చెన్నేకొత్తపల్లికి దగ్గర్లో ఒక కొండ ఉండేది. ఆ కొండ చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా కోతులు ఉండేవి, గుంపుగా. వాటిలో చాలా బలంగా ఉండే కోతులను అవి నాయకులుగా ఎన్నుకునేవి. అలా ఎంపికయ్యే కోతులు చాలా దూరం ఎగిరేవి; చాలా బాగా యుద్ధం చేసేవి. ఆ నాయకుల బలాన్ని, శక్తిని ఆధారం చేసుకొని, కోతులన్నీ అడవిలో సుఖంగా కాలం వెళ్ళబుచ్చేవి.
ఇలా ఉండగా ఆ అడవిలోకి ఎక్కడినుండి వచ్చిందో గాని, కొండముసవ ఒకటి వచ్చింది. అది మామూలు కోతులకంటే చాలా పెద్దగా ఉండేది. వాటి నాయకుల కంటే రెండు రెట్లు ఎక్కువ దూరం ఎగిరేది. దానికి వేరే తోడు కూడా ఎవ్వరూ లేరు! అందుకని అది ఈ కోతుల గుంపుతో స్నేహం చేయాలని ఉబలాట పడింది. అయితే మామూలు కోతులన్నీ దాన్ని చూడగానే పరుగు లంకించుకునేవి. దాన్ని ఏమాత్రం దగ్గరికి రానిచ్చేవి కావు. కోతి నాయకులుకూడా కొండ ముసవ గురించిన చెడు విషయాలను చిలవలు పలవలుగా చెప్పి, వాటి ఈ భయాన్ని మరింత పెంచినై. దాంతో అవన్నీ "ఈ కొండముసవను ఇక్కడినుండి ఎలాగైనా తరిమెయ్యాలి" అన్న నిర్ణయానికి వచ్చాయి.
ఒక రోజున ఆ కోతులన్నీ కలిసి సంఘం ఏర్పాటు చేసాయి. కొండ ముసవను కొండ నుండి తరిమేసేందుకు ఉపాయాలు ఆలోచించాయి. చివరికి ఒక కోతి "వేటకుక్కకు చెబితే అది దీని పని పడుతుంది"అన్నది. కోతులన్నిటికీ ఆ ఉపాయం నచ్చింది.
అవన్నీ కలిసి వేటకుక్కతో మాట్లాడేందుకు వెళ్లాయి. అన్నీ దూరంగా నిలబడి మాట్లాడితే "వినబడటం లేదే, కొంచెం దగ్గరికి వచ్చి చెప్పండి " అన్నది కుక్క. అవి ఇంకొంచెం దగ్గరికి జరిగాయి. "అయ్యో, ఇంకా వినబడటం లేదు" అన్నది కుక్క. అట్లా కోతులన్నీ వేటకుక్క దగ్గరికి వెళ్ళినై. చూసీ చూసీ ఒక్కసారిగా వాటి మీదికి దూకింది కుక్క. కోతులన్నీ చెల్లాచెదరు అయిపోయాయి. అయినా వేటకుక్క వాటిని వదలకుండా వెంటపడింది. అంతలో ఎక్కడినుండి వచ్చిందో మరి, కొండముసవ వచ్చి వేటకుక్కకు ఎదురుగా నిలబడింది. కోతులన్నీ దూరంగా ఉన్న చెట్లమీద కూర్చొని చూస్తూ ఉంటే, కొండముసవ ఒక్కతే కుక్కతో పోరాటం చేసింది. దాని ధాటికి తట్టుకోలేక చివరికి వేటకుక్కకూడా తోకముడిచి పారిపోయింది!
అప్పటికిగానీ కోతులకు కొండముసవ మంచితనం అర్థం కాలేదు. అవన్నీ కొండముసవకు కృతజ్ఞతలు చెప్పి, దాన్ని కూడా తమ గుంపులో చేర్చుకున్నాయి. ఆనాటినుండీ అన్నీ కలసి మెలసి ఉండసాగినై. కొండముసవ వాటికి కలసి పనిచెయ్యటం నేర్పింది. ప్రతిదానికీ నాయకులమీద ఆధారపడకుండా, 'ఎవరికి వాళ్ళు సొంత ప్రయత్నం చెయ్యాలి' అని చెప్పేదది. దాంతో కోతులన్నిటికీ స్వయంకృషి అలవడింది. సొంత శక్తి మీద ఆధారపడిన కోతులు అడవిలో మునుపటికంటే సుఖంగా జీవించసాగాయి.
కొన్నాళ్లకు కొండముసవ ముసలిదై చనిపోయింది. కోతులన్నీ చాలా బాధపడ్డాయి. వేటికవి కొండముసవ ఆదర్శాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.