అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో..
20‌30మే1వ తేదీ మధ్యాహ్నం...
పీటర్, వాళ్ల చెల్లి హైడీ ఇద్దరూ సముద్ర తీరానికి బయలు దేరారు. పిల్లలు స్నానం చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు అక్కడ వ్యవస్థలు ఏర్పాటు చేసి ఉన్నారు. సముద్రపు నీళ్ళు లోపలికి వచ్చేటట్లుగా లోతులేని చెరువులు తయారు చేసి ఉంచారు సముద్రం ప్రక్కనే- పిల్లలు స్నానం చేసేందుకూ, ఈత కొట్టేందుకూ వీలుగా.
నీళ్లను చూడగానే ఎగిరి గంతువేసి చెరువులోకి దూకింది హైడీ. పీటర్ కూడా సంతోషం పట్టలేక నీళ్ళలోకి దూకాడు. ఆ సంతోషంలో ఇద్దరూ గమనించనే లేదు- తమ వెనక ఏం జరుగుతోందో!
*

సరిగ్గా అంతకు పదేళ్ల క్రితం 2020లో...
సముద్రతీరానికి దగ్గర్లోనే ఒక దట్టమైన అడవిలాంటి ప్రదేశం ఉన్నది. పేరుకి అడవే గానీ, అందులోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. పెద్ద గోడ, గోడమీద బిగించిన కరెంటు తీగలు, తలుపుల దగ్గర నిలబడ్డ గార్డులు, వాళ్ళ చేతుల్లో మెరిసే అత్యాధునిక ఆయుధాలు, 'అనుమతి ఉంటేనే లోనికి ప్రవేశం' అన్న బోర్డులు, ఇవన్నీ ఆ ప్రదేశాన్ని మామూలు జనాలనుండి వేరుచేసి పెట్టాయి. నిజానికి అది ఒక ప్రయోగశాల.
ఆ ప్రయోగశాలలో డాక్టర్ జాన్సన్ చాలా కాలంగా తీవ్రమైన పరిశోధన చేస్తున్నాడు- లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఏలిన డైనోసార్లమీద. భూమి లోపలి పొరల త్రవ్వకాలలో లభించిన డైనోసార్ ఎముకల్లో ఒకదాని మజ్జను సేకరించి పరిశీలించిన డాక్టర్ జాన్సన్‌కు చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి తెలిసింది- ఆ మజ్జలో రెండు కణాల్లో ఇంకా జీవం ఉంది! వేలాది మృత కణాల నడుమన, ఆ రెండు కణాల్లో మాత్రం జీవం ఇంకా నిలచే ఉన్నది!
డాక్టర్ జాన్సన్ ఎంతో శ్రమకోర్చి ఆ కణాలను మిగిలిన కణాలనుండి వేరు చేశాడు. ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి, వాటికి సరిపోయే ఉష్ణోగ్రతను, ఆహారాన్ని అందిస్తూ ఓపికగా వేచిచూశాడు. త్వరలోనే ఆయన నిరీక్షణ ఫలించింది- ఆ కణాలు రెండూ పెరగటం మొదలు పెట్టాయి! మెల్లగా, వాటిలోని డియన్‌ఏకొక స్పష్టత ఏర్పడ్డది.. ఒక్కో కణమూ రెండైంది..ఆ రెండూ నాలుగైనాయి.. ఆపైన ఇక జీవం‌ ఊహించలేనంత త్వరగా పరిణామం చెందింది. డాక్టర్ జాన్సన్ చూస్తూండగానే రెండు చిన్న డైనోసార్లు- పూర్తిగా-స్వతంత్రంగా కదలాడే జీవులు-తయారయ్యాయి! డాక్టర్ జాన్సన్ ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. తెలిస్తే ఏం జరుగుతుందో ఆయనకూ తెలుసు: ప్రభుత్వం ఆయన ప్రయోగశాలను స్వాధీనం చేసుకుంటుంది! ఇక తన ప్రయోగాలన్నీ మూతబడిపోతాయి! తన డైనోసార్లను తను ఇక చూడలేడు!
అయితే ఆ డైనోసార్లు రెండూ పెద్దవౌతున్నకొద్దీ డాక్టర్ జాన్సన్‌కు బెంగ పట్టుకున్నది. అవి ఇప్పుడు చాలా బలంగా తయారైనై. చాలా ఆహారం కావలసి వస్తున్నది. అంతేకాక అవి ఇప్పుడు తన మాట వినటంలేదు!
ఆయన ఆ బెంగలో ఉండగానే అనుకోని అనర్థం ఒకటి జరిగిపోయింది- డైనోసార్లు రెండూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆయన ప్రయోగశాలను పూర్తిగా ధ్వంసం చేసేశాయి. ఆ శిధిలాలలో కూరుకుపోయి డాక్టర్ జాన్సన్ మరణించాడు. ఆయన సహాయకులు వాటిని బంధించేందుకు ప్రయత్నం చేసేసరికి, అవి బెదిరిపోయి, వీరంగం సృష్టించాయి. సహాయకులంతా పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు ఆ డైనోసార్ల ఆకలిని తీర్చేందుకు కూడా ఎవ్వరూ లేరు అక్కడ! దాంతో అవి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి, ఆ 'అడవికి' ఉన్న ప్రహరీగోడను కూల్చివేశాయి. ఆపైన ఇక అడ్డే లేకపోవటంతో జనావాసాల్లోకి పరుగులు పెట్టాయి- ఆహారంకోసం వెతుక్కుంటూ!
వాటిని చూసి మామూలు ప్రజలందరూ కకావికలయ్యారు. వాటి అరుపులకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరం మొత్తం దద్దరిల్లింది. అవి దారీ తెన్నూ లేకుండా పరుగెడుతుంటే, అడ్డు వచ్చిన భవంతులన్నీ కూలిపోయాయి. చివరికి అవి సముద్రతీరం చేరుకున్నాయి!
*

2030 మే 1వ తేదీ సాయంత్రం...
ఏవో అరుపులు వినబడితే వెనక్కి తిరిగిచూసిన పీటర్‌కు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. డైనోసార్లు! రెండు! ఒకటేమో, వాతావరణ కేంద్రం వెనక నిలబడి చూస్తోంది. ఒకటేమో, దీపస్థంభాన్ని చుట్టుకొని గర్జిస్తోంది, భీకరంగా. తామిద్దరూ తప్ప, అక్కడ మరెవ్వరూ నేలమీద నిలబడి లేరు! వాటిని నియంత్రించేందుకే కాబోలు, ఒక హెలికాప్టర్ వచ్చి ఆగి ఉన్నది. ఆకాశంలో యుద్ధవిమానం ఒకటి గింగిరాలు కొడుతున్నది. క్రేన్లు, పవర్‌హోలు వచ్చి ఉన్నై. వాటిలో కూర్చొని ఉన్న మనుషుల్ని చూసి, డైనోసార్లు రెండూ కోపంతో గర్జిస్తున్నై!
"హైడీ! చూశావా, డైనోలు!" అంటూ వెనక్కి తిరిగిన పీటర్‌కు హైడీ కనబడలేదు. ఆ సరికే ఆ పాప లేచి ఒక డైనోసార్ దగ్గరికి పరుగు పెట్టింది-ఆగమన్నట్లు చేతులు చాపి!
డైనోసార్ పళ్ళు సూర్య కిరణాల వెలుగులో మిలమిలా మెరుస్తున్నాయి. డైనోసార్లు రెండూ ఆ పళ్లను నూరుతూ అరుస్తుంటే దిక్కులు పిక్కటిల్లుతున్నై. "హైడీ! ఆగు! ప్రమాదం!ఇంకా ముందుకి పోకు! అది మింగేస్తుంది!"అని అరుస్తూ ముందుకు పరుగెత్తాడు పీటర్.
'హైడీని నమిలేద్దాం' అన్నట్లు ముందుకి దూకింది డైనోసార్. "ఆగు" అని అరుస్తూ పీటర్ తన బొమ్మ తుపాకీని పట్టుకొని బెదిరించేందుకు ప్రయత్నించాడు. అంత పెద్ద డైనోసార్ బొమ్మ తుపాకీని పట్టించుకుంటుందా?! అది ముందుకి దూకి, నాలుకను బయటికి చాపి, హైడీని నాకింది- బరువుగా, తడిగా. ఆ ఊపుకి హైడీ క్రింద పడిపోయింది.
అంతలో ఏమైందో ఏమో- ఆ డైనోసార్ ఆగిపోయి హైడీ వైపు చూసింది. మళ్ళీ నాలుక చాపి హైడీని అద్దుకొని, ఎత్తి నేలమీద నిలబెట్టింది. నాలుకను నోటిలోపలికి జరుపుకొని, పళ్లన్నీ బయటపెట్టి, బిగ్గరగా అరిచింది. హైడీకి అర్థమైంది- అది తన స్నేహాన్ని కోరుకుంటోంది!
అంతలోనే పైనున్న విమానంలోంచి దూసుకు వచ్చిన మందు బుల్లెట్లు డైనోసార్లకు తగిలాయి బలంగా. ఒక్క నిముషంలో అంత పెద్ద జంతువులూ ఏదో నిద్ర ముంచుకొచ్చినట్లు తూగుతూ క్రింద పడిపోయాయి. "డైనో! ఓ డైనో!" అని ఏడుస్తూ వాటిని తడుముతోంది హైడీ. పీటర్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అంతలోనే అక్కడికి దూసుకు వచ్చిన అధికారులు వాళ్ళిద్దరినీ అక్కడినుండి పంపించేశారు.
ఒక అరగంటలో ఆ రెండు డైనోలనూ ఎవరికీ తెలియని ప్రదేశానికి తరలించేశారు.
తర్వాత ఒక సంవత్సరానికి పేరులేని వార్తా పత్రిక ఒకదానిలో మూలగా చిన్న వార్త ఒకటి ప్ర్రచురితమైంది-"ప్రయోగాత్మకంగా సృష్టించిన డైనోసార్లు రెండు ప్రయోగశాలలోనే మరణించాయి- దీనితో డైనోసార్లను మళ్ళీ భూమిమీద తిరిగేటట్లు చెయ్యచ్చు అన్న ఆలోచన నెరవేరని కోరికే అని తేలిపోయింది" అని.
సాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం సృష్టించిన డైనోసార్లను నిజంగా చూసినవాళ్ళు ఎవ్వరూ ఆపత్రికను చదవనేలేదు! వాళ్లంతా ఇంకా అవి ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నాయనే అనుకుంటున్నారు!