చుట్టూ పచ్చని పొలాలతో, చక్కని వ్యవసాయంతో ముచ్చటగొలుపుతూ ఉండేది గంగేపల్లి గ్రామం. ఊళ్ళో ప్రతి ఇంటి చుట్టూ ఒక తోట ఉండేది. ఇంట్లో వాడుకున్న నీళ్ళతోటే ఆ తోటలన్నీ పెరిగేవి. ఊరి అవసరాలకు కావలసిన కాయగూరలు, ఆకు కూరలు అన్నీ ఆ ఊళ్ళోనే పండేవి.
వాళ్ళ ఈ సౌభాగ్యానికి కారణం వాళ్ళు కొలిచే కప్ప దేవతలే అని ఊళ్ళో వాళ్లందరి విశ్వాసం. కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వానలు పడతాయని వాళ్ల నమ్మకం. ఊళ్ళో ఎవ్వరూ కలలో కూడా కప్పలకు హాని తలపెట్టేవాళ్ళు కాదు. అలా ఆ ఊళ్ళో కప్పలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయినై.
ఊళ్ళో ఒక బుగ్గబావి ఉండేది. వందలాది ఎకరాల భూమికి సరిపడే నీళ్ళు ఊరుతుండేవి అందులో. ఆ బావిలో ఎన్ని నీళ్ళున్నాయో అన్ని కప్పలు ఉన్నాయి- రోజూ తెల్లవారిందంటే వాటి బెక బెకలకు బావి చుట్టూ వేసిన వరలు విరిగి పడిపోతాయేమో అనిపించేది.
ఆ బావిలో నివసించేవి, కదిరప్ప-ముదిరమ్మ అనే కప్ప దంపతులు. తరతరాలుగా వస్తున్న కప్ప సాంప్రదాయాల్ని అవి తు.చ. తప్పకుండా పాటించేవి: ఆ బావిని విడిచి ఎక్కడికైనా వెళ్ళాలన్న ఆలోచన వాటికి ఏనాడూ రాలేదు. వాటి ప్రపంచం మొత్తం ఆ బావే.
అయితే వాటి పిల్లలు: కందినప్ప, వరదప్ప, మారెప్ప, చందనప్ప అనేవాటికి మాత్రం బావిలో రొదకు చెవులు పగిలిపోతున్నట్లు అనిపించేది. 'ఈ బావి అవతల ఇంకా చాలా ప్రపంచం ఉంటుంది- మనకు పెళ్ళిళ్ళు చేసే మనుష్యులు అక్కడే ఉంటారు- మనం అక్కడికి వెళ్ళి చూడాలి, ఒకరోజు- ఎలాగైనా మనవాళ్ళు చేసే ఈ రొదనుండి దూరంగా పారిపోవాలి' అనుకునేవవి.
ఒక సారి విపరీతమైన గాలివాన ఒకటి వచ్చింది. గాలి తాకిడికి బావి అంచున ఉన్న వేపచెట్టొకటి, విరిగి, బావిలోకి పడి వ్రేలాడసాగింది. "చూశారా! బావి బయట వేరే ప్రపంచంఏదో ఉంది, చాలా పెద్దది! లేకపోతే ఇంత పెద్ద చెట్టు ఎక్కడినుండి పడుతుంది? దీన్ని పట్టుకొని ఎక్కి చూస్తే, పైన ఏముందోతెలుస్తుంది- రండి ఎక్కుదాం!" అన్నాయి ఆ నాలుగు కప్ప పిల్లలూ.
"మంచి ఆలోచన- నేను ముందు ఎక్కుతాను-మీరు ఆగండి-చూడండి" అని అరుచుకుంటూ అన్ని కప్పలూ ఒకదాన్నొకటి నెట్టుకుంటూ, త్రోసుకుంటూ చెట్టుకొమ్మమీదికి ఎక్కేందుకు ప్రయత్నించాయి. వాటికి వేటికీ చెట్టెక్కడమే రాదు; అదీగాక నెట్టుకుంటున్నై- ఒకదానిని ఒకటి క్రిందికి లాగుతున్నై! ఇక ఎలాగ, ఎక్కేది? చివరికి అన్నీ అలసిపోయి, చతికిలబడ్డాయి.
అప్పుడు కందినప్ప ముందుకు వచ్చింది- అందరినీ ప్రక్కకు నెట్టి, తను చెట్టెక్క జూసింది- 'ఇంతమందిమి ఎక్కజూశాము; మాలో ఎవ్వరివల్లా కాలేదు; నీవల్ల ఏమౌతుంది?' అని ఎగతాళి చేసినాయి, మిగిలిన కప్పలన్నీ. కందినప్ప కుంగిపోయింది. వాళ్ళ మాటలకు లొంగి పోయింది. తన ప్రయత్నాన్ని విరమించుకున్నది.
ఇక వరదప్ప ముందుకు వచ్చింది. బడాయి మాటలు మాట్లాడింది. మిగిలిన కప్పలన్నిట్నీ చిన్నబుచ్చింది. వాటికి ఏమీ రాదన్నది- అన్నీతనకే వచ్చన్నది. బీరాలు పలికింది- 'ఒంటి చేత్తో చెట్టెక్కేస్తా, చూడండి' అన్నది- చెట్టెక్క జూసింది; ఎక్కలేక జారిపడింది.
'అయ్యో! ఇంతమంది ప్రయత్నించి విఫలులయ్యారే, ఇక నావల్ల ఏమౌతుంది?' అని నిరాశపడ్డది, చందనప్ప. ఆ నిరాశలో అది ఎక్కేందుకు ప్రయత్నించనే లేదు. ప్రయత్నించి ఉంటే అది ఎక్కగలిగి ఉండేది; కానీ ఆ సంగతి దానికి తెలీదు గద, అందుకని అది ప్రయత్నం చెయ్యనేలేదు!
వీళ్ళందరినీ జాగ్రత్తగా గమనించింది, మారెప్ప. 'ఎవరేమన్నా నిరాశ చెందగూడదు' అని మనసును గట్టి పరచుకున్నది; 'గొప్పలు చెప్పుకోను- నా శక్తి సామర్ధ్యాలను పనిలోనే చూపుతాను' అని నిశ్చయించుకున్నది. ఎవ్వరితోటీ ఏమీ మాట్లాడలేదు- జాగ్రత్తగా కొమ్మను పట్టుకొని, మెల్లగా ఎక్కేసింది, పైవరకూ! తాము ఇంతకాలమూ బ్రతికిన బావిని మించిన ప్రపంచం ఆ కొమ్మకు అవతల దాగుందని స్వయంగా తెలుసుకొనగలిగింది అది. తమను ఇంతకాలంగా పీడించిన రొద నుండికూడా విముక్తి పొందగలిగింది!
మనం నివసించే ఈ ప్రపంచం చాలా పెద్దది- ఊరికే బావిలో కప్పలమాదిరి జీవించకుండా, మనల్ని అన్నివేళల్లోనూ ప్రభావితంచేసే అంశాలను పరిశోధించి తెలుసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఎవరు ఎన్ని మాటలాడి నిరాశ పరచాలని చూసినా, మనం మన ప్రయత్నాన్ని వీడకూడదు- మన గమ్యాన్ని మరచిపోకూడదు.