 
కలసి  సాగుదాం - బడికి కదులుదాం      
   అలుపు సొలుపు  మరచిపోయి      
   నడచి సాగుదాం!     
కొండవాగు  ఉరకలెత్తు మా అడుగులో    
   గుండె  ఊసులెన్నో  పొంగు  ఈ బాటలో    
   కలసి పాడుదాం-బడికి సాగుదాం    
   చెట్ట పట్ట  జట్టుకట్టి - కదలిసాగుదాం     
తెలుగు పూలు  రేకులెత్తి   పరిమళించగా    
   వెలుగు బాట  వికసించే  పదం పాడుదాం    
   కలసి పాడుదాం-బడికి సాగుదాం    
   గట్టు పుట్ట  మెట్టదాటి కదలిసాగుదాం      
కలం యోధులెందరినో తలచుకొందము     
   విజ్ఞాన శాస్త్రవేత్తలను  తెలుసుకొందము    
   తలపు పెంచుదాం - కలుపు తుంచుదాం    
   వెలుగు నీడ రాపిడిలో  విలువ  పెంచుదాం    
     
   చిత్తు  శుద్ధి, నమ్రతా వదిలి పెట్టము    
   నిరంతరం  శ్రమచేస్తాం - బద్ధకించము    
   మాట తప్పము - తప్పి  నడవము    
   బాటతప్పి  బూకరిస్తె   వదిలిపెట్టము    
అడ్డమయిన  బండరాయి  మెట్టుచేసుకొని     
   ఎగుడుమెట్ల   కుట్రల్ని   రచ్చకీడ్చుదాం    
   చిన్న  వాళ్ళందరికీ ఊతమిద్దము    
   చిన్న  చిన్న  అడుగులతో  ముందుకెళ్దాము.    
కదలి సాగుదాం - బడికి  కదులుదాం     
   చదువు  సార మెరిగి     
   బతుకు వెతలు  చెరుపుదాం.


