ఒక ధనవంతుడి ఇంట్లో ఒక కుక్క, మేక, కోడి, రామచిలుక పెరుగుతున్నాయి.
ఒకరోజున "తమలో ఎవరు గొప్ప?" అనే చర్చ మొదలైంది, వాటి మధ్య .
ముందుగా కోడి ఇలా అన్నది: "నేను పెట్టిన గుడ్లతో మన యజమాని లక్షలు సంపాదించాడు. అంతే కాదు నా మాంసం కూడా వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అందుకని నేనే మీ అందరికన్నా గొప్పదాన్ని" అని.
అని అదివిని కుక్క నవ్వి , "పోవోయ్ , పెద్ద చెప్పొచ్చావ్! ఆయన లక్షలు సంపాదించినా, వాటికి కాపలా కాసేది నేనే కదా?! సంపాదించడం కన్నా, ఆ సంపాదించిన దాన్ని కాపాడుకోవడం మరింత కష్టం - కనుక నేనే మీ అందరికన్నా గొప్ప" అన్నది.
అప్పటిదాకా మౌనంగా ఉన్న మేక నవ్వుతూ అన్నది-"మనిషి ఎంత సంపాదించినా, ఆరోగ్యం కావాలి- లేకపోతే ఏం లాభం? నా పాలు తాగడం వల్లే మన యజమాని ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాడు. అంతే కాదు-గాంధీ తాత అంతటివాడు కూడా నా పాలు తాగేవాడు తెలుసా? అందుకని నేనే మీ అందరికంటే గొప్పదాన్ని" అన్నది మేక.
అప్పుడు పంజరంలోంచి అందరి మాటలూ వింటున్న చిలుక అన్నది: "మనిషికి ఎంత సంపద ఉన్నా, మానసిక ప్రశాంతత కరువైతే ఏం ప్రయోజనం? నా ముద్దు ముద్దు మాటలతో మన యజమానిని ఎంతగానో ఆనందపరుస్తున్నాను. ఆయన వ్యాపారరీత్యా ఎక్కడెక్కడో తిరిగి, అలిసిపోయి ఇల్లు చేరుకుంటాడు. ఆ సమయంలో ఆయనకు నా మాటలు ఎంతో ఆనందాన్ని కల్గిస్తాయి; శాంతినిస్తాయి. ఇప్పుడు చెప్పండి-'మీ అందరికంటే నేనే గొప్ప- ఒప్పుకుంటారా, లేదా?' అన్నది చిలుక.
ఇంతలో వాళ్ల వెనుక నుంచి 'నేను ఒప్పుకోను' అని వినిపించింది. వాళ్ల యజమాని మాటలు విని అవన్నీ ఉలిక్కిపడ్డాయి-
"మీ కన్నా గొప్పవాడిని నేనే! మీ అందరినీ నా అవసరాలకి ఉపయోగించుకుని నేను ఎన్నో పనులు చేయగల్గుతున్నాను. ఇంకా ఎన్నో క్రొత్త క్రొత్త విషయాలు కనిపెట్టగల్గుతున్నాను! కాబట్టి మీ అందరికంటే నేనే గొప్పవాడిని- ఏమంటారు?" అంటూ వాటివైపు చూశాడు.
అవన్నీ ఏకీభవిస్తున్నట్లు తలలు ఊపాయి.