తెలుసుకున్న గిసర సిగ్గుతో తల వంచుకున్నది.
మరుసటి రోజున వేటగాడెవరో వచ్చి, తను త్రవ్వని గుంతలో చిక్కుకున్న నక్కను పట్టుకొని చక్కా పోయాడు! ఇదంతా చూసిన కుక్క పరుగో పరుగు! అటుపైన గిసర-కర్ణికల స్నేహం పదికాలాలపాటు చల్లగా కొనసాగింది.