రెండువేల సంవత్సరాల క్రిందటి మాట. అశోక చక్రవర్తికి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేది. దురాశ కొద్దీ ఆయన చిన్న రాజ్యమైన కళింగపై దండెత్తాడు.
అయితే ఆయన ఊహించనంత పెద్ద యుద్ధం జరిగింది. కళింగవీరులు ఎందరో రాజ్య రక్షణ కోసం ప్రాణాలు ధారపోసారు తప్ప ఓటమిని మాత్రం అంగీకరించలేదు. ఆ వీరయోధుల రక్తం ఏరులై ప్రవహించింది. యుద్ధభూమి మొత్తం కళేబరాలతో నిండిపోయింది. అవయవాలు తెగి పడి ఉన్నాయి- నెత్తురు మడుగులు...
ఇదంతా చూసిన అశోకుడు ఆలోచనలో పడ్డాడు. "తను చేసింది తప్పు" అన్న ఆలోచన అతనిలో మొదలై, మెల్లగా అతని హృదయాన్ని దహింపజేసే భయంకర జ్వాలగా మారింది. ఆనాటి యుద్ధంలో కళింగరాజ్యపు స్త్రీపురుషులు ప్రదర్శించిన స్థైర్యం అశోకుడిని విచలితుడ్నిని చేసింది. అతనిలో వేదన మొదలైంది. కళింగ రాజ్యాన్నే కాదు; తాను జయించిన ప్రతి రాజ్యాన్నీ స్వతంత్రంగా విడచి పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుద్ధ భగవానుడి బోధనల సారం ఏమిటో అతనికి కొద్ది కొద్దిగా అర్థమౌతున్నట్లు అనిపించింది.
గుండెనిండా వేదనతో యుద్ధ భూమిలో తిరగటం మొదలు పెట్టాడు-
అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని కనబడింది ఒక ముసలమ్మ. ఆమె జుట్టు రేగిపోయి ఉన్నది. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. భయంకరమైన గొడ్డలిని ఒకదాన్ని రాతి పైన రంగరిస్తూ పదునుపెడుతున్నదా క్రోధ మూర్తి. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు అశోక చక్రవర్తి-
"అవ్వా! ఏంచేస్తున్నావు? యీ వయస్సులో, యీ ఎండలో- ఇలాంటి ప్రదేశంలో కూర్చొని నువ్వు చేస్తున్న పనేమిటి? అడవికి పోయి కట్టెలు కొడతావా? ” అని.
అవ్వ కోపంతో ఊగిపోయింది. "కాదు నాయనా, కాదు! నా ప్రయత్నం కట్టెపుల్లల కోసం కాదు! నా కొడుకులందరినీ పొట్టన పెట్టుకొన్న రాక్షసుడు- ఆ అశోకుణ్ణి రేపటి యుద్ధంలో హతమార్చనున్నాను నేను. నాతో పాటు నాలాంటి వేలాది తల్లుల ఉసురు పోసుకున్న ఆ దుర్మార్గుడు ఊరికే చావడు! ఈ గొడ్డలికి ఎంత పదును పెడతానంటే, దీనితో ఒక్క వేటుకు వాడి తల తెగి పడాలి!" అని అరిచింది.
ఆవిడ క్రోధాన్ని చూసి అశోకుడి గుండెలోంచి శోకం తన్నుకొచ్చింది. ఇంతమంది తల్లులకు గర్భశోకం కల్గించిన తను నిజంగా శిక్షకు పాత్రుడే అనిపించింది. కొంచెం సేపు అతని నోట మాట రాలేదు. తరువాత అన్నాడు "అశోకుడు మగధ సామ్రాట్టూ, మహాయోధుడున్నూ. ముసలి దానివి, నువ్వు వాడిని ఏం చేస్తావు?” అని.
అవ్వ నవ్వింది- ఆ నవ్వులోని శోకం అశోకుడి హృదయాన్ని పిప్పి పిప్పి చేసింది- "కళింగ స్త్రీల శౌర్యం నీకు తెలీదల్లేఉంది నాయనా! మూడు కాళ్ల ముసలిదైనా పగవాడిని మూడు చెరువుల నీళ్లు త్రాగించగలదు. అశోకుడు గెలిచే కళింగలో నరపురుగు అన్నదే ఉండదు చూస్తుండు!" స్థిరంగా పలికింది అవ్వ.
అశోకుడి కన్నీరు కాల్వలైంది. "అవ్వా! నువ్వన్నట్టు ఆ దుర్మార్గుడు రాక్షసుడే! వాడికి ఏ శిక్ష విధించినా చాలదు. వాడి పాపానికి వేరే నిష్కృతి లేదు" అన్నాడు దగ్గుత్తికతో.
"రేపు రానివ్వు వాడిని! కనిపించగానే వాడిని ఎలా యీ గొడ్డలికి బలి చేస్తానో చూడు" ఆవేశంతో ఊగిపోయింది అవ్వ.
అశోకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అన్నాడు- "అవ్వా! ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు ఆ అశోకుడి ప్రాణాలు తీస్తే ఆ క్షణంలోనే నీ ఆగ్రహం చల్లారి పోతుంది; వాడికి ఇక మరే బాధా ఉండదు. అట్లా కాకూడదు. వాడు బ్రతికే ఉండాలి- బ్రతికి ఉన్నన్ని రోజులూ వాడు నేలమీద పొర్లాడుతూ చిత్రహింసను అనుభవించే మార్గం చూడు. అట్లా జరిగితే తప్ప వాడి ఈ పాపాగ్ని చల్లారదు" అన్నాడు అశోకుడు.
"అయితే వాడి కాళ్లు నరుకుతాను. అటు ప్రాణాలూ పోక, ఇటు కాళ్ళూ లేక వాడు చిత్రహింసలు అనుభవించాలి!" కసిగా అంది అవ్వ.
అశోకుడు తలవంచుకొని నిలబడ్డాడు- "అవ్వా! ఆ కసాయి అశోకుడు వీడే! ఇదిగో, ఇక్కడే- నీ కళ్ల ముందు ఉన్నాడు. తెగనరుకు, వాడి కాళ్ళు!" అన్నాడు నెమ్మదిగా.
అవ్వ తలెత్తి చూసింది. మాసిన వస్త్రాలతో, ఎర్రని తలపాగాతో కన్నీళ్లు కార్చుతూ దీనంగా నిలబడ్డ అశోకుడు కనిపించాడు.
చాలాసేపటివరకూ ఆ అవ్వ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అన్నది- “నువ్వు చేసినది మామూలు తప్పు కాదు. రాజ్య కాంక్షతో ఇంతమందిని బలి తీసుకున్నావు. నిజంగానే నీకు ఏ శిక్ష వేసినా చాలదు. అయితే నువ్వు ఈనాడు నిజంగా పశ్చాత్తాపంతో పరితపిస్తున్నావని అర్థమైంది నాకు. పశ్చాత్తప్తులను శిక్షించరాదు.
నువ్వు కూడా నా కుమారులవంటివాడివే- ఏమంటే, నా కుమారులు దేశంకోసం వీరమరణం చెందారు; నువ్వు వాళ్లందరి ఉసురూ పోసుకొని హంతకుడివైనావు. అయినా పశ్చాత్తాపం చెందిన నిన్ను నేను ఏమీ చెయ్యను. పో, ఇక్కడినుండి" అని కన్నీళ్ళపాలైంది.
"అవ్వా! నా కాళ్లు నరికి నా అహంకారాన్ని పటాపంచలు చెయ్యి. లేదంటే నా పాపానికి నిష్కృతి లేదు" అశోకుడు ఆమె పాదాలపై పడ్డాడు. దు:ఖంతో అతని గొంతు పూడిపోయింది.
"నాయనా! లే! పో! ధర్మాన్ని రక్షించు. అశాశ్వతమైన భోగ భాగ్యాలకోసం వెంపర్లాడకు. సంపద తృణప్రాయం. దానిమీద మోహాన్ని వదిలిపెట్టు. ప్రాణికోటికి శాంతినిచ్చే పనులు చేపట్టు. బాటలకు ఇరువైపులా చెట్లు నాటించు. వైద్యశాలలు నిర్మించు. ప్రజలకు కడుపునిండా కూడు పెట్టు. ఎందరు స్త్రీలు భర్తల కోసం, ఇంకెందరు బిడ్డలు తండ్రుల కోసం, ఎందరు తల్లులు బిడ్డల కోసం దు:ఖిస్తున్నారో తలచుకో. ప్రాణి హింస విడనాడు. ముందుకు సాగిపో" అంటూ దారి చూపింది అవ్వ.
అశోకుడికి కర్తవ్యం తెలిసి వచ్చింది .