అనగా అనగా ఒక ఊళ్ళో అట్ల పండా అనే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ల అమ్మ తప్ప 'నా' అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అట్లపండా భిక్షాటన చేసేవాడు; వాళ్ల అమ్మేమో కూలిపనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ల జీవనం గడుస్తూండేది.
ఒకరోజున అట్లపండాకి ఎక్కడా ఒక్క పిడికెడు బియ్యంకూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. "ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం?" అని బాధ పడుతూ, రోజూ వెళ్ళే దారిలో కాకుండా మరో క్రొత్త దారిలో నడవటం మొదలు పెట్టాడు.
అతను అట్లా అడవి దారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించిందతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలిసిపోయాడో కూడా గుర్తుకొచ్చింది. చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోకి ఒక్క దోసెడు నీళ్ళు తీసుకున్నాడు. పాట మొదలు పెట్టాడు- "ఇదిగో, బువ్వ తిన్నానూ.." అని ఆ నీళ్ళు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్ళు తీసుకొని, "పాయసం త్రాగానూ.." అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్ళు తీసుకుంటూ "బూరెలు ఇవిగో తింటున్నా..పప్పు నెయ్యీ తింటున్నా.."అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు.
ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూస్తే జాలి వేసింది. "అయ్యో పాపం" అనుకొని, ఆ తల్లి ఒక కుండను తీసుకొని, దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ అమర్చి, దాన్ని అట్ల పండా వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళలోంచి పైకి తేలి తేలి పండా దగ్గరికి చేరింది!
అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి అట్లపండా ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకొని ఒడ్డు చేరుకున్నాడు; మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు ప్రక్కనే ఉన్న అరటి చెట్టునుండి ఆకొకటి తెచ్చుకొని, కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ కడుపునిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి! "అమ్మకి పాపం, ఇవంటే ఎంత ఇష్టమో" అని, వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకొని ఇంటికి పరుగుతీసాడు.
కుండ చలవ వల్ల తల్లీ కొడుకు లిద్దరికీ ఆరోజు కడుపునిండా తిండి దొరికింది. రోజూ తెలవారకనే పనికి వెళ్ళే తల్లి, మరునాడు పనికి పోనేలేదు!
అట్లపండాని పిలిచి అన్నది-"ఒరే, మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను. నువ్వు వేరే ఎక్కడా అడుక్కోనవసరం లేదు. రోజూ కోనేరు దగ్గరికే వెళ్ళు నాయనా" అని. అట్ల పండాకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి, రోజూ కులాసాగా నడచుకుంటూ కోనేరు దగ్గరికే వెళ్ళి రావటం మొదలు పెట్టాడు.
కోనేరు చేరుకోగానే తను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రం లాగా చదివేసి పది దోసిళ్ల నీరు త్రాగేవాడు వాడు. గంగమ్మ తల్లి జాలిపడి, ఒక కుండనిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లీ కొడుకులకి పని చెయ్యవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తినీ తినీ అట్లపండాకు బొజ్జ పెరగటం కూడా మొదలైంది!
కొన్ని రోజులు ఇట్లా గడిసాక, గంగమ్మ తల్లికి అర్థమైంది- తన దయ కారణంగా తల్లీ కొడుకులిద్దరూ సోంబేరులవుతున్నారు! "ఇట్లా అయితే ఎలాగ, గుణపాఠం నేర్పాల్సిందే" అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండనిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది- ముష్టిఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు- ఇలాంటివన్నమాట. రోజూలాగానే ఆ కుండ తేలుకుంటూ అట్లపండా దగ్గరికి వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి, సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరచుకొని, కుండకున్న మూతను తీసాడు- వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. "ఓలెమ్మో, ఓరి నాయనో" అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు వాడు. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా..? వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచెయ్యటం మొదలు పెట్టింది- పరుగు పరుగున కుండ దగ్గరికి చేరుకొని, వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి!
అట్ల పండా నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఆలోచించాడు- "ఇట్లా ఎందుకు జరిగింది?" అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడు లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, "ఇకమీద నేను నీ దగ్గరికి రాను తల్లీ, బుద్ధి వచ్చింది. ఏదో ఒక పనిచేసుకొని బ్రతుకుతాను" అని, కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు.
ఆసరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్లమ్మ. అట్లపండా కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి, ఆమె దాని మూత తీసి "ఈరోజు ఏమున్నాయి?" అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీదకూడా దెబ్బల వర్షం మొదలు! ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు- ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రగా పరుగెత్తింది. ఆమె కేకలు విని అట్ల పండా లోపలికి పరుగెత్తుకు వచ్చి కుండమీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది!
"అబ్బా! అయ్యో! అమ్మా!" అనుకుంటూ ముసలమ్మ అక్కడే, చేరగిలపడింది, కుండకేసి భయం భయంగా చూస్తూ. "ఇకమీద మనం ఏదో ఒక పనిచేసుకొని మర్యాదగా బ్రతుకుదాం అమ్మా! ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండని ఎక్కడైనా ఎవ్వరికీ అందని చోట పెట్టిరా" అన్నాడు అట్లపండా ఆమెతో. ఆమె భయం భయంగానే ఆ కుండని పట్టుకెళ్ళి, పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి, చేతులు దులుపుకున్నది- "సరేలేరా, మన రాత అంతే!" అంటూ.
అయితే ఏమైందంటే, ఆరోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకుగాను గ్రామపెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలైంది.
ఆ నలుగురు దొంగలూ ఒక పెద్ద పెట్టెనిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని, అట్లపండా ఇంటి పెరడును చేరుకున్నారు.
"వీటిని వంతులు వేసుకుందాంరా" అన్నాడు వాళ్లలో ఒకడు. అందరూ సరేనని, అటూ ఇటూ చూస్తే, మొత్తం నిశ్శబ్దంగా ఉంది. "సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమౌతుంది?" అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి, బట్ట పరచుకొని కూర్చున్నారు. దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ల కంట పడనే పడింది:
"ఒరే, ఈ కుండ బాగుంది, అందులో ఏముందో చూద్దాం" అని వాళ్ళు దాని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలైపోయింది.
దొంగలు నలుగురూ "ఆలో లక్ష్మణా" అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు.
కొద్ది సేపటికి లేచి వచ్చిన అట్లపండా, వాళ్ల అమ్మ తమ దిబ్బమీద పెట్టిఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూసాక తల్లీ కొడుకులిద్దరికీ నోట మాటరాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెని ఇంట్లోకి మోసుకెళ్ళారు. అయితే, వాళ్ళిద్దరికీ ఆసరికే జ్ఞానోదయం అయి ఉన్నది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెని సొంతం చేసుకునే సాహసం చెయ్యలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామపెద్దకు అప్పగించారు.
"దొంగలు ఉమ్మడి ఆస్తినే ఎత్తుకెళ్ళారే, ఎలాగ?" అని తలపట్టుకొని కూర్చున్న గ్రామపెద్దకి అట్లపండా దేవుడల్లే కనిపించాడు.
ఆయన వాడిని పొగిడి, వాడి నిజాయితీని మెచ్చుకొని, వాడికి ఓ చిన్నపాటి సన్మానం చెయ్యటమే కాక, గ్రామ పంచాయితీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు! దాంతో తల్లీ కొడుకుల పేదరికమూ పోయింది; వాళ్లకు మంచిరోజులొచ్చాయి!