అడవిలో ఒక శుభోదయాన ఒక చక్కని ఎర్రగులాబీ వికసించింది.
ఆ అడవిలో రక రకాల మొక్కలు, చెట్లు- ఎన్నో ఉన్నాయి.
వికసించిన ఎర్రగులాబీ అందాన్ని చూస్తూ ఒక పైన్ చెట్టు అన్నదట–
“అబ్బ !! ఎంత అందమైన పువ్వు....నాకే అంతటి అందం ఉంటేనా!....”అని.
“ఏంచేస్తాం, చెప్పు! మనం కోరుకున్నంత మాత్రాన అన్నీ మన సొంత కావుగా!..” అంటూ మరో చెట్టు దాన్ని ఓదార్చిందట.
గులాబీకి చాలా సంతోషం వేసింది- "చూడబోతే ఈ అడవిలో నా అంత అందమైన మొక్కే ఎక్కడా లేనట్టుందే..." అని బయటికే అనుకుంటూ మురిసిపోయింది గులాబీ.
ఈ లోపల, సూర్యకాంతం మొక్కలోంచి పసుపు పచ్చ రంగు ముఖం ఒకటి, ఎర్రగులాబీ వైపు చూసి ఇలా అంది-
“అట్లా ఎందుకు అనుకుంటున్నావ్? ఈ అడవిలో అందమైన పూలు బోలెడున్నై! వాటిలో నువ్వు కూడా ఒకటి, అంతే!” ఈ మాటలు వినగానే గులాబీకి కోపం వచ్చేసింది. ఆ కోపంలో అది మరింత ఎర్రబడింది-
“ప్రతివాళ్ళూ నావైపు ఎంత ఆరాధనగా చూస్తున్నారో చూడు....నా అందం వాళ్ళని ఎంతగా ఆకట్టుకుంటోందో చూడు...!” అన్నదది, గర్వంగా.
గులాబీ పువ్వు అలా హుందాగా తల తిప్పుతూ, తన చుట్టూ ఉన్న తీగల్ని, మొక్కల్ని, చెట్లనూ- అన్నిటినీ గమనిస్తోంది. అలా చూస్తూంటే దాని దృష్టి తన పక్కనే ఉన్న నాగజెముడు మొక్కమీద పడింది-
“అబ్బ! ఏం మొక్కబాబూ, ఇది! ఒళ్ళంతా ముళ్ళే!! ఎంత అసహ్యంగా ఉందో..!” అని బిగ్గరగా అంటూ చీదరించుకుంది.
పైన్ చెట్టు ఇదంతా చూస్తూనే ఉంది-
“ఎర్రగులాబీ ! ఏమిటమ్మా ఈ మాటలు? తప్పుకదూ?! అందం అంతటా ఉందమ్మా. నీకు మాత్రం లేవూ ముళ్ళు?” అంటూ గులాబీ బాలను అది మందలించింది.
గర్వం తలకెక్కిన ఎర్రగులాబీ తల పొగరుగా ఊపుతూ పైన్ చెట్టును చూస్తూ -
“ఓహో!.అలాగా! మీకు గొప్ప అభిరుచి ఉందని అనుకున్నానే. అందం అంటే అసలు మీకు తెలీనే తెలీదన్నమాట! నా ముళ్ళు, ఆ నాగజెముడు ముళ్ళూ ఒకటేనా?! అదెక్కడ, నేనెక్కడ?!" అంది పొగరుగా.
ఎర్రగులాబీ మాటలు వింటున్న చెట్లన్నీ దాని పొగరును చూసి ఆశ్చర్యపోయాయి.
ఎర్రగులాబీకి తను ఉంటున్న ప్రదేశం ఏమాత్రం నచ్చలేదు. మరీ ఆ ముళ్ళ మొక్క పక్కనే ఉండవలసిరావటం అసలే నచ్చలేదు దానికి.
ఆ ముళ్ళ ముళ్ళ నాగజెముడు నుండి దూరంగా పోదామనుకున్నదది. తన వేళ్ళను బలంగా లాగేసుకుని, దానినుండి దూరంగా జరుగుదామని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఏమీ లాభం లేకపోయింది- ఒక్క అంగుళం కూడా కదల్లేకపోయింది.
ఎర్రగులాబీకి ఉక్రోషం ముంచుకొచ్చింది. 'తను నాగజెముడును ఏమీ చేయలేదు' అని అర్థమైపోయింది దానికి. ఇప్పుడు ఇక దాన్ని సూటిపోటి మాటలతో హింసించడం మొదలు పెట్టింది-
“ఛీ....ఏం మొక్క, ఇది?! దీనివల్ల ఎవరికి మాత్రం ఏం ఉపయోగం ఉంది?
ఓ పువ్వా...కాయా!? పైగా కంపరం పుట్టేట్లు, ఒళ్ళంతా ముళ్ళే!హుఁ -
నాలాంటి అందమైన మొక్కకు దీని పొరుగున ఉండవలసి రావటం! -ఎంత దురదృష్టం!” అని సణుగుతోంది గులాబీ.
నాగజెముడు వల్ల ఏ తప్పూ జరగలేదు- అయినా గులాబీ ఊరికే దాన్ని అట్లా ఆడిపోసుకుంటూనే ఉన్నది. అది ఎంత తిట్టినా గానీ, అది మాత్రం పాపం అస్సలు కోపగించుకోలేదు- పైపెచ్చు, ‘భగవంతుడి సృష్టిలో ఏదీ నిరర్థకం కాదు. ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది’ అని గులాబీకి చెప్తూ ఉండేది.
* వసంతకాలం గడిచిపోయింది. వాతావ-రణంలో వేడి ప్రారంభమైంది. అడవిలో జీవితం చాలా కష్టం కాసాగింది.
జంతువులు, మొక్కలు వేసవి వేడికి తట్టుకోలేక అల్లల్లాడాయి. ఒక్కవాన పడితే బాగుండునని తపించిపోయాయి. ఒక్క నీటిచుక్క కోసం వేసారిపోయాయి.

ఎర్రగులాబీకి కూడా కష్టాలు ప్రారంభమయ్యా-యి. పచ్చగా నవనవ-లాడుతూ ఉండేది గులాబీ- ఇప్పుడు అది వాడిపోవడం మొదలు పెట్టింది.
ఒక రోజు పిట్టలు కొన్ని వచ్చాయి. నాగజెముడు చుట్టూ చేరాయి. తమ ముక్కులని ఆ మొక్క లోకి గుచ్చి దేన్నో పీల్చుకున్నాయి. వెంటనే కొత్తజీవితం పొందినట్టుగా కిచకిచలాడుతూ సంతోషంగా ఎగిరిపోయాయి- ఇదంతా చూసింది, గులాబీ. దానికి ఆశ్చర్యం తో పాటు ఒక సందేహం కూడా కలిగింది-
“ఆ పిట్టలు నాగజెముడులో ఉన్న నీటిని తాగాయి” చెప్పింది పైన్ చెట్టు, గులాబీ అనుమానం అర్థమైనట్లు.
“అలాగా! పిట్టలు అలా ముక్కులతో గుచ్చి కన్నం పెడితే, మరి దానికి నొప్పెట్టదూ? బాధగా ఉండదూ?” అడిగింది గులాబీ.
“ఎందుకుండదూ. కానీ నాగజెముడుకు పిట్టలంటే చాలా ఇష్టం. అవి కష్ట పడితే తను భరించలేదు. అందుకే తనకి నొప్పెట్టినా, ఆ పిట్టల సంతోషం కోసం ఓర్చుకుంటుంది “ చెప్పింది పైన్ చెట్టు.
గులాబీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి అడిగింది- “నాగజెముడులో నీళ్ళు ఉంటాయా?” అని.
“అవును. కావాలంటే నువ్వు కూడా ఆ నీళ్ళు తీసుకోవచ్చు- దాన్ని అడిగితే తప్పకుండా సహాయం చేస్తుంది. ఆ పిట్టలతో చెప్పి, తనలోని నీళ్లను నీకు కూడా అందిస్తుంది”- అన్నది పైన్ చెట్టు.
గతంలో తను ఎలా ప్రవర్తించిందో గుర్తొచ్చి సిగ్గుపడింది, ఎర్రగులాబీ . 'దాన్ని అంతగా అవమానించి, బాధించాక- మళ్ళీ దాన్నే సహాయం కోరాలా?' అని తటపటాయించింది. కానీ ఏం చేస్తుంది పాపం?! నీళ్ళు లేక, ప్రాణం లాగేస్తూ ఉంటే, శరీరం అంతా ఎండిపోతూ ఉంటే-?
చివరకు నాగజెముడును సహాయం కోరనే కోరింది ఎర్రగులాబీ.
ఆ నాగజెముడు, పాపం- చాలా మంచిది. ఎర్రగులాబీ నోరు తెరిచి అడిగిందో లేదో- వెంటనే పిట్టలను పిల్చింది. తనలోని నీటిని పీల్చి ఎర్రగులాబీ వేళ్ళ దగ్గర పోయమని ఆదేశించింది వాటిని.
పిట్టలు నాగజెముడును గట్టిగా పొడిచి నీళ్ళను పీల్చాయి. ఆ నీళ్ళతో గులాబీ మొక్క వేళ్ళను తడిపాయి.
గులాబీకి ప్రాణం లేచివచ్చింది. మళ్ళీ పచ్చబడింది అది. కొత్త ఊపిరి పోసుకున్నట్టు నవనవలాడింది.
దానికి బుద్ధి వచ్చింది.
అంతేకాదు-
'బాహ్యసౌందర్యం కన్నా అంతః-సౌందర్యం గొప్పది' అని దానికి అర్థమయింది