వర్థనుడు అనే రాజుకు ఒక్కతే కూతురు-చంద్రిక. చంద్రికకు పదేళ్ళు. చాలా అందంగా వుంటుంది. చాలా మంచి అమ్మాయి- అందరితోనూ చాలా స్నేహంగా, కలిసి మెలిసి ఉంటుంది. ఒక రోజు ఆమె, ఆమె స్నేహితులు అందరూ కలిసి అడవికి వెళ్ళారు. వాళ్లకు తోడుగా కొందరు భటులు కూడా వెళ్ళారు. అక్కడ అడవిలో అందమైన చెట్లు,పూలు, ఏర్లు, కొలనులు చాలా కనిపించాయి. పిల్లలందరూ చాలా ఉత్సాహపడ్డారు. బాగా తిరిగారు; వెళ్లి పువ్వులు కోసుకున్నారు.

ఇట్లా చాలా సమయం గడిచాక, "చంద్రికా! సాయంత్రం అవుతున్నది; మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. మనం మన ఇళ్ళకు చేరుకుందాం పద" అన్నారు స్నేహితులందరూ. భటులు కూడా తొందర పెట్టారు. అయినా చంద్రిక మాత్రం "వస్తాను, వస్తాను" అంటూనే అడవి లోలోపలికి అడుగులువేస్తోంది. అక్కడ ఆమెకు కొత్తగా కనిపించిన మంచి మంచి పూలు ఆమెను వెనక్కి లాగుతున్నాయి. అటు ఈదురు గాలులూ పెరుగుతున్నాయి. నేస్తాలకీ, భటులకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. చంద్రిక రాజుగారి కూతురాయె! ఆమెను కాదని ఏం చేయగలరు? అంతలో ఒక పొదలచాటు నుండి "గుర్ర్.." మని పులి గాండ్రింపు వినబడింది. భటులు బాణాలు ఎక్కుపెట్టేంతలో‌ పెద్దపులి ఒకటి వాళ్ళ మీదికి దూకనే దూకింది. భటులు, పిల్లలు అందరూ చెల్లా చెదరు అయ్యారు. పులి మటుకు వాసన చూసుకుంటూ చంద్రిక వెళ్ళిన దిశలోనే పరుగు తీసింది.

అట్లా తనవైపుకు వచ్చిన పులిని చూడగానే చంద్రికకు ఏం చేయాలో తెలీలేదు. తనుచిన్నప్పుడు చదివిన కథలలో పెద్దపులుల నుండి తప్పించుకున్న రాజకుమార్తెల కథనొకదాన్ని గుర్తు చేసుకొని, చంద్రిక గబగబా ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి కూర్చున్నది. అంతలోనే పెద్ద వాన మొదలైంది. పులికూడా చంద్రిక వెనకనే చెట్టు ఎక్కుదామని ప్రయత్నించింది గానీ, అది వీలవ్వలేదు... దానిది భారీ కాయమాయె!

దాంతో పులి "పోనీలే! ఇన్నాళ్లకి మంచి ఆహారం ఒకటి నా కంట పడింది. ఈ పిల్ల ఎక్కడికి పోతుంది? ఎప్పటికైనా క్రిందికి దిగక తప్పదు. అప్పుడు తింటానులే, నేను! దానిదేముంది?!" అనుకొని అక్కడే కాపుకాసింది.

ఇక అక్కడ భటులందరూ చాలా ఆందోళన పడ్డారు. చంద్రిక స్నేహితులందరినీ వారి వారి ఇళ్లకు చేర్చి వచ్చి, వానలోనే అడవంతా వెతకటం మొదలు పెట్టారు. అయినా ఏమైందో మరి, ఒక్కరు కూడా చంద్రిక ఉన్న చెట్టు వైపుకు రాలేదు!

ఇట్లా చంద్రిక, పులి ఇద్దరూ ఒకరాత్రి, ఒక పగలు ఒకరి కోసం ఒకరు కాపు కాశారు. చివరికి పులి నిరాశపడింది. ఆకలే గెలిచింది. "ఇదేదో దొరికేట్లు లేదు. నేను ఇక వేరే ఆహరం చూసుకుంటాను" అని అది వెళ్ళిపోయింది.

అయితే ఆసరికి చంద్రికకు బాగా నిద్ర పట్టింది. ఆ పాప చాలా నీరసపడ్డది కూడానూ. ఆరోజు రాత్రి అలా నిద్రపోతున్న చంద్రిక కాస్తా ఠపాలున క్రింద పడిపోయింది. అయితే ఆ పాపకు ఆ సంగతే తెలీనేలేదు! -పాపం, అక్కడ వున్న పెద్దరాయి ఒకటి చంద్రిక తలకి తగిలింది! ఆమె అలా అక్కడే స్పృహ తప్పిపోయి పడి ఉన్నది, రాత్రంతా.

తెల్లవారు ఝామున ఏమైందంటే, ఒక ముసలి అవ్వ కట్టెలు కొట్టటానికి అడవికి వచ్చింది. అక్కడ పడివున్న చంద్రికను చూసి దగ్గరకు వెళ్ళింది. "ఎవరో ఇంత చిన్న పిల్ల! పాపం, తలకి చాలా పెద్దగాయం తగిలింది. ఎవ్వరూ లేరనుకుంటాను తనకు!" అని చంద్రికను లేపి మెల్లగా తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పాపను పడుకోబెట్టి, తలకు కట్టుకట్టి, మొహానికి నీళ్ళు చల్లి, జాగ్రత్తగా చూసుకున్నది.

రెండు రోజుల తర్వాతగానీ చంద్రికకు తెలివి రాలేదు. వచ్చాక కూడా ఆమెకు తలంతా దిమ్ముగా అనిపించింది. తన పేరు చంద్రిక అని తెలుస్తూనే ఉంది-కానీ మిగతా సంగతులేవీ ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు ఆమెకు!

చంద్రిక లేచి తిరగటం మొదలు పెట్టాక అవ్వ అడిగింది- "పాపా! నువ్వు ఎవరు? ఎక్కడ ఉంటావు? నీ తల్లిదండ్రులు ఎవరు?" అని. చంద్రికకు గుర్తు వస్తే గద! అప్పుడు చంద్రిక ఎంతో‌ మర్యాదగా అన్నది- "బామ్మా! నేను ఎంత ఆలోచించినా నా గతం గుర్తురావటం లేదు. కానీ నాపేరు చంద్రిక అని మటుకు గుర్తున్నది" అని. "సరేలేమ్మా, నువ్వు ఎవరో తెలిసేదాకా నువ్వూ నాతోబాటే ఇక్కడ ఉండచ్చు; కానీ ఒక సమస్య ఉన్నది.." అన్నది అవ్వ. చంద్రికకు అవ్వ నచ్చింది. అదీగాక, తనకు ఏవో సంగతులు గుర్తుకు రావట్లేదని తెలుస్తూనే ఉన్నది- అవి గుర్తుకు రావాలంటే కొంత సమయం‌ వదలాలి.." ఏం సమస్యో చెప్పవ్వా!" అన్నది.

"నువ్వు కూడా కష్టపడి పని చెయ్యాల్సి ఉంటుంది. ఏమంటే, నేను చాలా ముసలి దాన్ని అయిపోయాను కదా- ఎక్కువ పని చేయగల శక్తి లేదు నాకు. నా రెక్కల కష్టం మీద నా ఒక్కదాని జీవితం గడవడమే చాలా కష్టం అవుతున్నది. ఇంక నీకు తిండి ఎక్కడినుండి తెస్తాను? అందుకని, నేను రోజూ ఎలాగో‌ ఒకలాగా కట్టెలు ఏరుకొస్తాను. నువ్వు ఊళ్లో కెళ్ళి రోజూ ఇన్ని కట్టెపుల్లలు అమ్ముకొని రావాలి. వాటితో ఇంత బియ్యం కొనుక్కొచ్చావంటే, ఆ పూటకి మనం వాటిని వండుకొని తినచ్చు- ఏమంటావు చంద్రికా?" అంది బామ్మ.

"బామ్మా! నేను ఎవరినో తెలియకపోయినా నాకు ఇక్కడ చోటు ఇచ్చావు. ఈ మాత్రం పని చేయటం నాకు కష్టమేమీ కాదు. అలాగే చేద్దాం. నువ్వు పుల్లలు ఏరుకురా, నేను వాటిని అమ్ముకొస్తాను. నువ్వు చెప్పినట్లే చేద్దాంలే " అన్నది చంద్రిక.

రాజుగారి గారాల బిడ్డగా ఏ కష్టమూ ఎరగకుండా పెరిగిన చంద్రిక ఇలా ఆరు నెలలు గడిపింది.

అక్కడ రాజుగారు చంద్రికకోసం వెతికించని కొండలేదు; కోనలేదు. అందరూ అన్నారు-"యువరాణి పులి బారిన పడ్డది" అని. రాజు, రాణి మటుకు అట్లా జరగలేదని నమ్మారు. కానీ‌ ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. యువరాణి చంద్రిక ఎవరికీ కనబడనే లేదు.

ఒకరోజు చంద్రిక కట్టెలమ్ముకుంటూ రాజవీధిలోకి పోయింది. చిత్రంగా అక్కడ ఉన్నవన్నీ తనకు చాలా పరిచయం ఉన్న వాటిలాగా అనిపించ సాగాయి ఆమెకు. అందుకని ఆమె తను తెచ్చిన కట్టెపుల్లలను ఒక ప్రక్కన పెట్టి, అటూ ఇటూ వింతగా చూస్తూ పోసాగింది. అంతలోనే రాణిగారి పరిచారికలూ చంద్రికను చూసి ఆశ్చర్యపోయారు: అప్పటికే పౌష్టికాహారలోపం వల్ల చంద్రిక చాలా సన్నగా అయిపోయింది. ఆమె చర్మం ఎండ కారణంగా నల్లగా కమిలిపోయి ఉన్నది. ఆమె మొహం కూడా చాలా మారిపోయింది. అయినా ఆమెను గుర్తుపట్టిన పరిచారికలు చంద్రికను రాజు దగ్గరికి తీసుకెళ్ళారు.

"అయ్యా! నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు?" అని రాజుని అడిగింది చంద్రిక.

ఆ పాప గొంతు వినగానే రాజుకు, రాణికి అర్థమైంది- "ఇది వేరెవరో కాదు- తమ బిడ్డే!" అని.

"నీ పేరేమిటి పాపా?" అని అడిగారు రాజుగారు.

"చంద్రిక!" అని జవాబు ఇచ్చింది పాప.

"నువ్వు ఎక్కడ ఉంటున్నావు, చంద్రికా? నీ వాళ్ళు ఎవరు?" అని అడిగి, రాజుగారు తక్షణం భటుల్ని పంపారు- అవ్వను పిలిపించుకున్నారు. అవ్వ ద్వారా ఆయనకు చంద్రికను గురించిన విషయాలన్నీ తెలిసాయి.

చివరకు ఆ పాప తన కూతురేనని స్పష్టమైంది. "నిన్నిలా మళ్ళీ చూస్తాం అనుకోలేదు!" అని కన్నీళ్ళు పెట్టుకున్నారు రాజుగారు. "రామ్మా! ఇంత కాలానికి మా మనస్సులు చల్లబడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. రా, మనం లోపలికి వెళ్దాం, పద!" అన్నారు రాణిగారు.

చంద్రిక కొద్ది సేపు నిశ్శబ్దంగా నిలబడి, అన్నది- "నాకు కూడా తల్లి దండ్రులు ఉన్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది నాన్నగారూ! కానీ నా తలకు గాయం తగిలినప్పటి నుండీ నేనెవ్వరో తెలీకపోయినా ప్రాణంతో‌ సమానంగా చూసుకున్నది అవ్వ. అట్లాంటి మా అవ్వని వదిలి నేను రాలేను- క్షమించండి" అన్నది.

సరిగ్గా అదే సమయానికి చంద్రికకు తన రాచరిక జీవితం మొత్తం గుర్తుకు వచ్చింది. అయితే దానితోపాటు బామ్మలాంటి సాధారణ ప్రజల కష్టాలు కూడా ఆ పాప కళ్ళ ముందు కదలాడాయి.

అంతలో రాజుగారు అన్నారు-"చంద్రికా! అడవిలో ఉన్న అవ్వను కూడా ఇక్కడకే తెద్దాం" అని.

చంద్రిక నవ్వింది. "నాన్నగారూ! వ్యక్తులుగా ఎంతమందికి సహాయం చేయగలం? ఒక అవ్వకు సాయం చేస్తే సరిపోతుందా? మన రాజ్యంలో మామూలు మనుషులు అనుభవిస్తున్న కష్టాలను కళ్ళారా చూసాక, మన వైభోగం ఎవరి భిక్షో అర్థమైంది నాకు. కష్టపడి , కడుపు కొట్టుకొని బతుకుతున్న వారి బతుకుల్ని బాగుచెయ్యలేని పాలన ఎందుకు?" అంది గట్టిగా.

రాజుగారికి ఆశ్చర్యంతో, ఆనందంతో నోటమాట రాలేదు. చంద్రికను అక్కున చేర్చుకొని "తల్లీ! నువ్వు సంపాదించిన ఈ అనుభవం సామాన్యమైనది కాదు. పరిపాలనలో ఉన్నవాళ్లకు మామూలు ప్రజల కడగండ్లు అనుభవంలోకి రావటం చాలా అవసరం తల్లీ! అప్పుడే 'ప్రజలరాజు'లు తయారయ్యేందుకు వీలు ఏర్పడుతుంది. నీ ఈ అనుభవాన్ని వృధా పోనివ్వను. రా తల్లీ, పరిపాలనలోని మెళకువలు నేర్చుకో, ప్రజల రాణివి అయ్యేవు త్వరలో!" అని దీవించాడు.

అనతికాలంలోనే చంద్రిక రాచవిద్యలు అన్నింటిలోనూ ఆరితేరింది. రాజుగారి తర్వాత తనే పాలకురాలైంది. ప్రజల జీవితాల్ని దగ్గరగా చూసిన చంద్రిక, ఇప్పుడు రాణియై రాజ్యంలో చక్కని పాలనని ప్రవేశపెట్టింది. అందరిచేతా 'ప్రజలతల్లి' అని అనిపించుకున్నది. రాజ్య సంక్షేమానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ప్రజలలోనే తన కుటుంబాన్ని చూసుకొంటూ జీవించింది!