అనగా అనగా ఒక ఊళ్లో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. అతను బాగా చదువుకుంటాడని పేరు. అతను ఒకసారి ప్రక్క ఊరికి పనిమీద వెళ్ళాడు. ఆ ఊళ్ళో అతనికి తండ్రీ-కొడుకులు ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ ఆ ఊళ్ళో కూలి పని చేసి, సాయంత్రంగా తమ ఊరికి బయలు దేరారు.
రాముకూడా తన పని పూర్తయ్యాక ఇంటికి బయలుదేరాడు. అయితే అతనికి బస్సులో ఆ తండ్రీకొడుకులే కనబడ్డారు మళ్ళీ!
ముగ్గురూ ఆనాటి విశేషాలు అవీ ముచ్చటించుకున్నాక, రాము అడిగాడు వాళ్లని- "ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు పెద్దయ్యా, మీరు?" అని. "చెన్నేకొత్తపల్లి పోవాలబ్బా!" అన్నారు వాళ్ళు. "అయ్యో, పెద్దయ్యా! ఇది చెన్నేకొత్తపల్లికి వెళ్ళే బస్సు కాదే! ఆ బస్సు ఇందాకే వెళ్ళిపోయింది కదా! మళ్ళీ రెండు గంటల వరకూ మరో బస్సు లేదు. నువ్వు నీ కొడుకుని చదివించే ఉంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదుగదా! దిగండి, ఇంకొంచెం సేపు అక్కడే కూర్చోండి- ఏంచేస్తాం?" అన్నాడు రాము వాళ్ళతో.
వాళ్ళిద్దరూ మారు మాట్లాడకుండా బస్సు దిగి నడుచుకుంటూ వెనక్కి పోయారు. ఆరోజు ఇంటికి చేరుకున్నాక, తండ్రికి నిద్ర పట్టలేదు. "మావాడిని కూడాచదివించి ఉంటే మాకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు, నిజమే!" అనిపించసాగింది ఆయనకు. "రేపటినుండీ వాణ్ణి బడికి పంపి చదివిస్తాను-" అని నిశ్చయించుకున్నాడాయన. అనుకున్నట్టుగానే తర్వాతి రోజునుండీ కొడుకును బడికి పంపి బాగా చదివించాడు. ఆ పిల్లవాడు కూడా మనసు పెట్టి చదివాడు. పెద్దయ్యేసరికి మంచి డాక్టరయ్యాడు.
పెద్దయ్యాక రాము వ్యాపారంలోకి దిగాడు. అయితే అతని ఆరోగ్యం అస్సలు బాగా లేకుండింది. అతనొకసారి కళ్ళు తిరిగి పడిపోయేసరికి, ఇంట్లోవాళ్ళు కంగారు పడి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. రాము చాలానే మారాడు- అయినా తండ్రీ కొడుకులిద్దరూ అతన్ని గుర్తుపట్టారు. అతన్ని తమ ఇంట్లోనే ఉంచి వైద్యం చేసి, బాగా చూసుకున్నారు.
బాగయ్యాక, రాము వాళ్లకు డబ్బులివ్వబోతే వాళ్ళు తీసుకోలేదు- "నువ్వు మాకు చేసిన సాయం ముందు ఇది ఏపాటిది? ఆరోజు నువ్వు గనక మాకు చదువు గురించి చెప్పకపోతే మేం ఏమై ఉండేవాళ్లం?" అన్నారు డాక్టరు గారు రాముకి కృతజ్ఞతలు చెబుతూ!