అనగనగా 'నగరి' అనే ఊళ్లో రంగన్న అనే పాల వ్యాపారి ఒకడు ఉండేవాడు. పాలల్లో నీళ్ళు కలిపి, ఆ కల్తీపాలనే ప్రక్క ఊళ్ళకు తీసుకెళ్ళి అమ్మి, అధిక లాభాలు గడించేవాడు వాడు. అయితేనేమి, చుట్టు ప్రక్కల నాలుగు ఊళ్ళకూ రంగన్న ఒక్కడే దిక్కు- "ఏం చేస్తాం" అనుకుంటూ అందరూ అతని వద్దే పాలు కొనేవాళ్ళు. అలా రంగన్న పాల వ్యాపారం మూడుపువ్వులు-ఆరుకాయలుగా సాగేది.
అయితే రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా, 'క్రాంతి' అనే మరో పాల వ్యాపారి వచ్చాడు ఊళ్ళోకి. చక్కని సీమ గేదెలు పది ఉన్నాయి, అతని దగ్గర. అతను మంచి వ్యాపారి కూడాను- దాంతో అతను రంగయ్యకు పోటీగా పాలు పితికి, నీళ్ళు కలపకుండా అమ్మటం మొదలు పెట్టాడు. ఇంకేముంది, రంగన్న దగ్గర పాలు కొనే వాళ్ళల్లో చాలామంది క్రాంతి అమ్మే పాల కోసం ఎగబడసాగారు.
ఇలా మూడు నెలలు గడిచేసరికి, 'మా ఊళ్ళో అడుగు పెట్టి, నా నోట్లోనే మన్ను కొడతాడా ఈ క్రాంతి?' అని రంగన్నకు అసూయ పుట్టనే పుట్టింది. ఎలాగైనా అతన్ని నష్టపరచా-లనుకున్నాడు. ఉదయాన్నే నిద్రలేచాక క్రాంతి తిరిగే దారి పక్కనే చిన్న గొయ్యి ఒకటి తీసాడు; దానిమీద ఒట్టి ఆకులు కొన్ని కప్పి ఉంచాడు. "ఎప్పుడైనా తెల్లవారు జామున- మసక వెలుతురులో కళ్ళు కనిపించక- పొరపాటున- క్రాంతి ఆ గొయ్యిలో కాలుపెట్టకుండా ఉంటాడా, అప్పుడు పాలకుండతో సహా పడిపోకుండా ఉంటాడా, కనీసం ఒక్క కాలన్నా బెణకకపోతుందా?" అని రకరకాలుగా ఊహించి పెట్టుకున్నాడు రంగన్న.
ఒకరోజు వేకువజామున రంగన్న ఎప్పటిలాగే పాలకుండను తల మీద పెట్టుకొని ఇరుగు పొరుగు ఊళ్ళకు బయలుదేరాడు. అప్పటికింకా తెల్లవారలేదు. సగం దూరం నడిచేసరికి అడవిలో "ఏయ్! ఆగు!" అని ఎవరో పిలిచినట్లు అనిపించింది. "ఇంత ప్రొద్దున్నే నన్ను పిలిచేదెవరా!" అని ఆశ్చర్యపోతూ వెనుకకు తిరిగాడు అతను.
ఒళ్ళంతా దుస్తులు ఉన్న ఒక ఆకారం గాలిలో తేలుతూ అతని ముందుకు వచ్చింది. దాని నోట్లో కోర పళ్ళు రెండు తళుక్కుమని మెరిసాయి. "ఎవరండీ మీరు? మీకు దారి చూపించాలా?" అడిగాడు రంగన్న, భయపడుతూనే.
"నాకు చాలా ఆకలిగా ఉంది, నీ రక్తం కావాలి" అన్నది ఆ ఆకారం కసిగా రంగన్న వైపు చూస్తూ.
రంగన్నకు చాలా భయం వేసింది. కెవ్వుమని అరుద్దామనుకున్నాడు; కానీ నోట్లోంచి శబ్దం వస్తే గద! అది భూతమే అని నిర్ణయమైపోయింది రంగయ్యకు. "మరి ఇప్పుడేం చెయ్యటం? భూతం నుండి తప్పించుకునేదెలాగ?" రంగన్న గందరగోళ పడ్డాడు.
"ఏమిటి, అట్లా చూస్తున్నావు?" అంది భూతం.
అకస్మాత్తుగా రంగన్నకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. పెద్దపెట్టున నవ్వాడు.
"ఏయ్! ఇంక కొన్ని క్షణాల్లో నువ్వు నాకు ఆహారం అయిపోతున్నావు, ఎందుకు నవ్వుతున్నావురా?" ఉరిమినట్లు అరిచింది భూతం.
"నీ అవివేకానికి నవ్వొచ్చింది"
"ఆc! ఏం కూశావ్?"
"అవివేకం కాకపోతే ఏమిటి? ఈ కడవలో ఉన్న కమ్మని పాలు తాగక, ఉప్పగా ఉండే రక్తం తాగుతావా? అసలు నీకు పాల మజా తెలుసా?" అన్నాడు రంగన్న.
"ఏమిటీ?! మనిషి రక్తం కంటే రుచిగా ఉంటాయా, పాలు?" ఆశ్చర్యంగా అడిగింది భూతం.
"కావలిస్తే చూడు- ఎంత తియ్యగా ఉంటాయో! ఒక్కసారి తాగావంటే చాలు- ఇంక మళ్ళీ దీన్ని వదిలిపెట్టవు!" అంటూ పాలకుండను అందించాడు రంగన్న.
భూతం గటగటా తాగేసింది ఆ పాలను. "అవునురోయ్! నువ్వు చెప్పింది నిజమే!" అని మూతి చప్పరించింది. "మీ మనుషులు ఇట్లా ఏవేవో కొత్త కొత్తవి కనుక్కుంటూనే ఉంటారే, ఎప్పటికప్పుడు!" అని మెచ్చు-కున్నది. "బాగుంది. ఇక ప్రతి రోజూ నువ్వు ఇట్లాగే నాకు పాలు తెస్తూ ఉండాలి" అని జోడించింది.
రంగన్నకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లయింది: "ఎలాగోలా ఈరోజుకు తప్పించుకోగలిగాననుకో- ఇక ప్రతిరోజూ పాలు తెచ్చివ్వాలట! మరి నా వ్యాపారం ఏం కాను?" అని ఏడుపొచ్చింది. అంతలో వాడి దుష్ట బుద్ధికి ఒక ఉపాయం తట్టింది.
"చూడు, నువ్వు ఈ నీళ్ళ పాలనే ఇంత మెచ్చుకుంటున్నావు, మరి అసలు పాలు రుచి చూశావంటే ప్రతిరోజూ అవే కావాలని కోరుకోవూ?!" అన్నాడు మర్యాద నటిస్తూ.
"అసలు పాలా? అవెక్కడ దొరుకుతాయి?" అన్నది భూతం, పాల రుచిని మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంటూ.
"కావలిస్తే కాసేపు ఇక్కడే ఉండు- నా వెనుకే ఇంకొకడు వస్తున్నాడు: చిక్కటి పాలు పట్టుకుని! వాటిని తాగావంటే అసలు పాల రుచి ఏంటో నీకు బోధ పడుతుంది" అన్నాడు రంగన్న, 'క్రాంతిని బాగా ఇరికించానులే' అని సంబరపడుతూ.
"అలాగా, అయితే నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను వాడి సంగతి" అంది భూతం.
"బ్రతుకు జీవుడా!" అనుకుంటూ రంగన్న అక్కడ నుండి అడ్డదారిన పడి ఊళ్ళోకి పరుగు తీసాడు: "భూతమూ వదిలింది; ఇంకా క్రాంతిగాడి బెడదా తప్పుతున్నది- ఒక దెబ్బకు రెండు పిట్టలు!" అనుకున్నాడు తృప్తిగా.
అయితే ఆసరికి అక్కడ క్రాంతి నిద్రలేచాడు; పాలుపితికాడు; పాల కుండను నెత్తిన పెట్టుకొని నడవటం మొదలు పెట్టాడు ఎప్పటి లాగానే.
కానీ దారి ప్రక్కన ఏనాడో రంగన్న తీసి పెట్టాడుగా, గొయ్యి? -ఆరోజున కాలు ఆ గుంతలో పడింది. ఇంకేముంది- వాడు బొక్క బోర్లా పడిపోయాడు; పాల బాన నేలమీద పడి వంద చెక్కలైంది; ఒక్క చుక్క కూడా మిగలకుండా పాలన్నీ నేలపాలయ్యాయి! అతనికి ఇప్పుడు రెండు బాధలు వచ్చి పడ్డాయి- "పాలన్నీ నేల పాలయ్యాయే" అన్నదొక బాధ. "నేను ఇచ్చే పాలకోసం ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారే; వాళ్లందరికీ జవాబు చెప్పుకోవాలే!" అన్నది మరో బాధ. "సరే, ఏం చేస్తాం! ఇవాల్టికి పాలు లేవని చెప్పి రావాల్సిందే, అందరికీ!" అనుకొని, వట్టి చేతులతోటే ముందుకు నడిచాడు క్రాంతి.
అంతలోనే భూతం వాడి ముందుకు దూకింది- "ఏయ్! ఆగు!" అని అరిచింది.
క్రాంతి ఆగాడు. భూతాన్ని చూసి వణికిపోయాడు.
"రేయ్! నేను వచ్చింది నీకోసం కాదులే! అంతగా వణికిపోకు. చిక్కటి పాలు తీసుకొస్తున్న మనిషి కనిపించాడా, నీకు ఎక్కడైనా-.. దారిలో?!" అడిగింది భూతం.
క్రాంతికి ప్రాణం లేచివచ్చింది. "లేదు- చూడలేదు. అయినా అతనితో నీకేం పని?" అడిగాడు.
జరిగిందంతా చెప్పింది భూతం, దాంతో రంగన్న పన్నాగం అర్థమైపోయింది క్రాంతికి. ఇప్పుడు తిరగబడి నవ్వటం అతని పనైంది.
"ఏయ్! ఏమిట్రా ఆ నవ్వు! భయపెడితే తిరగబడి నవ్వటం మీ మనుషులకు ఎక్కడ అలవాటైంది?" అడిగింది భూతం.
"నిజంగానే నువ్వొట్టి వెర్రిబాగులవాడిలాగా ఉన్నావు! ఆ రంగన్న పచ్చి మోసగాడు. ఇంతమందికి రోజూ పాలు పోసి మోసం చేస్తుంటాడే, వాడికి నువ్వొక లెక్కా? నీ నుంచి తప్పించుకోవడానికి ఎంత చక్కని అబద్ధం చెప్పాడో చూడు! మా ఊళ్ళో పాలు అమ్మే మోసగాడు వాడొక్కడే! కావాలంటే వేరే ఎవ్వరినైనా అడుగు- 'నగరి మొత్తంలోనూ పాలమ్మే మోసగాడు ఎవ్వరు?' అని అడిగి చూడు- 'రంగన్న' అని సమాధానం రాకపోతే నా మీసాలు తీయించుకుంటాను!" నవ్వుతూనే అబద్ధం కాని అబద్ధం ఒకటి చెప్పేశాడు క్రాంతి.
"ఆc! నన్నే మోసం చేస్తాడా! వాడికి తగిన బుద్ధి చెప్తాను ఆగు!" అని పళ్ళుకొరుకుతూ గాలికి కొట్టుకు పోయినట్లు రివ్వున ఎటోదూసుకు పోయింది భూతం. క్రాంతి ఊపిరి పీల్చుకున్నాడు.
ఇక అక్కడ సరిగ్గా రంగన్న ఇంటికి చేరుకునే సరికి భూతం ఊడిపడింది- "ఒరేయ్! నువ్వు నన్ను మోసం చేసావురా! నేను అంతటా అడిగి చూశాను- 'నగరి మొత్తంలోనూ పాలమ్మే మోసగాడివి నువ్వొక్కడివే' అని ప్రతి ఒక్కరూ చెప్పారు. నువ్వు చేసే మోసపు పనిని వేరే వాళ్ళమీదికి నెట్టుతున్నావు- నిన్నేం చేయమంటావు?" అని గుడ్లురిమింది.
ఇదంతా ఇలా తిరగబడి తనమీదికే వస్తుందనుకోలేదు రంగన్న. "ఏదో మోసం జరిగింది- కావాలంటే వాడి ఇల్లు చూపిస్తాను, నాతో రా!" అని గొణిగాడు.
"మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా? ఇంక నీ ఆటలు సాగవు. ప్రతి రోజూ నువ్వు నాకు కుండ నిండా పాలు తీసుకొని రావాల్సిందే. నీళ్లపాలు తెచ్చేవు- ఊరుకునేది లేదు! 'అసలు పాలు'అన్నావే, అవే తీసుకు రావాలి. లేదంటే ఇక నీ పని ఇంతటితో సరి! జాగ్రత్త!" అంటూ మాయం అయింది భూతం.
రంగన్న బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి. ఇక ఆనాటి నుంచీ ప్రతిరోజూ కడివెడు పాలు భూతానికి సమర్పించుకోలేక తప్పలేదు వాడికి!